ఆగిన సురేశ్ ఊపిరి.. ఎంత రాత్రయినాసరే ఇవాళే..

ఆగిన సురేశ్ ఊపిరి.. ఎంత రాత్రయినాసరే ఇవాళే..
x
Highlights

తీవ్ర సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మరణించాడు. నాలుగు రోజులుగా ఉస్మానియా ఆస్పత్రిలో...

తీవ్ర సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సురేష్ మరణించాడు. నాలుగు రోజులుగా ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేష్‌ స్కిన్ బర్న్ సెప్టిక్‌తో మృత్యువాతపడ్డాడు. విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించినప్పుడు సురేష్ కు కూడా మంటలు అంటుకోవడంతో 65శాతానికి పైగా శరీరం కాలిపోయింది. దాంతో, సురేష్‌కు మొదట ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి ఆ తర్వాత ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. అయితే, నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న సురేష్‌ ఇవాళ మరణించాడు.

పోస్టుమార్టం తర్వాత సురేష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే, ఎంత రాత్రయినాసరే ఇవాళే సురేష్ అంత్యక్రియలు పూర్తి చేయాలని పోలీసులు సూచించారు. ఇక, సురేష్ స్వగ్రామం గౌరెల్లిలో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. సురేష్ అంత్యక్రియల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.

తహశీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటనలో మొత్తం ముగ్గురు మృత్యువాతపడ్డారు. తహశీల్దార్ విజయారెడ్డి స్పాట్‌లోనే మరణించగా, ఆమె డ్రైవర్ గురునాథం రెండోరోజు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇక, నిందితుడు సురేష్‌ ఉస్మానియా ఆస్పత్రిలో మరణించాడు.

వివాదాస్పద భూమికి పట్టా ఇవ్వలేదన్న కోపంతోనే తహశీల్దార్‌ విజయారెడ్డిని సజీవదహనం చేసినట్లు నిందితుడు సురేష్ తన వాంగ్మూలంలో తెలిపాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టా ఇవ్వకపోవడంతోనే ఆ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పాడు. సోమవారం మధ్యాహ్నం చివరిసారిగా మరోసారి విజ్ఞప్తి చేశానని కానీ విజయారెడ్డి పట్టించుకోకపోవడంతో తిరిగి పెట్రోల్‌ డబ్బాతో వెళ్లి తగలబెట్టానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

అయితే, సురేష్‌ అంత క్రూరుడు కాదని, అతడ్ని ఎవరో రెచ్చగొట్టి ఆ పని చేయించారని కుటుంబ సభ్యులు అంటున్నారు. సురేష్‌ను రెచ్చగొట్టి ఆ పని చేయించిన వారెవరో తేల్చాలని ఫ్యామిలీ మెంబర్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, సురేష్ కాల్ డేటా ఆధారంగా, ఇప్పటికే కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories