Kancha Gachibowli Lands: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్

Supreme Court verdict on Kancha Gachibowli lands row, warns Telangana govt to restore 100 acres of land or face jail
x

Kancha Gachibowli Lands: కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీం కోర్టు సీరియస్ వార్నింగ్

Highlights

Supreme Court warning to Telangana govt over Kancha Gachibowli lands: సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

Supreme Court verdict on Kancha Gachibowli lands: కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల స్థలంలో చెట్ల నరికివేత విషయంలో సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. బుధవారం సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. 3 రోజుల్లోనే 100 ఎకరాల చెట్లు నరికివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అది కూడా సెలవు దినాలు చూసుకుని ఆ పని చేయడం వెనుక ప్రభుత్వ ఆంతర్యం ఏంటని కోర్టు నిలదీసింది.

అటవీ ప్రాంతంలో అభివృద్ధి పేరుతో చెట్లు కొట్టేసే ముందు సంబంధిత అధికార యంత్రాంగం వద్ద అనుమతి ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది.

ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు చెట్లు నరికిన 100 ఎకరాల్లో పూర్వస్థితిని ఎలా తీసుకొస్తారో చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. లేదంటే తాత్కాలికంగా జైలుకు వెళ్లేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండండి అని హెచ్చరించింది. మీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాలనుకుంటే 100 ఎకరాల్లో పూర్వ స్థితిని తీసుకొచ్చే ప్రణాళికతో రండి అని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. తదుపరి విచారణను మే 15వ తేదీకి వాయిదా వేసింది. జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ ఏ.జి. మసిలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు

కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం వేలం వేయాలని భావిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా అక్కడున్న చెట్లను నరికి భూమిని చదును చేయడం మొదలుపెట్టింది. అయితే, ఈ భూముల వేలాన్ని ముందు నుండీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లతో పాటు సామాజిక వేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు వెళ్లిన విద్యార్థులు, ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ వివాదం సుప్రీం కోర్టు వరకు చేరింది.

చెట్ల నరికివేతను అడ్డుకుంటూ ఏప్రిల్ 3నే సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ఆ ఆదేశాలకు కొనసాగింపుగా ఆ స్థలాన్ని మళ్లీ యధాతధ స్థితికి ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రశ్నించింది. లేనిపక్షంలో చెట్ల నరికివేతకు బాధ్యులైన అధికారులు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించింది. సుప్రీం కోర్టు ఆదేశాలపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందించనుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories