రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court Key Comments on Political Parties
x

రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Highlights

Supreme Court: ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమన్న సుప్రీంకోర్టు

Supreme Court: రాజకీయ పార్టీల ఉచిత హామీలపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉచిత హామీలు ఒక్కటే ఎన్నికల్లో గెలుపును నిర్ణయిస్తాయని చెప్పడం కూడా సరైందికాదని వ్యాఖ్యానించింది. పార్టీలు ఇచ్చే ఉచిత హామీల కిందకు ఏవి వస్తాయి..? ఏవి రావో తేల్చడం చాలా కష్టంగా మారుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని స్పష్టం చేసింది. అయితే ఈ ఉచిత హామీల అంశాన్ని తేల్చేందుకు ఓ కమిటీని నియమించాలని అనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఎన్నికల ప్రయోజనాల కోసం ఓటర్లకు ఉచితాలను పంపిణీ చేయడానికి పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను నియంత్రించాలంటూ న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎన్నికల సమయంలో మేనిఫెస్టోను నియంత్రించేలా కేంద్రాన్ని, ఎన్నికల సంఘాన్ని నిర్ధేశించాలని..ఇలాంటి ఉచిత వాగ్దానాలకు రాజకీయ పార్టీలను జవాబుదారీగా చేయాలని పిటిషనర్ అశ్వినీకుమార్ కోరారు. ఈ పిటిషన్‌లో వాదనల కోసం తమను కూడా చేర్చుకోవాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెైస్, డీఎంకే కూడా పిటిషన్లు దాఖలు చేశాయి. అంతేకాదు..ఉచితాలపై తమ వాదన కూడా వినాలంటూ YSRCP సైతం సుప్రీంకోర్టులో ఇంటర్‌వెన్షన్‌ పిటిషన్ దాఖలు చేసింది. అమ్మఒడి, వైద్యం, విద్య అందరికీ అందించడం ప్రభుత్వ బాధ్యత అంటూ పిటిషన్‌లో పేర్కొంది. గ్రామీణ, పట్టణల్లో ఉన్న తారతమ్యాలను తొలగించడం ప్రభుత్వాల ప్రాథమిక విధి అంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. సంక్షేమ పథకాలను ఉచితాల గాటన కట్టలేమని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.

రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా అడ్డుకోలేమని మరోసారి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు చేసే ఉచిత వాగ్ధానాల అంశాన్ని తప్పకుండా పరిశీలిస్తామన్న సుప్రీంకోర్టు..ఆ అంశంలో నిబంధనలు ఉల్లంఘించిన రాజకీయ పార్టీలను రద్దు చేయాలన్న విజ్జప్తి జోలికి మాత్రం వెళ్లబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కొన్ని పార్టీలు అనేక వాగ్దానాలు చేసినప్పటికీ ఎన్నికల్లో గెలవలేకపోతున్నాయి. ఓటర్లేమీ ఉచితాల కోసం ఎదురుచూడరని...అవకాశముంటే గౌరవప్రదమైన ఆదాయ మార్గం కోసమే వాళ్లు ప్రయత్నిస్తారని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలు పౌరులు గౌరవంగా జీవించేందుకు ఉపయోగపడుతుందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

అయితే ఏది సరైన హామీ అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్నగా మారిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఉచిత విద్య, వైద్యం, తాగునీరు అందించడం వంటి వాటిని ఉచితాలుగా పరిగణించాలా..? లేక కన్స్యూమర్ ఉత్పత్తులు, ఉచిత ఎలాక్ట్రానిక్ వస్తువులను సంక్షేమ పథకాలుగా అభివర్ణించాలా ? ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి సరైన మార్గం ఏంటనే దానిపై దృష్టి పెట్టాలని కోర్టు తెలిపింది. ఉచితాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కొందరూ..లేదు లేదు అవన్నీ సంక్షేమ పథకాలని మరికొందరు చెప్తున్నారు. అందుకే ఉచితాలపై చర్చించి సూచనలు చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దీనిపై సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పిటిషన్ దారులకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories