మనిషిని మింగేస్తున్న వింత వ్యాధి

మనిషిని మింగేస్తున్న వింత వ్యాధి
x
Highlights

కాళ్లలో మొదలై చేతుల వరకు ఆ పై చెంపల వరకు వ్యాపిస్తుంది. ఉన్నట్టుండి నరాల్లో శక్తి తగ్గుతుంది. చిన్నారి నుంచి యువకుల వరకు అంతలోనే మంచంపై పడతారు. అంతే...

కాళ్లలో మొదలై చేతుల వరకు ఆ పై చెంపల వరకు వ్యాపిస్తుంది. ఉన్నట్టుండి నరాల్లో శక్తి తగ్గుతుంది. చిన్నారి నుంచి యువకుల వరకు అంతలోనే మంచంపై పడతారు. అంతే చావే రావాలి కానీ ఆ వ్యాధి మాత్రం పోదు. ఆదిలాబాద్‌ జిల్లా రాజులగూడ గ్రామంలో విజృంభిస్తున్న వింత వ్యాధిపై హెచ్‌ఎంటీవీ ప్రత్యేక కథనం.

ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం రాజులగూడ గ్రామం. 30 కుటుంబాలు, 150 మంది జనాభా మాత్రమే ఉన్న ఈ గ్రామం అడవికి దగ్గరగా ఉంటుంది. పచ్చటి ప్రకృతి అందాలకు కొదువలేని ఈ గ్రామాన్ని ఓ వింత వ్యాధి పట్టి పీడిస్తోంది. ఈ ఆదివాసీలు ఏం పాపం చేశారో కానీ ఆ వింత వ్యాధికి బలవుతూనే ఉన్నారు.

గత పదేళ్ల నుంచి గ్రామంలోని ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు ఈ వింతవ్యాధికి బలవుతూనే ఉన్నారు. చిన్నారి నుంచి ముసలివారి వరకు మంచం పట్టడం చివరికి తుదిశ్వాస విడవడం సాధారణంగా మారిపోయింది. ప్రతీ ఇంట్లో ఎవరో ఒకరు ఈ వింత వ్యాధికి బలైనవారు కనిపిస్తారు. ముందుగా కాళ్ల నుంచి నొప్పి మొదలై చేతులకు వ్యాపిస్తుంది. ఆ తర్వాత చెంపల దగ్గర వాపు వస్తుంది. ఆ తర్వాత కీళ్ల నొప్పులు తీవ్రమవడంతో స్థిమితంగా కూర్చోలేక, నిలబడలేక శరీర ఆకృతి సన్నగా మారి చివరకు మరణం సంభవిస్తుంది.

ప్రస్తుతం గ్రామంలో చాలామంది ఈ వింతవ్యాధికి బలై ప్రాణభయంలో బతుకీడుస్తున్నవారే కనిపిస్తారు. అయితే ఈ వింతవ్యాధి ఏమిటో ఎందుకు వస్తుందో తెలియని ఈ అమాయక ఆదివాసులు తమను ఆదుకునే వారికోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంపై జిల్లా వైద్యాధికారులను హెచ్‌ఎంటీవీ బృందం సంప్రదించింది. ఈ విషయం ఇటీవలే తమ దృష్టికి వచ్చిందని.. వెంటనే సిబ్బందిని అక్కడికి పంపించినట్లు వివరించారు. ఈ వింత వ్యాధి కారణాలను తెలుసుకునే క్రమంలో గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. కిడ్నీ సంబంధిత వ్యాధి అయి ఉండొచ్చనే అనుమానాలున్నాయని చికిత్స తర్వాతే ఏ విషయం తెలుస్తుందని వైద్యులు వెల్లడించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories