Top
logo

పోరాట స్ఫూర్తి.. సువర్ణ రాష్ట్ర చరితా సృష్టి.. తెలంగాణా!

పోరాట స్ఫూర్తి.. సువర్ణ రాష్ట్ర చరితా సృష్టి.. తెలంగాణా!
X
Highlights

తెలంగాణా ఒక పోరాటం..తెలంగాణా ఓ చరిత్ర..తెలంగాణా ఓ ధైర్యం.. తెలంగాణా ఓ తెగింపు.. ఇలా ఎన్ని చెప్పుకున్నా...

తెలంగాణా ఒక పోరాటం..తెలంగాణా ఓ చరిత్ర..తెలంగాణా ఓ ధైర్యం.. తెలంగాణా ఓ తెగింపు.. ఇలా ఎన్ని చెప్పుకున్నా సరిపోవు. పోరాడి సాధించుకున్న రాష్ట్రం. ఒక పోరాట నాయకుడు ప్రజానాయకుడిగా బంగారు స్వప్నాన్ని నిజం చేస్తున్న వైనం. మాకూ ఒక రాష్ట్రం కావాలి అనే పోరాటం నుంచి మేము సువర్ణ రాష్ట్రాన్ని ఆవిష్కరిస్తాం అనే పట్టుదల వరకూ ఎన్నో త్యాగాలు.. మరెన్నో అడ్డంకులు అన్నిటినీ అదే పోరాట స్ఫూర్తితో ఎదుర్కుంటూ ముందుకు సాగుతున్న తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం నేడు. ఈ సందర్భంగా తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం.. తెలంగాణా గొప్పతనం ఒక్కసారి మననం చేసుకోవడం సమంజసం. ఆరేళ్లుగా అభివ్తుద్ది పధంలో తెలంగాణాను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న కేసీఆర్ కలల సువర్ణ తెలంగాణా ప్రత్యేకతలు ఎన్నెన్నో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ విశేషాలు మీకోసం..

పోరాట బాటలో..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది దశాబ్దాలుగా పోరాడి ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. ఎన్నో ఏండ్లు పోరాడి చివరికి 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక కాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆ తరువాత తెలంగాణా రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారధ్యంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో భౌగోళిక మార్పులను తీసుకొచ్చింది. 2016 అక్టోబర్ కు ముందు 10 జిల్లాలుండే రాష్ట్రాంలో కొత్తగా మరో 23 జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాన రాష్ట్రం ఏకంగా 33 జిల్లాలకు పెరిగి పెద్ద రాష్ట్రంగా మారింది. కొత్త పోలీసు కమిషనరేట్ లు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు, కొత్త గ్రామ పంచయితీలను ఏర్పాటు చేసింది.

కొత్త జిల్లాలు ఏర్పాటు కాక ముందు ప్రజలు కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలకు, కార్యాలయాలకు వెళ్లాలంటే 200 నుంచి 250 కి.మీ.ల దూరం ప్రయాణం చేయవలసి వచ్చేది. కానీ కొత్త జిల్లాలు ఏర్పడడంతో అతి తక్కువ దూరంలోనే వెళ్లి ప్రజలు తమ పనులను పూర్తి చేసుకుంటున్నారు. అంతే కాదు పాత జిల్లాలు ఉన్పప్పుడు ఒక్కో జిల్లాలో సగటున 35 లక్షలకు పైగా జనాభా ఉండడంతో అధికారులకు పరిపాలన కూడా కష్టతరమయ్యేది. అంతే కాదు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ ఎంతో కష్టమయ్యేది. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం కూడా అధికారులకు కష్టంగా వుండేది. కానీ కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత అదంతా సులభతరం అయింది.

హైకోర్టు విభజన జడ్జీల కేటాయింపు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనంతరం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైకోర్టు కూడా విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడిగా కొనసాగిన హైదరాబాద్ హైకోర్టు, 2018 డిసెంబర్ 31 విభజన పూర్తయింది. విభజన అంనంతరం ఆంధ్రకు 58 - తెలంగాణకు 42 నిష్పత్తిలో జడ్జిలను విభజించారు. అందులో భాగంగా 16 మందిని ఆంధ్రకు, 10 మందిని తెలంగాణకు కేటాయించారు. అయితే, ఇప్పటివరకు ఇరు రాష్ర్టాలకు కేటాయించని ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర ఎస్ చౌహాన్, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌ను తెలంగాణ హైకోర్టుకు కేటాయించారు. దీంతో తెలంగాణ న్యాయమూర్తుల సంఖ్య 12కు చేరింది.

కొత్తగా పోలీస్ కమిషనరేట్లు, డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్ స్టేషన్లు

రాష్ట్రం ఏర్పడిన తొలి నాల్లలో రాజధానిలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీసుకమిషనరేట్లు మాత్రమే వుండేవి. కానీ పెరుగుతున్న జనాభాను, నేరాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 7 పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అంతే కాక 2016 జూన్ 23న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ను రెండుగా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక వరంగల్ నగరాన్ని 2015 జనవరి 26న పోలీస్ కమిషనరేట్ గా ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటుగానే నిజామాబాద్, కరీంనగర్, రామగుండం, సిద్ధిపేట, ఖమ్మం లో పోలీస్ కమిషనరేట్లను కూడా ఏర్పాటు చేసింది. వాటితో పాగు రాష్ట్రంలో 25 కొత్త పోలీస్ సబ్ డివిజన్లను, 31 సర్కిళ్లను, కొత్త పోలీస్ స్టేషన్లు 103 ఏర్పాటు చేశారు.

కొత్త రెవెన్యూ డివిజన్లు

రాష్ట్రంలో 43 రెవెన్యూ డివిజన్లు ఉండగా 2016లో జిల్లాల పునర్విభజనలో భాగంగా మరో 43 రెవెన్యూ డివిజన్లను పెంచగా 73కు చేరుకున్నాయి.

కొత్త మున్సిపాలిటీలు

2014కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో 52 మున్సిపాలిటీలు ఉండగా రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వం కొత్తగా మరో 76 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 6 కార్పొరేషన్లు ఉండగా, కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం కొత్తగా మరో 7 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లతో కలిపి మొత్తం 141 అర్బన్ లోకల్ బాడీలు ఏర్పడ్డాయి.

కొత్త మండలాల ఏర్పాటు

రాష్ట్రం ఏర్పడని తొలినాళ్లలో 459 మండలాలు ఉండగా, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొత్తగా 131 మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంత మొత్తం 590 మండలాలకు సంఖ్య పెరిగింది.

కొత్త గ్రామపంచాయతీలు

తెలంగాణ ప్రభుత్వం రాక ముందు 8,690 గ్రామపంచాతయతీలు ఉండగా, కొత్తగా పంచాయతీరాజ్ చట్టం ద్వారా రాష్ట్రంలో 4,383 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. దీంతో మొత్తం గ్రామపంచాయతీల సంఖ్య 12,751 కి చేరింది.

తెలంగాణా చరిత్ర ఇదీ..

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు, తొలి లోకసభకు 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. తొలి లోకసభ ఎన్నికలలో కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటితో విజయం సాధించారు. హైదరాబాదు శాసనసభకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు లభించడంతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవి పొందినారు.

1956 నవంబరులో ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది.

1969లో తెలంగాణ ఉద్యమం తలెత్తింది.

1971 లోకసభ ఎన్నికలలో తెలంగాణ ప్రజాసమితి పార్టీ 11 స్థానాలకు గాను పదింటిలో విజయం సాధించింది.

1971-73 కాలంలో కరీంనగర్ జిల్లాకు చెందిన పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పొందారు.

1973 డిసెంబరు నుంచి 1978 మార్చి వరకు ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంగళరావు ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు.

1978 మార్చి నుంచి 1980 అక్టోబరు వరకు రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ ప్రజాసమితి పార్టీ నాయకుడైన మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రిగా కొనసాగారు.

1980 అక్టోబరు నుంచి మెదక్ జిల్లాకు చెందిన టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రి పదవి పొంది 1982 ఫిబ్రవరి వరకు పనిచేశారు.

1982లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో 1983 ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ లభించింది.

1989 డిసెంబరు నుంచి 1990 డిసెంబరు వరకు మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు.

2011లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన పిదప దామోదర రాజనర్సింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది.

2001 ఏప్రిల్‌లో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంతో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వల్ల తెలంగాణ రాజకీయంగా చాలా మార్పులకు లోనైంది.

2004 లోకసభ ఎన్నికలలో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని 26 శాసనసభ స్థానాలు, 5 లోకసభ స్థానాలలో విజయం సాధించింది.

2009 లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 12, తెలుగుదేశం పార్టీ 2, తెరాస 2, ఎంఐఎం 1 స్థానాలలో విజయం సాధించాయి. 2009 శాసనసభ ఎన్నికలలో ఈ ప్రాంతంలోని 119 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందింది. 1952 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే తెలంగాణ మహిళా ఎమ్మెల్యేలు కూడా పోటిచేసి, విజయం సాధించారు.

2014 శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి మెజారిటీ స్థానాలు సాధించి తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు.

2018లో గడువు ముందుగా జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించి సీఎం కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు.

తెలంగాణ సంస్కృతి - పండుగలు

బోనాల ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ యొక్క ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఇవి కాకుండా మిగితా తెలుగు ప్రజలు జరుపుకొనే సంక్రాంతి, ఉగాది, దసరా, వినాయక చవితి, రంజాన్ తదితర ముఖ్య పండుగులను ఇక్కడి ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 2014 జూన్ 26న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాలును రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వు జారీచేసింది.

భాష

తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యాకుల భాష తెలుగు. సంపూర్ణ తెలంగాణావారు మాట్లాడే తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎక్కువగా కలుస్తాయి. ఆదిలాబాదు జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దు ఉండటంతో ఆ జిల్లాలో మరాఠి భాష ప్రభావం కొంత ఉంది. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాదు జిల్లాల కర్ణాటక సరిహద్దు గ్రామాలలో కన్నడ భాష ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతపు గ్రామీణ తెలుగు భాష యాసలో మిగితా ప్రాంతపు తెలుగు భాషకు కొద్దిగా వైరుధ్యం కనిపిస్తుంది. తెలంగాణాలోని ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో కొద్దిగా స్వచ్ఛమైన తెలుగు వినిపిస్తుంది.

కళలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు కళలకు ప్రసిద్ధి చెందినవి. ఆదిలాబాదు జిల్లా నిర్మల్ కొయ్యబొమ్మలకు పేరుగాంచగా, వరంగల్ జిల్లా పెంభర్తి ఇత్తడి సామానుల తయారికి ప్రసిద్ధి చెందింది. ఆదిలాబాదు జిల్లా కేంద్రం రంజన్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. నారాయణపేట జరీచీరల తయారీకి పేరుపొందింది.

Web Titlea special story on Telangana formation day 2020
Next Story