బొగ్గుగనుల ప్రైవేటీకరణ.. ఆందోళనలో సింగరేణి కార్మిక సంఘాలు!

బొగ్గుగనుల ప్రైవేటీకరణ.. ఆందోళనలో సింగరేణి కార్మిక సంఘాలు!
x
Highlights

బంగారు గుడ్లు పెట్టే బాతును కోసినట్లు ఉంది కేంద్ర వైఖరి.. బొగ్గు ఉత్పత్తి రంగాన్ని ప్రవేట్ రంగానికి అప్పగించేందుకు రెడీ అవుతోంది కేంద్రం. ఇప్పటికే 41...

బంగారు గుడ్లు పెట్టే బాతును కోసినట్లు ఉంది కేంద్ర వైఖరి.. బొగ్గు ఉత్పత్తి రంగాన్ని ప్రవేట్ రంగానికి అప్పగించేందుకు రెడీ అవుతోంది కేంద్రం. ఇప్పటికే 41 బొగ్గు గనులను ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. తాజాగా మరిన్ని గనులను అమ్మేందుకు సన్నాహాలు చేస్తోంది మోదీ ప్రభుత్వం. కేంద్రం ఆలోచన తెలంగాణ మాగాణి సింగరేణికి శాపంగా మారిందా. కేంద్ర నిర్ణయంపై అధికవాటా ఉన్న తెలంగాణ ఎలా స్పందించబోతుంది.?

దేశంలో బొగ్గు కొరతను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తి ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని చకా చకా అమలు చేసే పనిలో పడింది కేంద్ర సర్కార్. దేశంలో ప్రతి ఏటా 600 మిలియన్‌ టన్నుల బొగ్గును వెలికితీస్తున్నారు. రాష్ట్రంలో 65 మిలియన్‌ టన్నుల బొగ్గును తోడుతున్నారు. మెజార్టీ వాటా ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లోని విద్యుత్‌ సంస్థలకు బొగ్గును సరఫరా చేస్తోంది.

కేంద్రానికి చెందిన ఒక్క ఎన్టీపీసీకే నిత్యం 40 వేల టన్నుల బొగ్గును సరఫరా చేస్తోంది తెలంగాణ. మరోవైపు విద్యుదుత్పత్తిలో కీలకంగా ఉన్న జెన్‌కో సంస్థలకు భారీగా బొగ్గును అందిస్తోంది. ఐతే దేశవ్యాప్తంగా కొత్తగా మరో 500 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కు అప్పగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇదే అమలైతే భవిష్యత్‌లో సింగరేణి నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. బొగ్గుకు డిమాండ్‌ పడిపోయి, ఉద్యోగావకాశాలు తగ్గే ప్రమాదముందని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. దేశంలో వెలికితీస్తున్న బొగ్గుతోపాటు మరో 200 మిలియన్‌ టన్నుల బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. బొగ్గు కొరతను అధిగమిస్తూ ఉత్పత్తిలో పోటీతత్వాన్ని పెంచేందుకు ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం చెబుతోంది. పైగా ఉపాధి అవకాశాలు కూడా పుష్కలంగా పెరుగుతాయని అంచనా వేస్తోంది.

కేంద్ర నిర్ణయంతో అటు కోల్‌ ఇండియా, ఇటు సింగరేణికి భవిష్యత్‌లో భారీ నష్టం కలిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకు కోల్‌ఇండియా, సింగరేణి మాత్రమే బొగ్గు బ్లాకులు దక్కించుకునేవి. తాజా నిర్ణయంతో ప్రైవేటు సంస్థలు బొగ్గు బ్లాకులను సొంతం చేసుకుంటాయి. ప్రస్తుతం భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 9 కొత్త బ్లాకుల అనుమతుల కోసం సింగరేణి వేచిచూస్తోంది. ఈ బ్లాకులను కూడా కేంద్రం ప్రకటించిన 500 బ్లాకుల్లోనే ఉన్నాయి. వీటిని వేలం పద్ధతి ద్వారా ఎవరైనా సొంతం చేసుకోవచ్చు.

బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వచ్చే నెల 2 నుంచి 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా బొగ్గు సంస్థల్లో సమ్మె చేయనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. దేశంలోని 41 బొగ్గు గనుల వేలం ప్రక్రియను గురువారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బీఎంఎస్‌, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ సంస్థలకు చెందిన జాతీయ నాయకులు సమ్మె నిర్ణయం ప్రకటించారు. ప్రయివేటీకరణ చేస్తే పర్యావరణ పరిరక్షణను గాలికి వదిలేసి లాభాపేక్షతో గనులను ఇష్టారాజ్యంగా వెలికితీస్తారని కొందరు అంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories