TS Congress: సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్

Special Focus Of Congress Government On Irrigation Projects
x

TS Congress: సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్

Highlights

TS Congress: కర్ణాటక నుండి 10టీఎంసీల కృష్ణా నీటిని కోరాలని నిర్ణ‍యం

TS Congress: తెలంగాణ ఉద్యమ నినాదంలో ఒక్కటైన సాగు నీటిపై.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో 5లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకోసం మొదటగా పెండింగ్‌ ప్రాజెక్టులపై దృష్టి సారించింది సర్కార్. నిర్మాణ దశల్లో చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులకు నిధుల కొరత లేకుండా చూసి.. త్వరితగతిన పూర్తి అయ్యేలా చేయాలని నిర్దేశించుకుంది. ఇటీవల ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి..

సాగు నీటి వసతుల కల్పనపై దిశా నిర్దేశం చేశారు. పెండింగ్ ప్రాజెక్టులపై సంపూర్ణ నివేదిక ఇవ్వాలని కోరారు. అలాగే ప్రస్తుత పంటల సాగును దృష్టిలో పెట్టుకుని కర్ణాటక నుండి తెలంగాణకి 10టీఎంసీల కృష్ణా నీటిని కోరాలని నిర్ణయించింది రేవంత్ ప్రభుత్వం. వచ్చే ఎండ కాలం సాగు నీటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తోంది. గత వానాకాలంలో కృష్ణా రివర్‌లో తక్కువ వర్షపాతంతో ప్రస్తుతం ప్రాజెక్టులు డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని కృష్ణానది ఆయకట్టు రైతులకు.. ఇబ్బంది తలెత్తకుండా సాగు నీటిని అందించాలని చూస్తోంది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మేడిగడ్డలో పిల్లర్ల కుంగుబాటు అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. జలవనరుల శాఖతో రివ్యూలు జరిపారు. మేడిగడ్డలో మరమ్మత్తు పనులతో పాటు కాళేశ‌్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం కొత్త ఆయకట్టును సృష్టించగల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు ఆయన.

తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఉత్తమ్ తెలిపారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలని కోరుతూ ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను కలిశామన్నారు. జాతీయ ప్రాజెక్టు హోదా కోసం నిర్దిష్ట పథకం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేసినా, నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని వివరించారు ఉత్తమ్.

ప్రాణహిత ప్రాజెక్టు కాళేశ్వరం ఖర్చులో నాలుగో వంతు నిధులతోనే 16 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. సరైన ఖర్చుతో త్వరితగతిన కొత్త ఆయకట్టును సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. వేసవిలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని నీటి చెరువులను పూడిక తీసి జంగిల్ క్లియర్ చేసే పనులు చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుత నీటి కొరత దృష్ట్యా, రాబోయే తాగునీటి అవసరాలను తీర్చడానికి 10 టీఎంసీల కృష్ణా నీటిని కోరేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కర్ణాటకలో పర్యటించనుందని ఆయన వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories