రక్త మాంసాలున్న వారి ప్రతీ ఒక్కరి గుండె చెరువయ్యే కథ ఇది

రక్త మాంసాలున్న వారి ప్రతీ ఒక్కరి గుండె చెరువయ్యే కథ ఇది
x
Highlights

వృద్ధాప్య నరకం నుంచి కాపాడలేని వాడు పున్నామ నరకం ఎలా కాపాడుతాడు.? అవును ఇప్పుడు దీనిపైనే చర్చ జరగాలి. నవమాసాలు కని పెంచిన కన్నతల్లి అత్యంత కర్కశంగా...

వృద్ధాప్య నరకం నుంచి కాపాడలేని వాడు పున్నామ నరకం ఎలా కాపాడుతాడు.? అవును ఇప్పుడు దీనిపైనే చర్చ జరగాలి. నవమాసాలు కని పెంచిన కన్నతల్లి అత్యంత కర్కశంగా బతికుండగానే చితి పేర్చేసిన ఓ కొడుకు గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. తాను ఉంటుంది అద్దె ఇళ్లని చెబుతూ తల్లి చనిపోతే యజమానులతో మాట పడాల్సి వస్తుందని నమ్మిస్తూ 90 ఏళ్ల వృద్ధమాతకు అమానవీయంగా చితి పేర్చిన కొడుకు గురించే ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. వినడానికే చాలా దారుణంగా, అత్యంత దయనీయంగా ఉన్న ఈ కథను మీరూ చూడండి ఇలాంటి కొడుకులను ఏమని పిలవాలో చెప్పండి.!!

రక్త మాంసాలున్న వారి ప్రతీ ఒక్కరి గుండె చెరువయ్యే కథ ఇది

చీము నెత్తరు ఉన్న ప్రతీ ఒక్కరి గుండె రగిలే కథ ఇది

పున్నామ నరకం ఉందో లేదో తెలియదు

ఉన్నది చెప్పే వాళ్లే కానీ... చూసి చెప్పిన వాళ్లెవరూ లేరు

కానీ... బతికుండగానే నరకం చూపించే తనయులను ఏమనాలి?

వృద్ధాప్య నరకం నుంచి కాపాడలేని కొడుకులను ఏమని పిలవాలి?

అవును. కలికాలం కొడుకులు, కూతుళ్లు కొందరు చేస్తున్న పనులను ఇలాగే చూడాల్సి వస్తుంది. ఈ మాటలే అనాల్సి వస్తుంది. ఎంత దారుణం. కన్నతల్లి అన్న మమకారం లేదు. కనిపెంచిందన్న కనికరం లేదు. తాను పెరిగి పెద్దయ్యే దాకా తనను తాను త్యాగం చేసిందన్న అనురాగం లేదు. బతికుండగానే కాటికి పంపి కన్నతల్లి గర్భశోకానికి కారకుడైన ఈ కొడుకు గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.

ఎన్నో కష్టనష్టాలకోర్చి నవమాసాలు మోసి కని, పెంచి పెద్ద చేస్తే ఈ పుత్రరత్నం చివరకు చేసిందేమిటి? అంతిమ కర్మలు ఆచరించి కన్నతల్లి రుణం తీర్చుకోవాల్సిన ఈ కొడుకు. ఈ తల్లిని బతికుండగానే స్మశానానికి తరలించాడు. మానవత్వాన్ని మంటగలిపాడు. జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలనే కాదు యావత్‌ సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. నిట్టూర్చేలా చేస్తోంది. కాటేస్తున్న కలికాలం ఆగడాలను తలుచుకొని గుండెలవిసేలా చేస్తోంది.

జగిత్యాల జిల్లా కేంద్రం వీక్లీ బజార్‌లో ఉండే ఈ 95 ఏళ్లు వృద్ధురాలి పేరు నర్సమ్మ. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. ఈమెను కట్టుకున్న వాడు 30 ఏళ్ల కిందటే కన్నుమూశాడు. ఇక మిగిలింది కుమారుడే. ఇతగాడే కనికరం లేని కన్నకొడుకు. పేరు ధర్మయ్య. కొన్నాళ్లుగా బాగానే చూసుకున్నాడు. కానీ కాలం ఎప్పడూ ఒకేలా ఉండదు కదా వృద్ధాప్యం మీద పడటంతో నర్సమ్మ తరుచూ అనారోగ్యానికి గురవుతుంది. అక్కడ ఇక్కడా ఎక్కడ తిప్పినా ఆరోగ్యం కుదటపడలేదు. డాక్టర్లు కూడా చేతులెత్తేశారు. అప్పుడే ధర్మయ్యకు ఈ క్రూరమైన ఆలోచన వచ్చింది. కన్నుమూయకుండానే కాటికి పంపి కన్నుమూశాక అక్కడే చితిపేరుద్దామని నిర్ణయించుకున్నాడు.

ధర్మయ్య ఉండేది అద్దె ఇల్లు. ఆ ఇంట్లో తన తల్లి చనిపోతే యజమాని ఏమంటారోనని ఆందోళన చెందానంటున్నాడు ధర్మయ్య. అందుకే ప్రాణాలతో ఉండగానే కన్న తల్లిని స్మశానానికి తరలించానని చెబుతున్నాడు. అలాగని అనాథలా వదిలేయదని చెబుతున్నాడు. స్మశానవాటికలో ఓ గదిలో ఉంచానని చెబుతున్నాడు. వృద్ధురాలి దీనస్థితిని చూసి చలించిపోయిన స్థానికులు.. జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన జగిత్యాల ప్రభుత్వాసుపత్రి మ్యాట్రన్ సుదక్షిణాదేవి అంబులెన్స్‌ను పంపించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య చికిత్స అందిస్తున్నారు. ధర్మయ్య చేసింది తప్పు. ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. అలాగని తప్పించుకునే ప్రయత్నం చేస్తే దేవుడు క్షమించడంటూ స్థానికులు భగ్గుమంటున్నారు. కన్నతల్లిని బతికి ఉండగానే కాటికి తరలించిన ఘటనపై మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories