ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు

Seasonal Diseases Increasing in Khammam District
x

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు

Highlights

Khammam: అవకాశంగా తీసుకుని.. దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు ఆస్పత్రులు

Khammam: ఖమ్మం జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న విష జ్వరాలు ప్రైవేటు ఆస్పత్రులకు కాసులు కురిపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మురుగు నీరు వచ్చి చేరడంతో జిల్లాలో దోమల సంచారం పెరిగిపోయింది. ప్రతీ ఇంట్లో జ్వరంతో బాధపడుతున్నవారి సంఖ్య కామన్‌గా మారింది. దీనికి అవకాశంగా తీసుకుని, ప్రైవేటు ఆస్పత్రులు రోగులను నిలువు దోపిడికి పాల్పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వాతావరణం ఒక్కసారిగా మారిపోతుండటంతో జ్వరాలు విపరీతంగా వస్తున్నాయి. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల పంట పండుతోంది. ఫీవర్ వచ్చింది అంటే చాలు జనాల్లో భయాందోళన సృష్టించి... వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరుతో వేలాది రూపాయలు దోచుకుంటున్నారు. అవసరం లేకున్నా డెంగ్యూ పేరిట ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల పేరుతో రోగులను ఐసీయూ వార్డులో చేర్చి, అత్యవసర వైద్య చికిత్సలు అందించాలంటూ నానా హడావిడి చేస్తూ... లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంతో దోమలు వృద్ధిచెంది వాటి బారినపడి ప్రజలు జ్వరాలతో అల్లాడిపోతున్నారు. ప్రతి ఇంట్లో ఒక్కరైనా జ్వరంతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈసారి జ్వరాల సీజన్‌ ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలకు సిరులు కురిపిస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో... రోగుల వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత దోపిడీ జరుగుతున్నా.. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.

ఖమ్మం జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రులు వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో అర్హత కలిగిన వైద్యులు ఉండాలి. అలాగే ఆస్పత్రిలో బెడ్లు, ఆపరేషన్‌ థియేటర్, ల్యాబ్, ఫైర్‌ సేఫ్టీ తదితర విషయాల్లో తప్పనిసరిగా

ప్రభుత్వం సూచించిన నియమాలు పాటించాలి. ఆసుపత్రిలో చార్జీ చేసే పరీక్షల ఫీజు వివరాల బోర్డులు ప్రదర్శించాలి. కానీ.. చాలా ఆసుపత్రుల్లో నిబంధనలు పట్టించుకోకుండా... అర్హత లేని వైద్యులతో వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏ మాత్రం అర్హత, అనుభవం లేని వారితో ఆసుపత్రి ల్యాబ్‌లలో టెస్టులు చేయిస్తున్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తూతూ మంత్రంగా ఆస్పత్రులను తనిఖీ చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నందుకు, అధిక మొత్తంలో ప్రైవేటు యాజమాన్యాలు అధికారులకు, భారీగానే నగదు ముట్టజెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆస్పత్రుల నిలువు దోపిడి నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories