దీక్షిత్‌ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్!

దీక్షిత్‌ కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్!
x

deekshith 

Highlights

మహబూబాబాద్‌ బాలుడు దీక్షిత్‌ మర్డర్ కేసులో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. బాలుడు కిడ్నాపైన ఇంటి దగ్గర్నుంచి మర్డర్ జరిగిన ప్రాంతం వరకు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు.

మహబూబాబాద్‌ బాలుడు దీక్షిత్‌ మర్డర్ కేసులో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. బాలుడు కిడ్నాపైన ఇంటి దగ్గర్నుంచి మర్డర్ జరిగిన ప్రాంతం వరకు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టారు. దీక్షిత్‌ను చంపిన ప్రాంతానికి నిందితులను తీసుకెళ్లిన పోలీసులు.... కిడ్నాప్ నుంచి మర్డర్ వరకు ఎప్పుడేం జరిగిందో రికార్డు చేశారు.

మహబూబాబాద్‌లో కిడ్నాప్‌నకు గురైన దీక్షిత్‌ కథ విషాదాంతమైంది. మహబూబాబాద్‌కు 5 కిలోమీటర్ల దూరంలోని అన్నారం దగ్గర దానమయ్య గుట్టపై బాలుడి మృతదేహన్ని గుర్తించారు పోలీసులు. గత ఆదివారం రాత్రి దీక్షిత్‌ను అపహరించుకుపోయిన కిడ్నాపర్‌... రెండు గంటల్లోనే బాలుడిని హత్య చేశాడు.

మహబూబాబాద్‌ కృష్ణకాలనీలో నివాసముంటున్న రంజిత్... జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. రంజిత్, వసంత పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి ఆదివారం నాడు ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి బాలుడిని ఎత్తుకెళ్లాడు. ఎంతసేపటికీ దీక్షిత్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. చుట్టపక్కల వాళ్లను ఆరా తీయగా ఓ వ్యక్తి బాలుడిని బైక్‌పై తీసుకెళ్లినట్టు తెలుసుకున్నారు. అదేరోజు రాత్రి 10గంటల సమయంలో బాలుడి తల్లిదండ్రులకు ఇంటర్నెట్‌ కాల్ చేశాడు కిడ్నాపర్. 45 లక్షలు ఇస్తే దీక్షిత్‌ను వదిలేస్తానని... ఈ విషయం పోలీసులకు చెప్పొద్దని హెచ్చరించాడు. తాను చెప్పిన ప్రదేశానికి వచ్చి డబ్బులివ్వాలని సూచించాడు. తనను ఎవరూ పట్టుకోలేరని.... బాలుడు గుర్తుపట్టినా ఏం చేయలేరన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పిల్లాడిని చంపేస్తానంటూ బెదిరించాడు. దాంతో తల్లిదండ్రులు తమ దగ్గర అంత డబ్బు లేదని వేడుకున్నారు. అయితే... బాలుడిని చంపేస్తానని బెదిరించడంతో దీక్షిత్ తల్లిదండ్రులు డబ్బు సిద్ధంచేశారు.

నిన్న మధ్యాహ్నం నుంచి కిడ్నాపర్‌కు డబ్బులిచ్చి దీక్షిత్‌ను విడిపించుకోవడానికి ప్రయత్నించారు తల్లిదండ్రులు. కిడ్నాపర్ చెప్పిన మూడు నాలుగు ప్రాంతాలకు తిరిగారు. రాత్రంతా నిరీక్షించినా కిడ్నాపర్ రాలేదు. దాంతో చేసేదేమీలేక వెనుదిరిగాడు దీక్షిత్‌ తండ్రి. మరోవైపు, 100 మంది పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం నుంచి అన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. మహబూబాబాద్‌కు 5 కిలోమీటర్ల దూరంలోని అన్నారం దానమయ్యగుట్టపై బాలుడి మృతదేహన్ని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు.

మహబూబాబాద్ కలెక్టరేట్ దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా విచారణ చేపట్టారు. బాలుడిని కిడ్నాప్ చేసింది.. గుట్ట దగ్గరకు తీసుకెళ్లింది.. చంపింది కూడా ఒకే వ్యక్తని పోలీసులు నిర్ధారించారు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని మందసాగర్‌గా గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కిడ్నాప్‌నకు ముందు నిందితుడు రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు. మెకానిక్‌గా పనిచేస్తున్న మందసాగర్‌... తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే దురాశతోనే ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు నిందితుడు.

ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్‌ చేశాడని.. సాయంత్రం 6 గంటలకు మహబూబాబాద్‌ శివార్లలోని గుట్టలపైకి దీక్షిత్‌ను తీసుకెళ్లాడని ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. దొరికిపోతాననే భయంతో రాత్రి 8గంటల సమయంలో బాలుడిని కిడ్నాపర్ గొంతు పిసికి చంపేశాడని ఎస్పీ తెలిపారు. కిడ్నాప్‌ చేసిన రెండు గంటల్లోనే బాలుడిని హత్య చేశాడని.. చంపిన తర్వాత కూడా రెండ్రోజులపాటు తల్లిదండ్రులకు ఇంటర్నెట్‌ కాల్స్‌ చేస్తూనే ఉన్నాడని అన్నారు. దీక్షిత్ తన దగ్గర క్షేమంగా ఉన్నట్టు తల్లిదండ్రులను నమ్మించాడని చెప్పారు. నిందితుడిని పూర్తిగా విచారిస్తే మరిన్ని నిజాలు బయటపడొచ్చని అన్నారు ఎస్పీ కోటిరెడ్డి.

రోజు రోజుకు మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతోంది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవ్వరినీ వదలకుండా కసాయిల్లా వ్యవహరిస్తున్నారు. కక్ష సాధింపుతో ఒకరు, కామంతో మరొకరు, ఇతర కారణాలతో ఇంకొకరు.. ఇలా అన్ని విషయాల్లోనూ మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ ఏమాత్రం జంకు లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రాణాలు తీసి రాక్షసుల్లా మారుతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగుచూస్తున్నా... మనుషుల్లో మాత్రం మార్పు రావడం లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories