Telangana Crop Loans Waiver: 2 లక్షల్లోపు రుణాల మాఫీ.. మరి ఆ రైతుల పరిస్థితి ఏంటి ?

Telangana Crop Loans Waiver: 2 లక్షల్లోపు రుణాల మాఫీ.. మరి ఆ రైతుల పరిస్థితి ఏంటి ?
x
Highlights

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మూడో విడత కింద లక్షన్నర రూపాయల నుంచి రూ. 2 లక్షల వరకు రుణం బకాయి ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Telangana Rythu Runa Mafi 3rd List: రూ. 2 లక్షల రుణమాఫీ కోసం ఎదురుచూస్తోన్న రైతులకు గుడ్ న్యూస్. ఆగస్టు 15వ తేదీ నాటికి రైతుల రుణాలు అన్నీ మాఫీ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మూడో విడత కింద లక్షన్నర రూపాయల నుంచి రూ. 2 లక్షల వరకు రుణం బకాయి ఉన్న రైతులకు రుణమాఫీ చేశారు. 3వ విడత రుణమాఫీలో 14.45 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటివరకు రుణమాఫీ జరిగిన 2 విడతల్లో లక్షన్నర లోపు రుణం ఉన్న వారికి రుణమాఫీ చేసిన ప్రభుత్వం మూడో విడత రుణమాఫీలో భాగంగా రూ. లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రూ. 2 లక్షల కంటే అధిక మొత్తంలో రుణాలు ఉన్న రైతులు ఆ అధిక మొత్తాన్ని చెల్లించిన తరువాతే రుణమాఫీకి అర్హులు అవుతారు అని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఉదాహరణకు ఒక రైతుకు రూ 2 లక్షల 20 వేలు రుణం బకాయి ఉన్నట్టయితే, ఆ రైతు ముందుగా 20 వేల రూపాయలు రుణం చెల్లించాలని, ఆ తరువాతే 2 లక్షల రుణమాఫీ అవుతుంది అని ప్రభుత్వం తమ ప్రకటనలో పేర్కొంది. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులను 4వ విడత జాబితాలో చేర్చుతూ పంద్రాగష్టు తరువాత వారిపై దృష్టి సారించే యోచనలో ప్రభుత్వం ఉంది.

మరి ఆ రైతుల పరిస్థితి ఏంటి ?

ప్రభుత్వం విధించిన షరతుతో 2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రుణం ఉన్న కొంతమంది రైతులు అయోమయానికి, ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఆ 2 లక్షల రుణమాఫీ చేయకపోతే తమ పరిస్థితి ఏంటనే ప్రశ్న ఆయా రైతులను వేధిస్తోంది. కానీ వాస్తవానికి ఈ విషయంలో ప్రభుత్వం వెర్షన్ వేరే ఉంది. ఒకవేళ 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతుల ఖాతాల్లో 2 లక్షల రుణం మాఫీ చేసినప్పటికీ.. ఆ మిగతా మొత్తాన్ని చెల్లించడంలో రైతులు విఫలమైనా లేదా ఆలస్యం చేసినా.. మళ్లీ ఆ మొత్తంపై వడ్డీ పెరిగి పెరిగి ఆ చిన్న మొత్తం కాస్తా పెద్ద మొత్తమై రైతుకే ఆర్థిక భారం అవుతుంది అని ప్రభుత్వం చెబుతోంది. రైతుల శ్రేయస్సు దృష్ట్యానే ముందుగా ఆ అధిక మొత్తాన్ని వారినే చెల్లించాల్సిందిగా చెబుతున్నట్టు ప్రభుత్వం స్పష్టంచేస్తోంది.

హరీష్ రావుకి సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి..

వైరా వేదికగా జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మే6, 2022న వరంగల్ డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 8 నెలల్లోపే ఆ హామీని నెరవేర్చి కాంగ్రెస్ ఇచ్చిన మాటని నిలబెట్టుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటివరకు మూడు విడతల కింద జరిపిన రుణమాఫీ కోసం 18 వేల కోట్లు వెచ్చించినట్టు తెలిపారు.

రూ. 2 లక్షల్లోపు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన మాట ప్రకారమే తాము మాట నిలబెట్టుకున్నామని.. మరి హరీష్ రావు కూడా ఆయన విసిరిన సవాల్‌కి కట్టుబడి రాజీనామా చేస్తారా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఈ సందర్భంగా హరీష్ రావుపై ఘాటైన వ్యాఖ్యలతో విరుచుకుపడిన రేవంత్ రెడ్డి.. హరీష్ రాజీనామా చేస్తే సిద్ధిపేటకు పట్టిన పీడ విరుగడ అవుతుంది అని మండిపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories