Top
logo

రైతుల కోసం స్పెషల్ మ్యారెజ్ బ్యూరో

రైతుల కోసం స్పెషల్ మ్యారెజ్ బ్యూరో
X
Highlights

దేశానికి రైతే వెన్నెముక అని, రైతే రాజు అని అంటారు అందరూ. కానీ ప్రస్తుతం ఆ రైతుకే విలువ లేకుండా పోతుంది. కూలీ...

దేశానికి రైతే వెన్నెముక అని, రైతే రాజు అని అంటారు అందరూ. కానీ ప్రస్తుతం ఆ రైతుకే విలువ లేకుండా పోతుంది. కూలీ పనుల చేసుకునే వారికి కూడా పెళ్లి సంబంధాలు కుదురుతున్నాయి కానీ వ్యవసాయం చేసే రైతుకు పెళ్లి అవ్వడం మాత్రం కష్టంగా మారుతోంది. మట్టిలో దిగుతాడు, పొలం పనులు చేస్తున్నాడు అన్న ఒక్క కారణంతోనే అమ్మాయిల తల్లిదండ్రులు పిల్లను ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో చాలా మంది రైతులు పెళ్లి కాకుండా అలాగే ఉంటున్నారు. అయితే అలాంటి వారి కోసం ఆలోచించిన ఓ వ్యక్తి వినూత్న ప్రయత్నం చేసారు. కేవలం రైతుల కోసం మాత్రమే ప్రత్యేకంగా మ్యారేజ్‌ బ్యూరో ఏర్పాటు చేశారు. నెలకు రూ.10 వేలు సంపాదించే ఉద్యోగులకైనా పిల్లనిస్తున్నారు గాని, మంచి దిగుబడులతో అంతకన్నా ఎక్కువే సంపాదిస్తున్న పదెకరాల ఆసామికి కూడా ఎందుకు పిల్లనివ్వడం లేదన్న ఆవేదన లోంచి పుట్టిన ఆలోచనే అంజిరెడ్డిని మ్యారేజీ బ్యూరో ఏర్పాటు దిశగా పురిగొల్పింది.

కులం, మతం సంబంధం లేకున్న రైతు అయి ఉంటే చాలు సంబధాలు కుదుర్చడానికి సిద్దం అయ్యారు. ఈ మ్యారేజ్ బ్యూరో కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండల కేంద్రంలో కేతిరెడ్డి అంజిరెడ్డి నెలకొల్పారు. ఈ మ్యారేజీ బ్యూరో ఏర్పాటై ఇప్పటి వరకు 10 రోజులే అయినా విశేష స్పందన వస్తోంది. ఎంతో మంది రైతులు పెళ్లి సంబంధాల కోసం అక్కడకు వచ్చి ఆయన్ని సంప్రదిస్తున్నారు. గత 10 రోజుల్లో తనకు కనీసం 5 వేల ఫోన్లు వచ్చాయని అంజిరెడ్డి చెప్పారు. కుల, మతాలకు అతీతంగా రైతు కుటుంబాలకు మాత్రమే అక్కడ పెళ్లి సంబంధాలు చూస్తామని వెల్లడించారు. సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం కావడంతో అంజిరెడ్డి నిర్వహిస్తున్న రైతు మ్యారేజ్‌ బ్యూరోకు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి మంచి స్పందన వస్తోంది. పెళ్లి సంబంధాల కోసం వచ్చే వారు కేవలం రూ. 500 ఇచ్చి తమ పూర్తి వివరాలతో కూడిన ప్రొఫైల్‌ను నమోదు చేసుకోవాలి. కాస్తో కూస్తో కూడబెట్టిన వారి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకున్నా పేదవారైతే ఆ మొత్తం కూడా తీసుకోకుండా ఆయన పూర్తి ఉచితంగా సేవలు అందిస్తామని అంజిరెడ్డి చెబుతున్నారు.

Web Titlerythu marriage bureau started in karimnagar
Next Story