
రైతన్నలకు గుడ్ న్యూస్..రైతు భరోసా నిధుల విడుదలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ?
Rythu Bharosa : తెలంగాణలో ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం చేసుకోవడంతో రేవంత్ సర్కార్ ఇప్పుడు పూర్తి విక్టరీ జోష్‌లో ఉంది. ఈ జోష్‌ను అలాగే కొనసాగిస్తూ, రాష్ట్రంలోని అన్నదాతలకు అదిరిపోయే తీపి కబురు చెప్పేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 17 లేదా 18వ తేదీన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసేందుకు కసరత్తు తుది దశకు చేరుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఊపుతో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నారు. యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.6,000 చొప్పున నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.9,000 కోట్లను ఆర్థిక శాఖ ఇప్పటికే సమీకరించింది. మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిన ఈ ప్రక్రియను, కోడ్ ముగియగానే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ నెల ప్రారంభంలో మిర్యాలగూడలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు వేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలు ముగిసి, కాంగ్రెస్ భారీ విజయాన్ని నమోదు చేయడంతో, అన్నదాతలకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.46 కోట్ల ఎకరాలకు ఈ సాయం అందనుంది. దీనివల్ల దాదాపు 70 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు.
రైతు భరోసా నిధుల విడుదలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో నిధుల పంపిణీకి సంబంధించిన విధివిధానాలతో పాటు, త్వరలో జరగనున్న ZPTC, MPTC (పరిషత్) ఎన్నికలపై కూడా కీలక చర్చలు జరిగాయి. మున్సిపల్ ఫలితాల స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేయాలని ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది.
ఈసారి రైతు భరోసా పంపిణీలో అర్హులకు మాత్రమే న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ప్రభుత్వం శాటిలైట్ సర్వే నిర్వహించింది. సాగు భూమి ఎక్కడ ఉంది? బోగస్ లబ్ధిదారులు ఎవరు? అనే అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాతే నిధులు విడుదల చేయనున్నారు. గత వానాకాలం సీజన్‌లో ఎవరికైతే సాయం అందిందో, వారందరికీ ఈసారి కూడా యథాతథంగా నిధులు అందజేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




