
Rythu Bharosa : తెలంగాణ రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్..రైతు భరోసా నిధులకు లైన్ క్లియర్
Rythu Bharosa : తెలంగాణ అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. యాసంగి సీజన్ మొదలై నెలలు గడుస్తున్నా.. పెట్టుబడి సాయం అందక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న వేళ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. మున్సిపల్ ఎన్నికల వేడి ముగియగానే అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలంగాణలో ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల హడావిడి నడుస్తోంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, 13వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే వ్యవసాయ శాఖ అర్హులైన రైతుల జాబితాను సిద్ధం చేసింది. ఎకరానికి రూ.6,000 చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్ ద్వారా రుణ సేకరణకు చర్యలు చేపట్టింది.
ప్రభుత్వం పెట్టుబడి సాయం కోసం ఏకంగా రూ.9,000 కోట్ల నిధులను సమీకరించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ వద్ద ఇండెంట్ పెట్టింది. ఫిబ్రవరి 10న అంటే ఈరోజే ఆర్బీఐ నిర్వహించే ఈ-వేలం ద్వారా ఈ నిధులు ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి. ఈ భారీ రుణంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల ఫలితాలు రాగానే బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఈసారి రైతు భరోసా నిధుల పంపిణీలో ప్రభుత్వం పక్కా ప్లాన్‌తో వెళ్తోంది. గతంలో పడావు భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, గుట్టలకు కూడా నిధులు అందేవని ఆరోపణలు ఉన్నాయి. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా శాటిలైట్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం, రాష్ట్రంలో సుమారు 10 శాతం భూముల్లో ఎలాంటి పంట సాగు కావడం లేదని ప్రాథమిక నివేదికలో తేలింది. దీనివల్ల నిజమైన సాగుదారులకే సాయం అందేలా, సాగులో లేని భూములకు నిధులు నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల ప్రభుత్వానికి కొంత భారం తగ్గే అవకాశం ఉంది. మొత్తానికి, యాసంగి పంట చేతికి వచ్చే సమయంలోనైనా ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేస్తుండటంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




