Tsrtc Strike : ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల భేటీ

Tsrtc Strike : ఆర్టీసీ జేఏసీ, అఖిలపక్ష నేతల భేటీ
x
Highlights

-46వ రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె -ఇవాళ అన్ని డిపోల వద్ద కార్మికుల నిరసనలు

ఆర్టీసీ కార్మికుల సమ్మె 46వ రోజుకు చేరింది. ఇవాళ అన్ని డిపోల ముందు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ నేతలు, అఖిలపక్ష నేతలు సమావేశంకానున్నారు. అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ, వేతనాల పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.

హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాలు పునరాలోచనలో పడ్డాయి. జేఏసీ నేతలు నిరాహారదీక్షను విరమించారు. ఇవాళ నిర్వహించాల్సిన సడక్‌బంద్‌ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. మరోవైపు ప్రభుత్వం దిగిరావడం లేదు... యాజమాన్యం నిధులు లేవని చేతులెత్తేస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై సంఘాలు సమాలోచనలు చేస్తున్నాయి. సమ్మెపై లేబర్‌ కోర్టుకు వెళ్లాలా... వద్దా అనే అంశంపై రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ కార్మికశాఖ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. దీంతో జేఏసీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. సమ్మెపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై సంఘాలు ఇవాళ సమావేశమవనున్నాయి. ఈ సమావేశంలోనే సమ్మె కొనసాగించాలా..? విరమించాలా అనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి.

ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. చర్చలనేవి స్వచ్ఛందంగా ఉండాలని స్పష్టం చేసింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించేందుకు లేబర్‌ కమిషనర్‌కు అధికారంలేదని.. ఆయనకు తాము ఆదేశాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలకు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ముగింపు పలికింది. చర్చలు విఫలమైన అంశాన్ని లేబర్‌ కోర్టుకు నివేదించడంపై తీర్పు కాపీ అందిన రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని లేబర్‌ కమిషనర్‌ను ఆదేశించింది. లేబర్‌ కోర్టుకు నివేదించకపోతే అందుకు తగిన కారణాలు చెప్పాలని స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను చట్ట వ్యతిరేకమైనదిగా ప్రకటించాల్సిందిగా లేబర్‌కమిషనర్‌ను ఆదేశించలేమని తీర్పులో పేర్కొంది. కన్సీలియేషన్‌ ఆఫీసర్‌కు అటువంటి అధికారాలు లేవని తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె చట్ట వ్యతిరేకమా.. సమ్మతమా అని నిర్ణయించే అధికారం లేబర్‌ కోర్టుకు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. ఒకవేళ కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరితే.... వారిపై ఎలాంటి చర్యలు చేపట్టబోరని ఆశిస్తున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories