Kumuram Bheem: బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..

Kumuram Bheem: బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..
x
Highlights

Kumuram Bheem: బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..

Kumuram Bheem: కొమురంభీం జిల్లా రెబ్బెన మండలంలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. నాటు వైద్యం వికటించి ఓ బాలుడు నాలుగేళ్ల క్రితమే మృతి చెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నాడంటూ ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ వచ్చాడు ఆమె భర్త. అయితే నాటు వైద్యుడి సహకారంతోనే బాలుడిని పాతిపెట్టినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన శ్రీనివాస్, మల్లీశ్వరి దంపతుల కుమారుడు రిషిని అనారోగ్య కారణాలతో పాసిగామ గ్రామ సమీపంలోని పూలాజి బాబా ధ్యాన కేంద్రంలో చూపించారు. అతను నూనె రాస్తే రోగం నయమవుతుందని నమ్మించేవాడు నాటు వైద్యుడు భీమ్‌రావు. ఈ క్రమంలోనే నాటు మందులతో అనారోగ్యం నయం చేస్తానని చెప్పి ఆశ్రమంలోనే ఉంచుకున్నాడు నాటు వైద్యుడు భీమ్ రావు. ఈ క్రమంలో నాటు వైద్యం వికటించి కొద్దిరోజులకు బాలుడు మృతి చెందాడు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా శ్రీనివాస్‌తో కలిసి భీమ్‌రావు ఆశ్రమం వెనుక బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టాడు.

అయితే కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవాలనుకున్న తల్లికి గుండె పగిలే నిజం తెలిసింది. బాబు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఎన్నోసార్లు భర్తను ప్రశ్నించింది. బాబు ఆశ్రమంలోనే ఉన్నాడని, ఆరోగ్యం మెరుగవుతుందంటూ నమ్మబలికే వాడు. కొన్నిసార్లు ఆమె ఆశ్రమానికి వెళ్లినా బాబు లోపల నిద్రపోతున్నాడని, చూడడానికి వీలుకాదని భీమ్‌రావు, శ్రీనివాస్‌లు నమ్మించారు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయిన ఆమె భర్తను వదిలి పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలోనే తన కుమారుడిని చూపించడంలేదని కుటుంబసభ్యుల సహకారంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఇక మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో నిందితులు నిజాలను పోలీసుల ముందు బయటపెట్టారు. బాలుడిని పాతిపెట్టిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించారు. దీంతో ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణలో అక్కడ తవ్వించగా బాలుడి మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు బయటపడ్డాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories