
Revanth Reddy: కాంగ్రెస్‌లో ఆరేళ్లలోనే అత్యున్నత స్థాయికి రేవంత్
Revanth Reddy: 2023ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించి పార్టీలో జోష్ తెచ్చిన రేవంత్
Revanth Reddy: తెలుగు రాజకీయాలలో మొదటి నుంచి రేవంత్ రెడ్డి సంచలనాలకు కేంద్రంగా నిలుస్తూ వచ్చారు. టీడీపీ పార్టీ మూలాలున్న ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడమే ఒక విశేషమైతే, అధిష్ఠానం ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడం, పార్టీకి విజయం సాధించిపెట్టడం.. ఆయన సీఎం కావడం అంతకన్నా విశేషం. తెలుగు ప్రాంతంలో దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు అధికారం దక్కింది.
తెలంగాణ టీడీపీ ఎల్పీ లీడర్ పదవిలో ఉన్న ఆయన, హఠాత్తుగా కాంగ్రెస్‌లో చేరడం, ఆ తర్వాత క్రమంగా ఎదుగుతూ పార్టీ అధ్యక్షుడి వరకు ఎదగడానికి నేపథ్యం కూడా ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ క్రమంగా బలహీన పడింది. అదే సమయంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో నడిపించే అవకాశం రేవంత్ రెడ్డికి దక్కింది. కానీ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంతకంతకూ బలహీనపడటం, కీలక నేతలంతా అధికార పార్టీలో చేరడమో, లేదంటే పార్టీ బాధ్యతలకు దూరంగా ఉండటమో చేయడంతో అధికార పార్టీని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని నడిపించడం కష్టతరంగా మారింది. దీంతో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీవైపు మళ్లారు.
రేవంత్‌రెడ్డి ఆరేళ్లలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత హోదాకు చేరుకున్నారు. 2017 అక్టోబర్‌లో కాంగ్రెస్ పార్టిలో చేరిన ఆయన ఆరేళ్లు పూర్తి చేసుకునేలోపే అధిష్టానం మన్ననలు పొంది సీఎంగా ఎంపికయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రోజే పార్టిలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొన్న ఆయన ఇంటా, బయటా సర్దిచెప్పుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ, సై అంటే సై అంటూ హైకమాండ్ నిర్ణయించే కీలక పదవి దక్కించుకోగలిగారు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా తట్టుకుంటూ హస్తం పార్టిలో ముందడుగులు వేసిన ఈ పాలమూరు నాయకుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించబోతున్నారు.
రేవంత్ రెడ్డి 2017 లో కాంగ్రెస్‌లో చేరారు. 2017 అక్టోబర్ 17న ఆయన తెలుగుదేశం సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. అక్టోబర్ 30న ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ, వర్గ రాజకీయాలకు పెట్టింది పేరులాంటి కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రస్థానం అంత సులభంగా సాగలేదు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన పట్ల కాంగ్రెస్ నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి.
అయితే 2018లో కాంగ్రెస్ పార్టీ ఆయనతో పాటు మరో ముగ్గురిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా ఎంపిక చేసింది. రేవంత్ 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2023 ఎన్నికల్లో పార్టీని విజయ పథంలో నడిపించారు.
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌కు సరితూగే ప్రత్యర్ధిని తానేనని నిరూపించుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నించారని, అందులో విజయం సాధించారని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. అసమ్మతులకు, వర్గాలకు నిలయమైన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు వహిస్తూ, అందరినీ కలుపుకొనిపోయే ప్రయత్నాలు చేసిన రేవంత్, అటు అధిష్ఠానానికి కూడా చేరువయ్యారు.
కర్ణాటక తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ ఎన్నికలపై ఎక్కువగా దృష్టి సారించడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రాలు విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించారు. ఈ సమయంలో రేవంత్ వారి వెంట ఉండి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆయనకు సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించారు. పార్టీలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ సీనియర్ నేతల నుంచి విమర్శలు వస్తున్నా తనదైన శైలిలో పని చేసుకుపోతున్నారన్న పేరు తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కాగల వ్యక్తి అన్న స్థాయికి పార్టీలో రేవంత్ ప్రాబల్యం పెరిగింది. పార్టీలోకి వచ్చిన కొత్తలోనే తాను కూడా ముఖ్యమంత్రి అభ్యర్థినేనంటూ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన రేవంత్, ఎన్నికల ప్రచారం సమయంలో కూడా తన మనోభావాన్ని ప్రజల ముందుంచారు.
పీసీసీ చీఫ్‌గా పగ్గాలు చేపట్టిన రేవంత్‌కు అనేక సవాళ్లు స్వాగతం పలికాయి. పార్టిలో అసమ్మతి, ఇంటిపోరును సమర్థవంతంగా ఎదుర్కొన్న రేవంత్ అటు ప్రజాక్షేత్రంలోనూ ప్రతికూల పరిస్థితులను చవి చూశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన అనేక ఉప ఎన్నికలతో పాటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీ ఓటమి పాలైంది. అయినా వైఫల్యాలకు వెరవకుండా 2023 ఎన్నికల్లో రేవంత్ అన్నీ తానై వ్యవహరించారు.
అధిష్టానం నిర్ణయం మేరకు సీఎం కేసీఆర్‌పై కామారెడ్డిలో పోటీ చేసి ఢిల్లీ పెద్దల దృష్టిని కూడా ఆకర్షించారు. అటు పార్టీ కేడర్, నాయకులను ముందుకు కదిలిస్తూ ఈ ఎన్నికల్లో పార్టికి ఘనవిజయాన్ని చేకూర్చారని, అధిష్టానం వద్ద లభించిన ప్రత్యేక గుర్తింపే ఆయనకు పెద్ద పదవి లభించేలా చేసిందనే చర్చ జరుగుతోంది.
రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమే ఓ సంచలనం. మిడ్జిల్ మండలం నుంచి ఇండిపెండెంట్‌గా జెడ్పీటీసీకి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకుని స్వతంత్ర అభ‌్యర్థిగా శాసన మండలికి ఎన్నికై..అందరి దృష్టిని ఆకర్షించారు రేవంత్. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒక సారి ఎంపీ అయిన రేవంత్.. మంత్రి కాకుండానే డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్నారు.
ప్రత్యేక రాష్ట్రం తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దీనావస్థకు చేరింది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన హస్తం ఇక తెలంగాణలో కనుమరుగవుతుందా..? అని ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చెందారు. కాంగ్రెస్ పై ఉన్న అభిమానంతో కొంతమందిని ప్రజలు గెలిపించారు. కానీ వారు ‘హ్యాండిచ్చి’ టీఆర్ఎస్ లో చేరడంతో పార్టీలో ముఖ్య నాయకులు లేకుండా పోయారు. ఈ తరుణంలో ఉన్నవాళ్లు సైతం ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. అప్పటి వరకు టీడీపీలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ఇక ఆ పార్టీలో మనుగడ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆ తరువాత ఎమ్మెల్యేగా ఓడి.. ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ కండువాపై గెలిచారు. మొదట్లో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేరికపై చాలా మంది వ్యతిరేకించారు. కానీ ఆయన దూకుడుకు అధిష్టానం ఫిదా అయింది. దీంతో పార్టీ రాష్ట్ర బాధ్యతలను అప్పగించింది.
పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్.. ఎన్ని ఆటు పోట్లు ఎదురైనా తట్టుకొని నిలబడగలిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, నిరాశలో కూరుకుపోయిన కేడర్‌లో కొత్త ఉత్సాహం తీసుకురావడంతో సక్సెస్ అయ్యారు రేవంత్. పీసీసీ చీఫ అయిన తొలినాళ్ల నుంచే దూకుడుగా పని చేశారు. దళిత, గిరిజనుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ప్రజల్లోకి వెళ్లారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ లో ‘గిరిజన దండోరా’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించారు.
ఆ తరువాత టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లోనూ బహిరంగ సభ పెట్టి టీఆర్ఎస్‌లో గుబులు పుట్టించారు. అప్పటి వరకు నిరుత్సాహంగా ఉన్న కాంగ్రెస్ కేడర్లో ఈ సభలతో ఒక్కసారిగా ఊపు తెచ్చినట్లయింది. మొక్కవోని దీక్షతో పని చేసి.. కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చాడు. తెలంగాణ ఇచ్చినే పార్టీగా హస్తానికి.. విజయాన్ని అందించారు రేవంత్. తెలంగాణ అంతా జయహో రేవంత్ అనేంతగా పేరు సంపాదించుకున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




