కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రాని ఉప ఎన్నికలు... ఇప్పుడు ఎందుకు వస్తాయి? – రేవంత్ రెడ్డి

Revanth Reddy about bypolls in Telangana and he questions when there is no bypolls in BRS govt time why now
x

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రాని ఉప ఎన్నికలు... ఇప్పుడు ఎందుకు వస్తాయి? – రేవంత్ రెడ్డి

Highlights

బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాలేదు. ఇప్పుడు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు...

బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళు అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాలేదు. ఇప్పుడు ఎలా వస్తాయి? అని ప్రశ్నించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.

సీఎం ఎందుకీ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతోంది? కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్ళలో ఏం జరిగింది? ఉప ఎన్నికల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? పార్టీలు ఫిరాయించి అధికార కూటమిలో చేరిపోయి మంత్రిపదవులు చేపట్టడం కరెక్టేనా? అధికారం కోసం జెండాలు మార్చే కల్చర్ గురించి నిబంధనలు ఏం చేబుతున్నాయి? నేటి ట్రెండింగ్ స్టోరీలో చూద్దాం.

అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 24న నిజామాబాద్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి, పట్టభద్రుల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు అభ్యర్ధిని బరిలోకి దింపలేదో చెప్పాలన్నారు. కానీ, పార్టీ ఫిరాయించిన నాయకలుకు చెందిన 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని మాత్రం కేసీఆర్ అంటున్నారని... అసలు ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయని రేవంత్ ప్రశ్నించారు.

తెలుగుదేశం శాసనసభపక్షం బీఆర్ఎస్ శాసనసభపక్షంలో విలీనం

2014లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ 15 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచింది. తెలంగాణలో అప్పట్లో రాజకీయ పరిస్థితుల కారణంగా టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడారు. 12 మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. టీడీపీ శాసనసభపక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నామని స్పీకర్ కు లేఖ ఇచ్చారు. ఈ లేఖ ఆధారంగా టీడీపీ శాసనసభపక్షం బీఆర్ఎస్ లో విలీనమైందని అప్పటి స్పీకర్ ప్రకటించారు. టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు కేసీఆర్.

ఈ నిర్ణయంపై అప్పట్లో టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. 2017 అక్టోబర్ 31న రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. 2018 ఎన్నికల నాటికి టీడీపీకి ఆర్. కృష్ణయ్య, సండ్ర వెంకట వీరయ్య అనే ఇద్దరు ఎమ్మెల్యేలే మిగిలారు. టీడీపీ కంటే ముందే బీఎస్పీ‌ తరపున గెలిచిన ఇంద్రకిరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప బీఎస్పీ శాసనసభపక్షాన్ని బీఆర్ఎస్ లో విలీనం చేశారు.

కాంగ్రెస్ శాసనసభపక్షం విలీనం

2018లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లలో గెలిచింది. 2014లో అనుసరించిన స్ట్రాటజీనే బీఆర్ఎస్ అమలు చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ శాసనసభపక్షాలను బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు.

అప్పట్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారు. టీడీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వేర్వేరుగా బీఆర్ఎస్ లో చేరారు. కానీ, ఆ తర్వాత తమ పార్టీ శాసనసభపక్షాలను విలీనం చేస్తున్నామని స్పీకర్ కు లేఖ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపులపై అప్పట్లో కాంగ్రెస్ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

కాంగ్రెస్‌లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

2024 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు చెందిన దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, కాలె యాదయ్య, టి. ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఒక్కొక్కరుగానే ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. అంతేకాదు ఇదే విషయమై తెలంగాణ హైకోర్టులో కూడ పిటిషన్ దాఖలు చేసింది. తగిన సమయం లోపుగా ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేస్తోంది.

ఉప ఎన్నికలు వస్తాయంటున్న బీఆర్ఎస్

పార్టీ ఫిరాయించిన 10 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని గులాబీ పార్టీ ధీమాగా ఉంది. ఫిబ్రవరి 19న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు గెలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే రాజకీయంగా హస్తం పార్టీకి చెక్ పెట్టాలనేది కారు పార్టీ ప్లాన్. అయితే ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలానే పార్టీ ఫిరాయింపులు జరిగాయి. ఇప్పుడు కొత్తగా జరగలేదనేది ఆ పార్టీ వాదన. అప్పట్లో ఉపఎన్నికలు వస్తే ఇప్పుడు కూడా ఉప ఎన్నికలు వచ్చేందుకు ఛాన్స్ ఉందనేది అధికార పార్టీ వాదన.

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

పార్టీ ఫిరాయింపులను నిరోధించేందుకు చట్టాలు వచ్చాయి. అయితే ఈ చట్టాల్లోని లొసుగులను ఫిరాయింపుదారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఒక రాజకీయ పార్టీ నుంచి చట్టసభకు ఎన్నికై స్వచ్ఛందంగా ఆ పార్టీకి రాజీనామా చేస్తే అనర్హత వేటు పడుతుంది. ఇండిపెండెంట్ గా గెలిచి ఆరు నెలలకు ముందే మరో పార్టీలో చేరినా కూడా అనర్హత వేటు పడుతుంది. ఒక పార్టీలో గెలిచిన మొత్తం సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంతి వేరే పార్టీలో చేరితే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించదు.

రేవంత్ ధీమా ఏంటి?

2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు పది మంది. వీరికి ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించకూడదంటే.. మరో 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరాలి. అప్పుడు బీఆర్ఎస్ కు ఉన్న 39 మంది ఎమ్మెల్యేలలో మూడింట రెండు వంతుల మంది అంటే 26 మంది కాంగ్రెస్ లో చేరినట్లవుతుంది. అప్పుడు అది ఫిరాయింపు కిందకు రాదు. శాసన సభా పక్షం విలీనం కిందకు వస్తుంది.

అయితే, ఇప్పుడు మరో 16 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ గూటికి చేరే పరిస్థితి ఉందా అంటే.. లేదనే చెప్పాలి. అది ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రతికూల అంశమే.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ పరిధిలో ఉంటుంది. అయితే రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగితే కోర్టులు జోక్యం చేసుకునే వీలుంది. గతంలో ఇలాంటి కేసుల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. మణిపూర్ లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపుగానే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా అప్పట్లో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పిటిషన్ పై ఇటీవల విచారణ సమయంలో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది.

రీజనబుల్ టైం ఏంటి అని ఇటీవల సుప్రీంకోర్టు స్పీకర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో నిర్ణీత కాల వ్యవధి మాత్రం రాజ్యాంగంలో లేదు. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు రక్షణగా మారే అవకాశం లేకపోలేదని అభిప్రాయాలున్నాయి.

బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ పై ఫిబ్రవరి 25న విచారణ జరగాల్సి ఉంది. అయితే స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో విచారణను మార్చి 10కి వాయిదా పడింది. మార్చి 10న జరిగే విచారణ కీలకం కానుంది. పార్టీ ఫిరాయింపులపై ఎవరి వాదన ఎలా ఉన్నా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరించనుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories