
Congress: మాకూ ఇవ్వండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మిత్ర పార్టీల నుంచి రిక్వెస్టులు
Congress: కార్పొరేషన్ పదవుల్లోనూ సామాజిక న్యాయం పాటించే ఛాన్స్
Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా అన్ని పార్టీలు పని చేశాయి. ఎలాగైనా అధికారంలోకి వస్తామనే నమ్మకంతో పని చేసిన కాంగ్రెస్ పార్టీ... సీపీఐ, తెలంగాణ జనసమితి సహకారం తీసుకుంది. దీంతో ఎట్టకేలకు తెలంగాణలో సర్కార్‌ను ఏర్పాటు చేసింది హస్తం పార్టీ. ఇక ముందుగా చేసుకున్న ఒప్పందాలు, అధికారంలోకి వస్తే ఇస్తామన్న హామీలను నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తున్నాయి ఆయా పార్టీలు.
తెలంగాణలో బీఆర్ఎస్ పరాజయం వెనుక కీలక పాత్ర పోషించారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల కష్టాలను వివరిస్తూ ఊరూరా ప్రచారం చేశారు. మరో వైపు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సీపీఐకి ఉన్న ఓట్లను కాంగ్రెస్ వైపునకు వెళ్లాయి. అటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న పార్టీ క్యాడర్ మొత్తం.. కాంగ్రెస్ విజయానికి పూర్తిస్థాయిలో కృషి చేసింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా కోల్పోలేదు. కాంగ్రెస్ బలానికి మరింత తోడ్పాటునిస్తూ.. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చాయి.
అయితే ఎన్నికల పొత్తులో భాగంగా సీపీఐకి ఒక ఎమ్మెల్యే సీటు, రెండు ఎమ్మెల్సీలు, రెండు లేదా నాలుగు కార్పొరేషన్‌లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల లోపు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తామని చెప్పింది హస్తం పార్టీ. ఇప్పటికే తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే తమకు కూడా ఏదో ఒక పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కామ్రేడ్లు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో సీపీఐతో పాటు తెలంగాణ జన సమితి కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. సీపీఐకి హామీ ఇచ్చినట్టే కోదండరాం పార్టీకి కూడా రెండు ఎమ్మెల్సీలు, నాలుగు లేదా ఐదు కార్పొరేషన్‌లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం గవర్నర్ కోటాలో కోదండరామ్‌కు ఎమ్మెల్సీ ఇచ్చింది. అయితే కోదండరామ్‌కు ఇచ్చినట్టు తమకు కూడా ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులను త్వరగా కేటాయించాలని కోరుతోంది సీపీఐ. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన కోదండరామ్‌కు విద్యాశాఖ మంత్రిగా నియమించాలని జనసమితి నేతలు కోరుతున్నారు.
కార్పొరేషన్ పదవుల కోసం సీపీఐ పార్టీలోని నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ పదవిని కమ్యూనిస్టు పార్టీ నేతలకు ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు సమాచారం. అయితే సీపీఐకి ఇచ్చిన హామీల్లో ఒక హామీ పూర్తవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. మరో వైపు కాంగ్రెస్, సీపీఐకి ఇస్తామని చెప్పిన ఒక ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవుల విషయంలోనూ సామాజిక న్యాయం పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




