Avinash Reddy: తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఊరట..

Relief for Avinash Reddy in Telangana High Court
x

Avinash Reddy: తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఊరట..

Highlights

Avinash Reddy: అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు

Avinash Reddy: తెలంగాణ హైకోర్టులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. అవినాష్‌ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్ చేయకుండా.. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు అవినాష్‌. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. అవినాష్ ‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఎన్నో నాటకీయ పరిణామాలు.. సస్పెన్స్‌ల మధ్య సాగిన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ ఎపిసోడ్‌ ముగిసింది. సుదీర్ఘ విచారణలు, వాదనల అనంతరం ఎట్టకేలకు అవినాష్‌ రెడ్డికి బెయిల్ మంజూరైంది. సీబీఐ అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ వస్తున్న కోర్టు... ఇవాళ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

ఏప్రిల్ 16న వివేకా హత్య కేసులో పులివెందులలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. అదేరోజు అవినాష్‌ రెడ్డికి నోటీసులిచ్చింది. ఏప్రిల్ 17న విచారణకు రావాలని పేర్కొంది. దాంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే అవినాష్ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు ఏప్రిల్‌ 25 వరకు అరెస్ట్ చేయొద్దంటూ సీబీఐకు ఆదేశాలిచ్చింది.

ఇక ఏప్రిల్ 28న తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినలేమని తెలిపింది. వేసవి సెలవుల కారణంగా విచారణను జూన్‌5కి వాయిదా వేసింది. అత్యవసరం అయితే వెకేషన్ బెంచ్‌లో అప్పీల్ చేసుకోవాలని సూచించింది. హైకోర్టు విచారణ వాయిదా వేయడంతో... అవినాష్ లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనెల 23న అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని సూచించింది. మే 25న విచారణ చేపట్టి తీర్పు ఇవ్వాలని హైకోర్టును ఆదేశించింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు వెకేషన్ ‌బెంచ్‌ అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈనెల 27న వాదనలు పూర్తవగా.. మే 31 వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐని ఆదేశించింది. ఇవాళ తీర్పు వెలువరిస్తూ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే 5 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. పలు షరతులను విధించింది. సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లొద్దని తెలిపింది. ప్రతీ శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అవినాష్‌ బెయిల్ నిబందనలు ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సీబీఐకి సూచించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories