Charminar: పాతబస్తీలో రంజాన్ సందడితో ఫుల్ జోష్

Ramzan Celebrations in Old City
x

Charminar: పాతబస్తీలో రంజాన్ సందడితో ఫుల్ జోష్

Highlights

Charminar: చార్మినార్ దగ్గర రాత్ బజార్‌కు పోటెత్తిన సందర్శకులు

Charminar: పాతబస్తీలో రంజాన్ సందడి నెలకొంది. రంజాన్ అంటేనే చార్మినార్ గుర్తొస్తుంది. రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు వారికి కావాల్సిన కొత్తబట్టలు, కిరాణా సరుకుల దగ్గరి నుంచి మొదలుకొని కిరాణా సామగ్రి వరకు అన్నింటిని కొనుగోలు చేస్తుంటారు. చార్మినార్ దగ్గర షాపింగ్‌ను పూర్తిచేసుకొని ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులందరితో కలిసి రంజాన్ పండుగను జరుపుకుంటారు. అయితే షాపింగ్‌కి ఒక్క ముస్లిం సోదరులే కాదు..హిందువులు కూడా భారీ సంఖ్యలో షాపింగ్ చేస్తుంటారు.చార్మినార్ దగ్గరికి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా సందర్శకులు వచ్చి షాపింగ్ చేస్తుంటారు. ఆ తర్వాత ఇక్కడ ఘుమఘుమలాడే రకరకాల వెరైటీ ఫుడ్‌ను కూడా టేస్ట్ చేస్తుంటారు. ఇవాల్టితో రంజాన్ మాసం ముగుస్తుంది. అందుకే నిన్న చివరిరోజు కావడంతో రాత్రి చార్మినార్ వద్ద సందర్శకుల తాకిడి విపరీతంగా పెరిగింది.

రంజాన్ వచ్చిందంటే చాలు చార్మినార్ కళకళలాడుతుంది. సందర్శకులతో రంజాన్ మాసమంతా కిక్కిరిసిపోతుంది. ఫ్రెండ్స్, యువత, కుటుంబ సభ్యులతో కలిసి సందర్శకులు ఇక్కడకు భారీగా వస్తుంటారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల వస్తువులు, బట్టలను రాత్‌ బజార్‌ సందర్భంగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, రెండేళ్లుగా కరోనాతో కనిపించకుండా పోయిన రంజాన్ కళ..ప్రస్తుతం రెండింతల జోరుతో కొనసాగుతోంది. గాజులు, అలంకార వస్తువులతో సహా అన్ని వెరైటీలను ఈసారి అందుబాటులోకి తీసుకొచ్చామని దుకాణాదారులు చెబుతున్నారు. రంజాన్ సందర్భంగా రాత్ బజార్‌లో షాపింగ్ చేయడం సంతోషంగా ఉందని సందర్శకులు చెప్తున్నారు. అంతేకాదు..ఈసారి ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని సంబరపడుతున్నారు. అంతేకాదు రంజాన్ దగ్గర రకరకాల వంటకాల రుచులను ఆస్వాదిస్తూ మైమరచిపోతున్నారు సందర్శకులు. కేవలం రంజాన్ మాసంలోనే దొరికే ప్రత్యేక ఫుడ్ ఐటెమ్స్‌ను టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే, గాజుల తయారీ, అమ్మకాల్లో ఇప్పటికే దేశవ్యాప్తంగా పేరుగాంచిన పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో రంజాన్ పండుగను పురస్కరించుకుని దుకాణదారులు కొత్త కొత్త డిజైన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. రంజాన్ ఉపవాస నెలలో సంప్రదాయబద్ధంగా ఉపయోగించే సుర్మా, టోపీలు, సుగంధ ద్రవ్యాలు, అత్తరులు, ప్రత్యేక దుస్తులు, కుర్తా పైజామా వంటి వాటికి గిరాకీ పెరిగింది. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు సరైన రాబడి లేక ఇబ్బందులు ఎదుర్కొన్న దుకాణాదారులు ఈ ఏడాది వ్యాపారం బాగానే సాగుతోందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories