Top
logo

RailwayLine to Siddipet: సిద్ధిపేటకు రైల్వే కూత 2022 ప్రధమార్థంలో.. వేగంగా కొనసాగుతున్న పనులు

RailwayLine to Siddipet: సిద్ధిపేటకు రైల్వే కూత 2022 ప్రధమార్థంలో.. వేగంగా కొనసాగుతున్న పనులు
X
Highlights

RailwayLine to Siddipet: తెలంగాణాలో కొత్త రైల్వే ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి.

RailwayLine to Siddipet: తెలంగాణాలో కొత్త రైల్వే ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు పనులు పూర్తికాగా, సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన కొత్త లైన్ నిర్మాణం మరో సంవత్సరం ఆరు నెలల కాలంలో పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధంగా అనుకున్న ప్రకారం పనులు పూర్తయితే 2002 మార్చికల్లా సిద్ధిపేట నుంచి రైల్వే లైను హైదరబాద్ తో అనుసంధానం కానుంది.

2022 మార్చి.... తెలంగాణలోని కీలక పట్టణం సిద్దిపేట రైల్వే మార్గం ద్వారా రాజధాని హైదరాబాద్‌తో అనుసంధానం కాబోతోంది. కొత్తగా చేపట్టిన మనోహరాబాద్‌–కొత్తపల్లి ప్రాజెక్టులో రెండో దశ పనులు పూర్తయి 2022 మార్చిలో సిద్దిపేట వరకు రైలు సేవలు ప్రారంభించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అడ్డంకులు అధిగమించి పనులు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా మేడ్చల్‌ సమీపంలోని మనోహరాబాద్‌ స్టేషన్‌ సుంచి 31 కి.మీ. దూరంలోని గజ్వేల్‌ వరకు పనులు పూర్తయ్యాయి. ఇక్కడి వరకు రైలు నడుపుకోవటానికి రైల్వేశాఖ పచ్చజెండా ఊపింది.

జూన్‌ 18న రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తనిఖీ పూర్తి చేసి రైలు సర్వీసులకు అనుమతి మంజూరు చేశారు. అయితే కరోనా ఉధృతి నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు కొన్ని నిర్ధారిత మినహా సాధారణ రైళ్ల రాకపోకలకు అనుమతి లేకపోవడంతో రైలు సేవలు ఇంకా మొదలుకాలేదు. ఈ నిబంధనలు సడలించగానే గజ్వేల్‌ వరకు రైలు సేవలు మొదలుకానున్నాయి. గజ్వేల్‌ వరకు పనులు పూర్తి కావడంతో ప్రాజెక్టు రెండో దశలో భాగంగా సిద్దిపేట వరకు పనులు పూర్తి చేసేందుకు రైల్వే శాఖ వేగంగా ముందుకు సాగుతోంది.

ఇప్పటికే సిద్దిపేట సమీపంలోని దుద్దెడ వరకు ఎర్త్‌వర్క్‌ను దాదాపు పూర్తి చేసింది. అదే సమయంలో వంతెనల పనులు కూడా జరుపుతోంది. ఇవి వేగంగా సాగుతున్నాయి. కరోనా వల్ల కూలీల కొరత, రైల్వే శాఖ ఆదాయం పడిపోవడంతో పనుల్లో కొంత జాప్యం తప్పలేదు. త్వరలో వాటిని అధిగమించి వేగంగా పనులు పూర్తి చేయనున్నట్టు రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా నిర్వహించిన సమావేశంలో వాటిపై చర్చించారు. 'కొన్ని అడ్డంకులు ఉన్నా పనులు వేగంగానే సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో కీలకమైన సిద్దిపేట వరకు ఎట్టి పరిస్థితిలో 2022 మార్చి నాటికి రైలు సేవలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం, దానికి తగ్గట్టుగానే ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం'అని డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ ధర్మదేవరాయ్‌ పేర్కొన్నారు.

నాలుగు స్టేషన్లు.. 52 వంతెనలు..

గజ్వేల్‌ నుంచి సిద్దిపేట మధ్యలో నాలుగు స్టేషన్‌లు ఉండనున్నాయి. గజ్వేల్‌ తదుపరి కొడకండ్ల, లక్డారం, దుద్దెడ, సిద్దిపేట స్టేషన్లుంటాయి. మధ్యలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 52 వంతెనలు ఉంటాయి. వాటిల్లో ఐదు పెద్దవి. కుకునూర్‌పల్లి పోలీసు స్టేషన్‌ వద్ద రాజీవ్‌ రహదారిని రైల్వే లైన్‌ క్రాస్‌ చేస్తుంది. ఇక్కడ నాలుగు వరుసలతో పెద్ద వంతెన నిర్మించాల్సి ఉంది. రైలు మార్గం కింది నుంచి ఉండనుండగా వాహనాలు వంతెన మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. త్వరలో ఈ పనులు మొదలవుతాయి.

నేడు సికింద్రాబాద్‌ టు గజ్వేల్‌ రైలు పరుగు

సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి గజ్వేల్‌ వరకు పూర్తిస్థాయి రైలు బుధవారం పరుగుపెట్టనుంది. దీంతో సాధారణ రైలు సేవలు అధికారికంగా ప్రారంభించినట్టు కానుంది. సాధారణంగా కొత్త రైల్వే మార్గంలో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తనిఖీ పూర్తయి పచ్చజెండా ఊపిన తర్వాత 90 రోజుల్లో రైలు సేవలు ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఏదైనా కారణం చేత రైళ్లు ప్రారంభం కాని పక్షంలో.. మళ్లీ రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తనిఖీ చేసి అనుమతించిన తర్వాతగానీ రైళ్లను ప్రారంభించే అవకాశం లేదు. గత జూన్‌లో ఈ మార్గంలో రైల్వే సేఫ్టీ కమిషనర్‌ తనిఖీ చేసి ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో.. రైలు సేవలు మొదలుకావాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అందుకు వీలు లేకుండా పోయింది. దీంతో బుధవారం ఓ సాధారణ ప్రయాణికుల రైలును నడపటం ద్వారా అధికారికంగా సేవలు ప్రారంభించినట్టు రికార్డు చేయాలని రైల్వే నిర్ణయించింది.

Web TitleRailway Line to Siddipet in the first half of 2022 and works are gettind speed up in Telangana
Next Story