సిద్ధిపేట, గజ్వేల్‌లో వినిపించనున్న రైలు కూత

Railway Line in Siddipet District | Telangana News
x

సిద్ధిపేట, గజ్వేల్‌లో వినిపించనున్న రైలు కూత

Highlights

*మనోహరాబాద్ - గజ్వేల్ - కొడకండ్ల మధ్య పూర్తైన రైలు మార్గం

Siddipet: సిద్దిపేట జిల్లా వాసుల సుదీర్ఘ స్వప్నం నెరవేరే సమయం ఆసన్నమైంది. సిద్ధిపేటలో ఇక రైల్వే కూత వినిపించనుంది. మనోహరాబాద్‌ టూ గజ్వేల్‌ నూతన రైల్వే మార్గంలో త్వరలోనే రైళ్లు పరుగులు తీయనున్నాయి. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి వరకు నిర్మిస్తున్న రైలు మార్గంలోని తొలి దశలో భాగంగా చేపట్టిన మనోహరాబాద్‌-గజ్వేల్‌-కొడకండ్ల మార్గంలో 42.6 కిలోమీటర్ల మేర అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే మనోహరాబాద్‌-గజ్వేల్‌ మధ్య 33 కిలోమీటర్ల మేర ట్రయల్‌ రన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు రైల్వే అధికారులు.

తాజాగా గజ్వేల్‌ నుంచి కొడకండ్ల వరకు కొత్తగా నిర్మించిన 9.6 కిలోమీటర్ల రైల్వేలైన్‌ను రైల్వే సేఫ్టీ కమిషనర్‌ అభయ్‌కుమార్‌ రాయ్‌ పరిశీలించారు. గజ్వేల్‌ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటుచేసిన సిగ్నల్స్‌ కంట్రోలింగ్‌ వ్యవస్థ, మౌలిక వసతులు, రైల్వేట్రాక్‌, స్టేషన్ల నిర్మాణాలను క్షుణ్ణంగా తనిఖీచేశారు. ఈ మార్గంలో రైలును వేగంగా నడిపించి పరిశీలించారు. సేఫ్టీ కమిషనర్‌ అభయ్‌కుమార్‌ రాయ్‌తో పాటు DRM శరత్‌చంద్ర, డిప్యుటీ చీఫ్‌ ఇంజినీర్‌ సహధర్మ దేవరాయ, చీఫ్‌ ఇంజినీర్‌, చీఫ్‌ సిగ్నల్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీర్‌ ఉన్నారు.

మనోహరాబాద్‌ నుంచి వర్గల్‌ మండలం నాచారం, రాయపోల్‌ మండలం అప్పాయిపల్లి మీదుగా గజ్వేల్‌ పట్టణం వరకు మూడు స్టేషన్లతో పాటు రైల్వేట్రాక్‌ నిర్మాణం పూర్తయింది. మనోహరాబాద్‌ నుంచి నాచారం, బేగంపేట, అప్పాయిపల్లి, గజ్వేల్‌, కొడకండ్ల రైల్వే స్టేషన్లు పూర్తిగా సిద్ధమయ్యాయి. లకుడారం, దుద్దెడ, సిద్దిపేట స్టేషన్ల ఏర్పాటుకోసం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గజ్వేల్‌ రైల్వే స్టేషన్‌లో మొత్తం 5 లైన్లుగా రైల్వే పట్టాలను వేశారు. మొదటి మూడు లైన్లలో ప్యాసింజర్‌ రైళ్లు, 4వ లైనులో గూడ్స్‌ రైళ్లు, 5వ లైన్‌లో ప్యాకింగ్‌, మరమ్మతులు, ఇంజిన్ల సైడింగ్‌ కోసం వినియోగించనున్నారు. రెండో దశ పనుల్లో గజ్వేల్‌ నుంచి దుద్దెడ వరకు 32 కిలోమీటర్ల నిర్మాణం ఉంటుంది. ప్రస్తుతం పట్టాల బిగింపు, లైన్‌ నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి.

సిద్దిపేట శివారులో నిర్మించనున్న రైల్వే స్టేషన్‌ నిర్మాణ పనులకు కూడా త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్టు తెలుస్తోంది. 4 జిల్లాలు, 70 గ్రామాలు, పలు పుణ్యక్షేత్రాల మీదుగా సాగే ఈ రైల్వేలైన్‌ మొత్తం పొడవు 151.36 కిలోమీటర్లు. సికింద్రాబాద్‌-మన్మాడ్‌ వెళ్లే మార్గంలో మనోహరాబాద్‌ నుంచి రైల్వేలైన్‌ ప్రారంభమై, సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, కరీంనగర్‌ జిల్లాలోని వెదిర మీదుగా పెద్దపల్లి-నిజామాబాద్‌ వెళ్లే మార్గంలో కొత్తపల్లి వద్ద కలుస్తుంది. ఈ రైల్వే లైన్‌ నిర్మాణం పూర్తయితే కోల్‌కతా, న్యూఢిల్లీ, ముంబై తదితర మహానగరాలకు ఈ ప్రాంతాలతో రైల్‌ కనెక్టివిటీ పెరుగుతుంది. భవిష్యత్తులో గజ్వేల్‌ రైల్వేస్టేషన్‌ కేంద్ర బిందువుగా మారనున్నది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, షిర్డీ, తిరుపతికి ఇక్కడి నుంచి రైళ్లు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైల్వే అధికారులు. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories