Rahul Gandhi : నేడు తెలంగాణలో రాహుల్, ఖర్గే పర్యటన..రాజ్యసభ సీట్లపై ఫైనల్ నిర్ణయం?

Rahul Gandhi  : నేడు తెలంగాణలో రాహుల్, ఖర్గే పర్యటన..రాజ్యసభ సీట్లపై ఫైనల్ నిర్ణయం?
x
Highlights

నేడు తెలంగాణలో రాహుల్, ఖర్గే పర్యటన..రాజ్యసభ సీట్లపై ఫైనల్ నిర్ణయం?

Rahul Gandhi : ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నేడు (సోమవారం) తెలంగాణలో పర్యటిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అనంతగిరి వేదికగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. స్థానిక హరిత రిసార్ట్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన డీసీసీ (జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్షులకు నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో రాహుల్ పాల్గొని, పార్టీని క్షేత్రస్థాయిలో ఎలా బలోపేతం చేయాలనే అంశంపై దిశానిర్దేశం చేయనున్నారు.

రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ప్రకారం..ఆయన ఉదయం 9.15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో నేరుగా అనంతగిరి వెళ్తారు. అక్కడ తొలుత టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతో భేటీ అవుతారు. అనంతరం డీసీసీ అధ్యక్షులతో ముఖాముఖి మాట్లాడటమే కాకుండా, వారి కుటుంబ సభ్యులతో కూడా ఫోటోలు దిగి వారితో కాసేపు సమయం గడపనున్నారు. ఈ పర్యటనలో తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో అనంతగిరి ప్రాంతం కాంగ్రెస్ నాయకులతో కళకళలాడుతోంది. ఇప్పటికే ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనంతగిరికి చేరుకోగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాహుల్ గాంధీతో పాటు ముఖ్యమంత్రి కూడా వస్తుండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటన ముగించుకుని సాయంత్రం 5 గంటలకు రాహుల్ తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.

మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నేడు తెలంగాణలోనే పర్యటిస్తున్నారు. ఆయన నాగార్జునసాగర్‌లోని బుద్ధ పూర్ణిమను సందర్శించనున్నారు. అక్కడ బౌద్ధ భిక్షువుల ఆధ్వర్యంలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఒకే రోజు కాంగ్రెస్ ఇద్దరు అగ్రనేతలు రాష్ట్రానికి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే సమయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి అందించి, వివాహానికి రావాల్సిందిగా కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories