Pregnant Lady - Mancherial: 3గంటలు నొప్పులతో వాగులో నరకం చూసిన గర్భిణీ

Pregnant Lady Faced Problem With Floods For 3 Hours in Valley in Mancherial District
x

మంచిర్యాల జిల్లాలో వాగు (ఫైల్ ఫోటో)

Highlights

* ఉన్నతాధికారుల సూచనలతో డెలివరీ చేసిన 108 సిబ్బంది * తల్లీ బిడ్డ క్షేమం కోటపల్లి PHCకి తరలింపు

Pregnant Lady - Mancherial: పార్టీలు, పాలకులు ఎందరొచ్చినా గిరిజనుల జీవితాల్లో మాత్రం ఏ మార్పు రావడం లేదు. నేటికి ఇంకా సరైన రోడ్డు మార్గాలు, ఆస్పత్రులు, స్కూళ్లు లేని ఎన్నో తండాలు ఉన్నాయి. దీంతో వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైనా అత్యవసరమై ఆస్పత్రికి వెళ్లాల్సి వస్తే ఇక అంతే సంగతులు. కొండలు, వాగులు, వంకలు దాటుకుంటూ వెళ్లాల్సిందే. అంబులెన్స్‌లు ఊళ్లోకి వచ్చే పరిస్థితి అంతకన్నా లేదు. దీంతో గిరిజన మహిళలకు ప్రసవ వేదన తప్పడం లేదు.

మంచిర్యాల జిల్లా నక్కలపల్లి గ్రామానికి చెందిన సుభద్ర అనే గర్భిణీకి పురిటినొప్పులు మొదలయ్యాయి. అయితే గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గ్రామంలో ఉన్న వాగు ఉప్పొంగి పొర్లుతోంది. దీంతో బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వెంటనే బంధువులు వన్‌ జీరో ఎయిట్‌కు కు కాల్‌ చేశారు. అయితే అంబులెన్స్‌ కూడా వాగును దాటే పరిస్థితి లేకపోవడంతో వాగు అవతలి ఒడ్డు దగ్గరే ఆగిపోయింది.

సుభద్రకు ప్రసవ వేదన తీవ్రం కావడం, సమయం మించిపోతుండటంతో ఓ ప్రైవేట్‌ వాహనంలో వాగు దగ్గరకు బాధితురాలిని కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడి నుంచి వన్‌ జీరో ఎయిట్‌ సిబ్బందితో పాటు గ్రామస్తులు అతి కష్టం మీద స్ట్రెచర్‌పై గర్భిణీని వాగు దాటించారు. అనంతరం గర్భిణీని కోటపల్లి PHC కి తరలించే ప్రయత్నం చేశారు. అయితే సుభద్రకు పురిటినొప్పులు మరింత తీవ్రం కావడంతో అంబులెన్స్‌ను మార్గమధ్యలోనే నిలిపివేసి, ఉన్నత అధికారుల సూచనతో 108 సిబ్బందే పురుడు పోశారు. సుభద్ర పండంటి బిడ్డకు జన్మనివ్వగా తల్లీబిడ్డను కోటపల్లి ప్రాధమిక ఆసుపత్రికి తరలించారు.

ఇక అత్యవసర సమయంలో స్పందించిన 108 సిబ్బందికి, గ్రామస్తులకు సుభద్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ఇబ్బందులను ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. సరైన రోడ్లు, వాగులపై బ్రిడ్జిలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. తక్షణమే గిరిజన తండాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories