Telangana: తెలంగాణలో రేపు లోక్‌సభ ఎన్నికల పోలింగ్

Polling for Lok Sabha elections tomorrow in Telangana
x

Telangana: తెలంగాణలో రేపు లోక్‌సభ ఎన్నికల పోలింగ్

Highlights

Telangana: మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం

Telangana: తెలంగాణలో రేపు జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత భద్రాద్రి ఏజెన్సీలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరి‌హద్దు అటవీప్రాంతంలో ఓ వైపు భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రాద్రి డివిజన్‌లోని చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో అత్యంత సమస్యాత్మక కేంద్రాలను భద్రతాబలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

దండకారణ్యంలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలతో పోలీసులు అప్రమత్తమవుతున్నారు. మావోయిస్టుల కార్యాచరణపై నిఘా పెడుతూ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ఎన్నికల వేళ ఎలాంటి విధ్వంసాలకు పాల్పడుతారోననే నిఘా వర్గాల సమాచారంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కేంద్ర పారామిలిటరీ బలగాలు మోహరింపజేశారు. ఇప్పటికే అటవీప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి భద్రతా బలగాలు.

చర్ల మండలంలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత గ్రామాలైన ఉంజుపల్లి, తిప్పాపురం, పెద మిడిసిలేరు, చినమిడిసిలేరు లాంటి పోలింగ్ కేంద్రాల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలు తనిఖీలు చేపట్టాయి. రహదారులపై బాంబు స్క్వాడ్ టీమ్‌లు తనిఖీలు చేశాయి. మరోవైపు గ్రేహౌండ్స్ బలగాలు అడవిని జల్లెడపడుతున్నాయి.

ఇక అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద ఇప్పటికే తనిఖీలు చేపట్టారు. చర్ల నుంచి పూసుగుప్ప, వద్దిపేట, తిప్పాపురం, చెలిమల, చెన్నాపురం బేస్ క్యాంప్‌లకు అదనపు బలగాలను మోహరింపజేశారు. వరుస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లిపోతున్న ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణ ఈసీకి కత్తిమీద సాముల మారింది. అటు ఏ క్షణం జరుగుతుందోనని గిరిజన గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అప్రజాస్వామిక ఎన్నికలను బహిష్కరించాలని అటు మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో గిరిజనులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories