Bandi Sanjay: బండి సంజయ్‌ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసుల బ్రేక్

Police Denied Permission To Bandi Sanjay Praja Sangrama Yatra
x

Bandi Sanjay: బండి సంజయ్‌ 5వ విడత ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసుల బ్రేక్

Highlights

Bandi Sanjay: శాంతి భద్రతల కారణాల దృష్ట్యా పాదయాత్రకు అనుమతి నిరాకరణ

Bandi Sanjay: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఒక్కసారిగా పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. నిర్మల్‌ జిల్లా భైంసాలో ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సిన బండి సంజయ్‌ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతల కారణాల దృష్ట్యా పాదయాత్రకు పర్మిషన్‌ లేదని పోలీసులు తెలిపారు. ప్రజాసంగ్రామ యాత్ర కోసం కరీంనగర్‌ నుంచి నిర్మల్‌ వెళ్తున్న బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. జగిత్యాల మండలంలోని తాటిపల్లి వద్ద పోలీసులు సంజయ్‌ను అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. అయనను అరెస్ట్ చేసేందుకు యత్నించారు పోలీసులు.

అయితే.. పోలీసుల నుంచి తప్పించుకున్న సంజయ్.. కార్యకర్తల వాహనంలో కోరుట్ల వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు బండి సంజయ్. ముందు పాదయాత్రకు అనుమతి ఇచ్చి, చివరి నిమిషంలో ఎలా క్యాన్సిల్‌ చేస్తారంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ నియంత పాలనకు ఇదే నిదర్శనమని, ప్రజాస్వామ్య బద్ధంగా పాదయాత్రకు వెళ్తుంటే అడ్డుకుంటారా? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. భైంసా సున్నితమైన ప్రాంతమని చెబుతున్న పోలీసులకు.. పర్మిషన్ ఇచ్చే ముందు తెలియదా అని ఫైర్ అయ్యారు. భైంసా వెళ్లాలంటే వీసా తీసుకోవాలా అంటూ ధ్వజమెత్తారు. ఒవైసీ కుటుంబానికి ప్రత్యేక దేశంగా భైంసాని అప్పగిస్తున్నారా అంటూ దుయ్యబట్టారు. భైంసా నిషేధిత ప్రాంతమా అని ప్రశ్నించిన బండి సంజయ్.. భైంసానే కాపాడలేని సీఎం.. రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారని మండిపడ్డారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ రాకకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని, రూట్‌ మ్యాప్‌ ప్రకటించిన తర్వాత ఇలాంటి నిర్ణయాలేంటని మండిపడ్డారు. ఇవాళ భైంసాలో నిర్వహించే సభకు కచ్చితంగా వెళ్లి తీరుతానని తేల్చి చెప్పారు సంజయ్. అవసరమైతే న్యాయస్థానం తలుపులు తడతామన్నారు.

బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బీజేపీ శ్రేణులు ధర్నాకు దిగారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనతో పాటు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిర్మల్‌ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బైఠాయించారు. భైంసాలో బండి సంజయ్‌ పాదయాత్రకు అనుమతివ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మరోవైపు.. జగిత్యాల జిల్లా మాల్యాల చౌరస్తా నుంచి కరీంనగర్ వెళ్లే రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం నిర్మల్ వెళ్తున్న బండి సంజయ్‌ ను అడ్డుకోవడం దారుణమన్నారు. బండి సంజయ్ పాదయాత్ర చేస్తే భయమెందుకని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకోగా.. ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్.. పోలీసుల తీరుపై మండిపడ్డారు.

ఇది జరిగిన కాసేపటికి పోలీసులు బండి సంజయ్‌న్‌.. కరీంనగర్‌లోని ఆయన నివాసం వద్ద వదిలిపెట్టారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు.. సంజయ్‌ ఇంటికి భారీగా చేరుకున్నారు. అయితే.. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ భైంసాలో సభ పెట్టే తీరుతామంటున్న బండి సంజయ్‌ వ్యాఖ్యలతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో కరీంనగర్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories