Amnesia Pub Case: సాదుద్దీన్‌ రెచ్చగొట్టడంతోనే అత్యాచారం చేసినట్లు మైనర్లు స్టేట్‌మెంట్‌

Police Are Investigating the Jubilee Hills Rape Case | Hyderabad News
x

Amnesia Pub Case: సాదుద్దీన్‌ రెచ్చగొట్టడంతోనే అత్యాచారం చేసినట్లు మైనర్లు స్టేట్‌మెంట్‌

Highlights

Amnesia Pub Case: మొదట ఎమ్మెల్యే కుమారుడే అఘాయిత్యానికి పాల్పడ్డాడని సాదుద్దీన్‌ స్టేట్‌మెంట్‌

Amnesia Pub Case: హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ మైనర్ బాలిక అత్యాచారం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు వారితో సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఘటన జరిగిన ప్రదేశాలన్నీ తిప్పి వారి నుంచి కీలక విషయాలు రాబట్టారు. కస్టడీ విచారణలో భాగంగా ఐదుగురు మైనర్లను జువైనల్‌ హోమ్‌ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని నేరుగా సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌కు తీసుకెళ్లారు. పోలీస్ మినీ బస్‌లో మొదట అమ్మేషియా పబ్‌కు తీసుకెళ్లారు. అనంతరం బేకరి ప్రాంతాలకు తీసుకెళ్లారు. రోడ్‌ నెంబర్‌ 36, 44కు తీసుకెళ్లి సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్ చేశారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆ తర్వాత అత్యాచారం ఘటన జరిగిన పెద్దమ్మతల్లి ఆలయం వెనక‌ ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. అనంతరం వారిని‌‌ జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించి గంటపాటు‌ విచారించారు. నిందితులకు పలుప్రశ్నలు సంధించిన పోలీసులు విచారణ ముగిసిన తర్వాత మళ్లీ జువైనల్‌ హోమ్‌కు తరలించారు.

ఆమ్నేషియా పబ్ రేప్‌ కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఏ1 నిందితుడు సాదుద్దీన్ నాలుగు రోజుల కస్టడీ విచారణ ముగిసింది. మిగతా ఐదుగురు మైనర్లలో A2, A3, A4 ముగ్గురిది మూడు రోజుల పోలీసు కస్టడీ విచారణ పూర్తవగా మరో ఇద్దరు A5, A6 మైనర్లది రెండ్రోజుల విచారణ పూర్తయింది. ఇదిలా ఉంటే విచారణలో నిందితులంతా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నట్టు సమాచారం. సాదుద్దీన్‌ ప్రోద్బలంతోనే అత్యాచారం చేశామని కొందరు మైనర్లు పోలీసులకు వెల్లడించగా ఎమ్మెల్యే కుమారుడు, కార్పొరేటర్‌ కుమారుడే మొదట ప్లాన్ వేశారని పోలీసుల విచారణలో సాదుద్దీన్ స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో బాధిత మైనర్ బాలిక మెడికల్ రిపోర్ట్ సైతం కీలకంగా మారింది. మైనర్ బాలిక మెడపై పళ్లతో కొరికిన పన్నెండు గాయాలను వైద్యులు గుర్తించారు. బాలిక మెడపై టాటూలా ఉండాలనే అలా కొరికినట్లు మైనర్లు తెలిపారు. ఈ కేసులో మైనర్లందరికీ లైంగిక పటుత్వ పరీక్షను సైతం చేశారు. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే సమయంలో ఇది కీలకంగా మారనుంది.

జూబ్లీహిల్స్ మైనర్‌ రేప్‌ కేసులో నిందితులకు ఆదివారం మధ్యాహ్నం భోజన సమయంలో బిర్యానీలు తీసుకెళ్లడం.. విమర్శలకు తావిచ్చింది. సీన్ రీ-కన్‌స్ట్రక్షన్‌ అనంతరం ఐదుగురు నిందితులను. జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే స్టేషన్‌లో ఉన్న నిందితులకు వారి బంధువులు బిర్యానీ ప్యాకెట్లు తీసుకువచ్చారు. కస్టడీ సమయంలో నిందితుల భోజన వసతి చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదే కానీ, ఈ విషయం బయటకు రావడంతో నిందితులను పోలీసులు వీఐపీలుగా ట్రీట్‌ చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

ఇక జూబ్లీహిల్స్ రేప్ కేసు వ్యవహారంతో ఇప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్ వాహనాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్‌ అత్యాచార ఘటనలో నిందితులు ఓ బెంజ్‌ కారుతో పాటు ఇన్నోవాను వాడినట్లు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. అందులో ఇన్నోవా కారు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో ఉండటంతో పాటు దానిపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ ఉంది. దీంతో ఆ వాహనం యజమానిని గుర్తించటం పోలీసులకు కొంత కష్టంగా మారింది. కారుపై టీఆర్‌ నంబర్ అస్పష్టంగా ఉండటంతో కారు యజమాని వివరాలు తెలుసుకోవటం పోలీసులకు ఆలస్యమైంది. చివరకు ఇన్నోవా షోరూమ్ లో వెహికిల్ మోడల్ నంబర్ ఆధారంగా కారు యజమానిని గుర్తించారు పోలీసులు. అయితే సిటీలో తాత్కాలిక రిజిస్ట్రేషన్లతో వేలాది వాహనాలు తిరుగుతున్నా చర్యలు తీసుకునే నాధుడే కరువయ్యాడు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ వాహనాలను నేరాలు చేయటానికి కొందరు కేటుగాళ్లు ఉపయోగిస్తుండటం కలవరానికి గురి చేస్తుంది. టీఆర్‌ పేరుతో తిరుగుతున్న వెహికల్స్‌ను చూసీ, చూడనట్లుగా వదిలేయటంతో నేరగాళ్లు వీటిని బాగా ఉపయోగిస్తూ.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు.

ఈ అత్యాచార ఘటనలో వాడిన ఇన్నోవా కారును సెప్టెంబర్ 2019లో కొనుగోలు చేసినా.. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ వాహనాన్ని పోలీసులు గుర్తించి.. తదుపరి ప్రభుత్వ రంగ సంస్థలోని ఓ పదవిలో ఉన్న వ్యక్తి దీనిని ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. అయితే వాహనం కొనుగోలు చేసిన 30 రోజుల్లో యజమాని తన పేరిట శాశ్వత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.. లేదంటే మరో ఆరునెలల్లోపు అదనపు రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును రవాణా శాఖ కల్పించింది. అయితే గ్రేటర్ పరిధిలో చాలా మంది యజమానులు టెంపరరీ రిజిస్ట్రేషన్ తోనే తమ వాహనాలను నడుపుతున్నట్లు తెలుస్తోంది. ద్విచక్ర వాహనదారులు కూడా సంవత్సరాలు గడుస్తున్నా.. శాశ్వత రిజిస్ట్రేషన్ చేయించుకోక పోవటం సర్వసాధారణ విషయంగా మారింది. దీంతో.. నేరాలు జరిగినప్పుడు ఇలాంటి వాహనాలను గుర్తించటం పోలీసులకు తలకు మించిన భారంగా మారుతోంది.

గ్రేటర్‌లో ప్రతిరోజు సుమారు 16 వందలకు పైగా వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. వీటిలో ఐదువందల వరకు కార్లు ఉంటే మరో పదకొండు వందలకు పైగా బైక్‌లు, ఇతర వాహనాలు ఉంటున్నాయి. రిజిస్ట్రేషన్‌ సమయంలో తమకు కావాల్సిన నంబర్ల కోసం ఎదురు చూస్తూ కొందరు ఆలస్యం చేస్తుండగా, మరికొందరు ఉద్దేశపూర్వకంగానే రిజిస్ట్రేషన్‌ ఆలస్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక శాశ్వత రిజిస్ట్రేషన్ తో పాటు చిరునామాల మార్పు విషయంలోనూ వాహనదారుల నిర్లక్ష్యం.. కొన్నిసార్లు ఇబ్బందికరంగా తయారవుతోంది. వాహనాలను ఇతరులు కొనుగోలు చేసిన సందర్భాల్లోనూ.. యాజమాన్య బదిలీ జరగటం లేదని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ వాహనం స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలు.. నిజంగా ప్రభుత్వశాఖకు చెందిన వ్యక్తులవేనా? కాదా? అనే విషయంలోనూ పోలీసులు కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు వ్యవహారంతోనైనా పోలీసులు, రవాణాశాఖ అధికారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories