KCR : కేసీఆర్ వర్సెస్ సిట్.. ఫోన్ ట్యాపింగ్ విచారణలో కొనసాగుతున్న ఉత్కంఠ

KCR : కేసీఆర్ వర్సెస్ సిట్.. ఫోన్ ట్యాపింగ్ విచారణలో కొనసాగుతున్న ఉత్కంఠ
x
Highlights

కేసీఆర్ వర్సెస్ సిట్.. ఫోన్ ట్యాపింగ్ విచారణలో కొనసాగుతున్న ఉత్కంఠ

KCR : తెలంగాణను ఒకప్పుడు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన సాక్షిగా విచారణకు రావాలని సిట్ అధికారులు మాజీ సీఎం కేసీఆర్‌కు రెండోసారి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో సిట్ బృందం బంజారాహిల్స్‌లోని నందినగర్ నివాసానికి వెళ్ళింది. అయితే అక్కడ సిబ్బంది ఎవరూ నోటీసులు తీసుకోవడానికి నిరాకరించడం లేదా అందుబాటులో లేకపోవడంతో, అధికారులు ఆ నోటీసును కేసీఆర్ ఇంటి గోడకు అంటించి వచ్చారు. ఫిబ్రవరి 1వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు.

అసలు వివాదం విచారణ జరిగే స్థలం గురించి మొదలైంది. తాను ప్రస్తుతం హైదరాబాద్‌లో లేనని, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉంటున్నానని.. తన వయసు దృష్ట్యా అక్కడికే వచ్చి విచారించాలని కేసీఆర్ అంతకుముందు లేఖ రాశారు. దీనిపై సిట్ అధికారులు తీవ్రంగా స్పందించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఇది అని, దీని పరిధి హైదరాబాద్‌లోనే ఉంటుందని వారు గుర్తు చేశారు. ఈ కేసులో అనేక సున్నితమైన ఎలక్ట్రానిక్ ఆధారాలు, భారీ రికార్డులు ఉన్నాయని.. అవన్నీ తీసుకుని ఎర్రవల్లికి రావడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఎన్నికల అఫిడవిట్‌లో కానీ, అసెంబ్లీ రికార్డుల్లో కానీ కేసీఆర్ ఇచ్చిన అధికారిక చిరునామా నందినగర్ కాబట్టి, అక్కడే విచారణ నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

కేసీఆర్ మాత్రం సీఆర్‌పీసీ సెక్షన్ 160 (ప్రస్తుత బీఎన్ఎస్ ప్రకారం మార్పులు ఉన్నప్పటికీ) కింద 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారు కోరుకున్న చోటే విచారించాలని తన న్యాయ బృందంతో చర్చిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టు, హైకోర్టుల గత తీర్పులను ఉటంకిస్తూ సిట్‌కు మరో లేఖ రాయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఒకవేళ సిట్ అధికారులు పట్టుబడితే కోర్టును ఆశ్రయించే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ లీగల్ టీమ్ ఉంది. ఇప్పటికే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సుదీర్ఘంగా సమావేశమై దీనిపై చర్చలు జరిపారు.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో విభిన్నమైన చర్చ నడుస్తోంది. గతంలో కాళేశ్వరం విచారణ కోసం కేసీఆర్ స్వయంగా వచ్చి సాక్ష్యం ఇవ్వడం వల్ల పార్టీకి సానుభూతి పెరిగిందని కొందరు నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, కేసీఆర్ స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కో లేదా నందినగర్ నివాసానికో వచ్చి విచారణకు హాజరైతే అది రాజకీయంగా పార్టీకి మేలు చేస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. పోలీసుల ఓవరాక్షన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చని ప్లాన్ చేస్తున్నారు.

అయితే సిట్ అధికారులు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఏ చిన్న తప్పు జరిగినా కేసు వీగిపోయే అవకాశం ఉండటంతో న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాతే నోటీసులు జారీ చేశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్ నివాసంలో కానీ లేదా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కానీ కేసీఆర్ అందుబాటులో ఉండాలని సూచించారు. ఎక్కడ విచారణకు సిద్ధంగా ఉంటారో శనివారం లోపు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇప్పుడు అందరి దృష్టి కేసీఆర్ ఇచ్చే సమాధానంపైనే ఉంది. ఆయన హైదరాబాద్‌కు వస్తారా లేక ఫామ్‌హౌస్‌కే రావాలని పట్టుబడతారా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories