KCR SIT Investigation: కేసీఆర్ నివాసానికి 'సిట్' అధికారులు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణ.. నందినగర్‌లో యుద్ధ వాతావరణం!

KCR SIT Investigation: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణకు రంగం సిద్ధమైంది. ఎర్రవెల్లి ఫాంహౌస్ నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్న గులాబీ బాస్. సిట్ విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 Feb 2026 2:06 PM IST
KCR SIT Investigation
X

KCR SIT Investigation: కేసీఆర్ నివాసానికి 'సిట్' అధికారులు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణ.. నందినగర్‌లో యుద్ధ వాతావరణం!

KCR: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) సిద్ధమైంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు నందినగర్‌లోని ఆయన నివాసంలోనే ఈ విచారణ జరగనుంది.

ఫాంహౌస్ నుంచి నందినగర్‌కు..

ఈ విచారణ నిమిత్తం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్ నుంచి బయలుదేరి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, తమ అధినేతపై విచారణను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునే అవకాశం ఉండటంతో ఉద్రిక్తత నెలకొంది.

పోలీసుల హై అలర్ట్ - ఇంటెలిజెన్స్ హెచ్చరిక:

పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటెలిజెన్స్ చీఫ్ రాష్ట్రంలోని కమిషనర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశారు.

భారీ బందోబస్తు: నందినగర్ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ ప్రాంతం చుట్టూ ముప్పేట భద్రత ఏర్పాటు చేశారు.

ఆందోళనల భయం: విచారణ వేళ బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు చేపట్టారు.

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు:

విచారణ ముగిసే వరకు నందినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.

ప్రభావిత ప్రాంతాలు: నందినగర్‌, బసవతారకం రోటరీ, అగ్రసేన్ జంక్షన్, ఎన్‌టీఆర్ భవన్, రోడ్ నెంబర్-12.

సూచన: వాహనదారులు ఈ మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ దారుల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

సిట్ ఏం ప్రశ్నించనుంది? గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక అధికారుల వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్‌ను అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ విచారణలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story