Nizamabad: అన్నదాత..అద్భుతం.. శివలింగం ఆకారంలో వరిసాగు

Paddy in the shape of Shiva Lingam in Nizamabad
x

Nizamabad: అన్నదాత..అద్భుతం.. శివలింగం ఆకారంలో వరిసాగు

Highlights

Nizamabad: జీ-20 సమావేశాల అతిథులకు స్వాగతం పలుకుతూ.. వరినాట్లతో అద్భతంగా అక్షరాలు రాసిన రైతు చిన్నికృష్ణ

Nizamabad: కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపిస్తున్నాడు ఓ రైతు. తాను ఎంచుకున్న రంగంలో వినూత్న అలోచనలతో ముందుకు వెళ్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఓ వైపు ప్రకృతి సేంద్రియ వ్యవసాయంతో లాభాలు గడిస్తూ..మరోవైపు వరి నాట్లతో సందేశాత్మాక చిత్రాలు వేస్తూ అందరీని అబ్బురపరుస్తున్నాడు. ఇంతకూ ఎవరా రైతు. ఓసారి లుక్కేద్దాం...

నిజామాబాద్ జిల్లా జాక్రాన్‌పల్లి మండలం చింతలూరుకు చెందిన చిన్నిక్రిష్ణ అనే రైతు వ్యవసాయ రంగంలో నూతన ఒరవడి సృష్టిస్తున్నాడు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో నూతన ఒరవడికి తెరలేపాడు. నిజామాబాద్ జిల్లా గూపన్‌పల్లిలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో నూతన వంగడాలు వేయడంతో పాటు ... వరినాట్లతో పలు చిత్రాలు అవిష్కరిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ముఖ్యంగా శ్రావణమాసం ప్రారంభమైన నేపద్యంలో తన వ్యవసాయ క్షేత్రంలోని 16 గుంటల భూమిలో ..శివలింగం చుట్టూ సోమసూత్ర ప్రదక్షణ ఆకారంలో వరినాట్లు వేశాడు. నిపుణుల సహకారంతో మ్యాప్ గీయించుకుని అందుకు అనుగుణంగా నాట్లు వేశానని రైతు చిన్నికృష్ణ చెబుతున్నాడు.

శివలింగానికి క్షీరాభిషేకం చేస్తే కిందకు ధారగా పాలను తాకకుండా తిరుగుముఖంతో చేసే సోమసూత్ర ప్రదక్షిణకు ఎంతటి ప్రాధాన్యం ఉంటుంది. అదంతా వివరించేలా రైతు చిన్ని కృష్ణుడు విలక్షణంగా తన వ్యవసాయ క్షేత్రాన్ని తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. ఈ ఏడాది డిల్లీలో నిర్వహించే జీ-20 సమావేశాల నేపథ్యంలో అతిథులకు స్వాగతం పలుకుతూ అద్భుతంగా అక్షరాలు పొందుపరిచాడు. ఈ చిత్రం నిజామాబాద్‌ నగరశివారులోని గూపన్‌పల్లిలో దర్శనమిస్తోంది. విభిన్నంగా పంటలు సాగు చేసే అభ్యుదయ రైతు చింతలూరి చిన్నికృష్ణుడు . ఈసారి విలక్షణమైన పంటతో ఆకట్టుకుంటున్నారు. వ్యవసాయక్షేత్రంలో 16 గుంటల విస్తీర్ణంలో గోదావరి ఇసుక, కాలబట్టి, పంచరత్ర, బంగారు గులాబీ, చింతలూరి సన్నాలు.. ఐదు దేశీయ వరి వంగడాలతో ఈ ఆకృతిని రూపొందించారు.

హైదరాబాద్‌కు చెందిన డా.రాకేశ్‌రెడ్డి సూచనతో వేదపండితుల ప్రేరణతో తాను సోమసూత్ర ప్రదక్షిణ ఆకారంలో పంట పండించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం 50 రోజుల పంటకాలంతో పైరు ఆద్భుతంగా కనిపిస్తోందని, విద్యార్థులకు, రైతులకు దీని విశిష్టతను వివరిస్తున్నట్లు వెల్లడించారు. గతేడాది ఇదే రైతు తన తల్లిదండ్రుల చిత్రాలు ప్రతిబింబించేలా పంటసాగు చేశారు. గతంలో సైతం తన 28 గుంటల భూమిలో 36 రకాల వరి వంగడాలు వేయడంతో పాటు సూర్యకిరణాల వలె వరి నాట్లు వేసి అందరిని అకర్షించాడు. అంతేకాకుండా నిపుణుల సహాయంతో 30 గుంటల భూమిలో తన తల్లిదండ్రుల రూపంలో వరినాట్లు వేసి వండర్ బుక్ అఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. మరోవైపు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంతో లాభాలు గడిస్తూ వ్యవసాయ రంగంలో పలు జాతీయ పురష్కారాలు అందుకున్నారు.

మొత్తానికి సేంద్రియ వ్యవసాయంతో సందేశాత్మక చిత్రాలు వేస్తూ నూతన ఒరవడిని సృష్టిస్తున్న ఆదర్శ రైతు చిన్నిక్రిష్ణను పలువురు ఆభినందిస్తున్నారు. మరోవైపు విద్యార్దులు, పలువురు రైతులు చిన్నిక్రిష్ణ కొత్త ఒరవడులను చూసేందుకు తన వ్యవసాయ క్షేత్రానికి క్యూ కడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories