Telangana: అతి విశ్వాసమే బిజెపి కొంప ముంచిందా?

Overconfident Doomed BJP?
x

తెలంగాణ:(ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Telangana: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అతివిశ్వాసంతోనే బీజేపీ ఓడిందనే చర్చ నడుస్తోంది.

Telangana: తెలంగాణలో 2023లో అధికారం తమదేనని కమలనాథులు పదే పదే చెప్పే మాట ఇది‌. అందుకు కసరత్తు సైతం కాషాయ నేతలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో తిరుగులేని విజయంతో పాటు.. గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొన్నారు. ఇదే నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం విజయం సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. అయితే ఫలితాలు తారుమారు కావటంతో కమలనాథులకు తత్వం బోదపడిందట. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైద్రాబాద్‌లో అతివిశ్వాసంతోనే బీజేపీ ఓడిందనే చర్చ నడుస్తోంది.

నిజానికి ఖమ్మం-వరంగల్- నల్లగొండ స్థానంపై బీజేపీకి పెద్దగా ఆశలు లేవు. కానీ రామచంద్రరావు కాబోయే ఎమ్మెల్సీ అంటు అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు బీజేపీ ముఖ్యనేతలు అనేక సమావేశాల్లో పదే పదే సంబోధించడంపై సొంత పార్టీలోనే చర్చ నడుస్తోందట. క్షేత్రస్థాయిలో చేయాల్సిన పని చేయకుండా రామచంద్రరావు మళ్ళీ గెలుస్తారన్న అతివిశ్వాసమే కొంప ముంచిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వాణీదేవి పేరు తెరమీదకు వచ్చాక కూడా...

నిజానికి వాణీదేవి పేరు తెరమీదకు వచ్చే వరకు రామచంద్రరావు గెలుపు నల్లేరు మీద నడకనే అన్న వ్యాఖ్యలు వినిపించాయి. మహా అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్‌తోనే కొంత పోటీ ఉంటోందని బీజేపీ నేతలు అంచనా వేశారు. అయితే సీఎం కేసీఆర్ వాణీదేవి పేరును ప్రకటించాక బీజేపీ నేతలు కళ్ళు తెరవలేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా ఉపయోగించిన ప్రణాళికను అమలు చేయటంలో కాషాయపార్టీ విఫలమైంది. ప్రచారాన్ని హోరెత్తించటం, అధికార పార్టీ నాయకులకు, ముఖ్యంగా కేటీఆర్‌ను ధీటుగా ఎదుర్కోవడంలో అప్పట్లో బీజేపీ సక్సెస్ అయింది. గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ.. భూపేందర్ యాదవ్ లాంటి నేతను ఇంఛార్జ్‌గా నియమించి కమలం పార్టీ సక్సెస్ అయింది.

సీరియస్ గా తీసుకోని బిజెపి...

అయితే ఎమ్మెల్సీ ఎన్నికలను మాత్రం బీజేపీ జాతీయ నాయకత్వం అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కన్పించలేదు. దీనికి తోడు గ్రేటర్‌లో కొత్త ఎన్నికైన కార్పొరేటర్లు ఉన్న బీజేపీ వాడుకోలేదని విమర్శ ఉంది. అభ్యర్థి రామచంద్రరావుకు అధ్యక్షుడు బండి సంజయ్ మినహా మద్ధతుగా నిలబడిన పెద్ద నాయకులు కన్పించలేదు. గ్రేటర్ ఎన్నికల సమయంలో అధికార టీఆర్ఎస్, మంత్రి కేటీఆర్‌పై విరుచుకుపడిన కిషన్‌రెడ్డి, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్, రఘునందనరావు, రాజాసింగ్ లాంటి ఫేసున్న నాయకులు కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టడంలో విఫలమయ్యారనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఐటీఐఆర్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గ్యాస్, పెట్రోల్ ధరలపై మంత్రి కేటీఆర్‌కు కౌంటర్ ఇవ్వటంలో బీజేపీ ముఖ్యనేతలు విఫలయ్యారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

పోల్ మేనేజ్మెంట్ చేయటంలో విఫలం...

ఇంకోవైపు పోల్ మేనేజ్మెంట్ చేయటంలో కమలనాథులు విఫలమయ్యారనే విమర్శలు విన్పిస్తున్నాయి. తమ‌ అనుకూల పట్టభద్రులను కూడా పోలింగ్ బూత్‌కు తీసుకెళ్ళలేకపోయారు.‌‌ టీఆర్ఎస్ మాదిరి బీజేపీకి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు లేకపోవటం కూడా పోల్ మేనేజ్మెంట్ చేయలేకపోవటానికి కారణం. మరోవైపు మహబూబ్‌నగర్- రంగారెడ్డి జిల్లాల కంటే హైద్రాబాద్ పైనే బీజేపీ ఎక్కువ దృష్టి పెట్టింది. అయితే చేతిలో ఉన్న 47మంది కార్పొరేటర్లను కూడా ఉపయోగించుకోలేకపోయారనే మాటలు విన్పిస్తున్నాయి. ఇంకోవైపు మహబూబ్‌నగర్- రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి వేయలేదట. కేవలం హైదరాబాద్‌ మీదనే ఫోకస్ పెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

హైద్రాబాద్ పైనే ఎక్కువ దృష్టి...

మరోవైపు రామచంద్రరావు ఎమ్మెల్సీగా హైద్రాబాద్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారని.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సమస్యలపై ఫోకస్ చేయలేదని ఆయా జిల్లాల బీజేపీ నేతలే చెప్తున్నారట. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న విద్యాసంస్థలు, యూనివర్సిటీల సమస్యలపై ఆరేళ్ళల్లో రామచంద్రరావు మండలిలో మాట్లాడి ఉంటే ఎమ్మెల్సీ ఫలితం మరోలాఉండేదన్న చర్చ కాషాయపార్టీలో నడుస్తోందట. మరోవైపు మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైద్రాబాద్ స్థానంపై స్వయంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం‌ కారణంగానే సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయామని కమలనాథులు చెప్తున్నారట.

అధికార పార్టీని అలెర్ట్ చేసి బీజేపీ...

పచీస్ పరివార్ బీజేపీ వ్యూహాన్ని బహిరంగంగా ప్రకటించి.. అధికార పార్టీని అలెర్ట్ చేసి బీజేపీ నష్టపోయిందనే ప్రచారం పార్టీలో ఉంది. దీనికి తొడు దుబ్బాక, జీహెచ్‌ఎంసీ వేవ్ తమను గట్టెక్కిస్తుంది అన్న కమలనాథుల అతివిశ్శ్వాసం బీజేపీ కొంపముంచినట్టు తెలుస్తుంది. దుబ్బాకలో అధికార పార్టీ టీఆర్ఎస్‌ చేసిన తప్పు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేసిందని చర్చ ఉంది. బీజేపీ ఏ ఎన్నికలైన... దుబ్బాక లాగా చాలేంజ్‌గా తీసుకోకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురయ్యే ప్రమాదం ఉందని నేతలు కొందరు హెచ్చరిస్తున్నారు. మరి బీజేపీ ఈ ఫలితాన్ని గుణపటాంగా తీసుకుంటుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories