Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదం

Ongoing Water Dispute Between Two Telugu States
x
రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం (ఫైల్ ఫోటో)
Highlights

Water Issue: జూరాల, పులిచింతల ప్రాజెక్ట్‌ల దగ్గర పహారా * రాయలసీమ ఎత్తిపోతలను ఆపాలంటున్న తెలంగాణ సర్కార్

Water Issue: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ప్రాజెక్టులన్నీ పోలీసు పహారాలోకి వెళ్లాయి. జూరాల నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నాగార్జునసాగర్‌ వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలని కోరేందుకు వచ్చిన ఏపీ అధికారులను... తెలంగాణ పోలీసులు అనుమతించలేదు. పులిచింతల వద్ద విద్యుదుత్పత్తి నిలిపివేయాలంటూ ఆ ప్రాజెక్టు ఎస్‌.ఇ తెలంగాణ జెన్‌కో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. జూరాల డ్యాంపైకి తెలంగాణ రాకపోకలు నిలిపివేయగా, ఆర్డీఎస్‌ కుడికాలువ వద్ద ఆంధ్రప్రదేశ్‌ పోలీసు బలగాలను మోహరించింది. ఈ పనులను నిలిపివేయాలని తెలంగాణ కోరింది. శ్రీశైలం వద్ద రెండు రాష్ట్రాలు పోలీసులను మోహరించగా, పోతిరెడ్డిపాడు వద్ద పోలీసులను పెంచి ఏపీ ఎవరినీ అనుమతించడం లేదు. రెండు రాష్ట్రాల్లోనూ ఆయా జిల్లాల ఎస్పీలు పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

జూరాల నుంచి పులిచింతల వరకు అన్ని ప్రాజెక్టుల్లోనూ తెలంగాణ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోంది. పోతిరెడ్డిపాడు వద్ద ఏపీచేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయాలని తెలంగాణ కోరుతోంది. అయితే 841 అడుగుల దిగువన ఉన్నప్పుడు నీటిని తీసుకోవడానికి అవకాశం లేదంటూ రాయలసీమ ప్రాజెక్టును కొనసాగించడానికి ఏపీ ప్రయత్నిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో కృష్ణాపై కొత్త బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ శ్రీకారం చుట్టడంతోపాటు పూర్తి స్థాయిలో జల విద్యుత్తు ఉత్పత్తి చేయాలని నిర్ణయించి అమలు ప్రారంభించింది. రెండు రాష్ట్రాలు పరస్పరం బోర్డుకు ఫిర్యాదులు చేసుకొంటూనే ఇంకోవైపు విద్యుదుత్పత్తి, ఆయకట్టుకు నీటివిడుదల, నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. వీటికి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఎక్కడికక్కడ భారీగా పోలీసులను మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేపట్టడంతో ఏపీ రగిలిపోతోంది. తెలంగాణ తీరును ఇఫ్పటికే తప్పుబట్టిన ఏపీ సీఎం జగన్‌..... మరోసారి కేంద్రానికి లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల జల వివాదంపై జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ, జలశక్తి మంత్రికి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్‌..... శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులపై జోక్యం చేసుకోవాలని కోరారు. ఏపీ, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టుల దగ్గర కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలన్నారు. విద్యుదుత్పత్తి పేరుతో తెలంగాణ అక్రమంగా నీటిని వాడుకుంటోందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. అక్రమంగా వాడకున్న నీటిని ఆ రాష్ట్ర కోటాలో వేయాలని లేఖలో కోరారు. ఇక కేఆర్‌ఎంబీ అనుమతి లేకుండా ఎవరూ నీటిని వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేఆర్‌ఎంబీ వద్దన్నా వినకుండా తెలంగాణ ఏకపక్షంగా విద్యుదుత్పత్తి చేస్తోందన్న జగన్‌..... తెలంగాణ అన్ని నిబంధనలను ఉల్లంఘించిందన్నారు. ఇలాంటి చర్యలు ఇరు రాష్ట్రాల సంబంధాలకు మంచిది కాదన్నారు. తెలంగాణ చర్యలతో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరుతోపాటు తమిళనాడులోని చెన్నైకి కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవంటూ కేంద్రానికి తెలిపారు ఏపీ సీఎం జగన్.


Show Full Article
Print Article
Next Story
More Stories