ప్రభుత్వ ఆసుపత్రిలో అసాంఘిక కార్యకలాపాలు

ప్రభుత్వ ఆసుపత్రిలో అసాంఘిక కార్యకలాపాలు
x
Highlights

అది జిల్లాకే ప్రధాన ఆసుపత్రి. నిత్యం వందల సంఖ్యలో రోగులు ఈ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారు. మరిన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం కూడా చొరవ...

అది జిల్లాకే ప్రధాన ఆసుపత్రి. నిత్యం వందల సంఖ్యలో రోగులు ఈ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారు. మరిన్ని సేవలు అందించేందుకు ప్రభుత్వం కూడా చొరవ చూపుతోంది. అయితే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ఆసుపత్రి ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 350 పడకల ప్రభుత్వ ఆసుపత్రి. చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు సైతం ఇదే ప్రధాన ఆసుపత్రి. ఈ సర్కారీ దవాఖానకు నిత్యం వెయ్యి మందికి పైగా రోగులు వచ్చి వెళ్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ఆసుపత్రిలో అసాంఘిక కార్యక్రమాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి.

మరిన్ని వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రిపై కొత్త గదులను నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతం ఇప్పుడు అసాంఘిక పనులకు అడ్డాగా మారింది. కింద ఆసుపత్రి రద్దీగా ఉంటే పైన నిర్మాణ ప్రాంతంలో ఇష్టం వచ్చిన పనులు చేస్తున్నారు. కొత్త భవనాల పనులు పరిశీలించేందుకు ఇటీవల మంత్రి ఈటల రాజేందర్ ఆకస్మిక పర్యటన చేసినప్పుడు సైతం ఆ ప్రాంతంలో మద్యం బాటిళ్లు కనిపించాయి. మంత్రి నడుస్తున్న సమయంలోనే కింద మద్యం బాటిళ్లు కనపడటంతో అధికారులు, వైద్యులు ఏం సమాధానం చెప్పాలో తెలియక కంగారు పడ్డారు.

మంత్రి వెళ్లి పోయిన తర్వాత నిర్మాణ ప్రాంతంలో లోతుగా పరిశీలిస్తే అక్కడ జరుగుతున్న వ్యవహారం పూర్తిగా అర్ధమైంది. ఓ గదిలో మద్యం బాటిళ్లు, చుట్టూ గోడలపై ఇష్టానుసారంగా రాతలు కనిపించాయి. ఇది విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్‌ని వివరణ కోరగా అక్కడ కనిపించిన దృశ్యాలు వాస్తవమేనని అంగీకరించారు.

ఈ వ్యవహారాలు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇప్పుడేం కొత్త కాదు. గతంలో కూడా కొన్ని అసాంఘిక కార్యక్రమాలు ప్రభుత్వ ఆసుపత్రి లోపల నిర్మానుష్యంగా ఉన్న కొన్ని గదుల్లో జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలతో అధికారులు గట్టి చర్యలు చేపట్టడం వల్ల అలాంటి ఘటనలు తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు హాస్పిటల్ పైన నిర్మిస్తున్న కొత్త అంతస్తుల్లో ఇలాంటి దృశ్యాలు కనబడటం కలకలంగా మారింది. ఎవరైనా బయట వ్యక్తులు హాస్పిటల్ లోపలికి వచ్చి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారా? లేక ఆసుపత్రి సిబ్బందే ఇలా చేస్తున్నారా అన్న విషయాలపై దర్యాప్తు చేయాల్సి ఉంది.

ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వ హాస్పిటల్‌కి ఉన్న పేరు కాస్త పోయే ప్రమాదం ఉందని అంటున్నారు. వెంటనే ఇలాంటి వ్యవహారాలపై సీరియస్‌గా దృష్టి పెట్టకపోతే ఈ అసాంఘిక కార్యక్రమాలు నేర ప్రవృత్తి కూడా దారితీసే అవకాశం ఉందంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories