ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు

No School Books In Adilabad District | TS News
x

ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్ధులకు పాఠ్య పుస్తకాల కష్టాలు

Highlights

Adilabad: పక్షం రోజులు గడుస్తున్నా.. స్కూళ్లకు చేరని పుస్తకాలు

Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు...ఆది నుంచి కష్టాలు తప్పడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా...ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందలేదు. దీంతో వారి చదువులు ముందుకు సాగడం లేదు. పాఠ్యపుస్తకాలు లేక పోవడం.. తరగతులు అంతంత మాత్రమే జరగడంతో...స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం అందించే బుక్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందలేదు. దీంతో క్లాస్ రూమ్‌లలో ఏం చదవాలో, ఎవరిని అడగాలో తెలియని అయోమయం నెలకొంది. స్కూళ్ళు ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాలు సరఫరా చేస్తామని విద్యాశాఖ ప్రకటించినప్పటికీ.. అది ఆచరణలో సాధ్యం కాలేదు. జిల్లాలోని చాలా పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు రాకపోవడంతో విద్యార్థుల చదువులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. గత పదిహేను రోజుల నుండి స్టూడెంట్స్, కేవలం రాకపోకలకు పరిమితమౌతున్నారు. తమకు పుస్తకాలూ ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు

ఆదిలాబాద్ వ్యాప్తంగా 14వందల39 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 1లక్ష 35వేల 868 విద్యార్ధులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంగతి ఎలా ఉన్నా...సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది. బోధనకు, అభ్యాసనకు అవసరమయ్యే పాఠ్యపుస్తకాలు ఇంకా విద్యార్థులకు చేరకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. చాలాచోట్ల పుస్తకాలు లభ్యంకాక అందుబాటులో ఉన్న పుస్తకాలతోనే సరిపెట్టుకుంటున్నారు విద్యార్థులు. పుస్తకాల పంపిణీ పై జరుగుతున్న జాప్యంపై మండిపడుతున్నారు విద్యార్థి సంఘాల నాయకులు

పాఠ్యపుస్తకాలు ఆలస్యంగా రావడమే కాకుండా రావల్సిన వాటిలో సగమే రావడంతో... వాటిని ఎలా పంపిణీ చేయాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. మండల కేంద్రాల పాఠశాలలకు పుస్తకాలు చేరవేసేందుకు వాహనాల టెండర్లు ఇంకా పూర్తి కాలేదు. వారం లోగా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నా..వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే జిల్లాకు 3లక్షల 66వేల 398 పుస్తకాలు చేరాయని...వీటిని ఆయా పాఠశాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా అధికారులు అంటున్నారు.

ఇప్పటికి పాఠ్యపుస్తకాలు అందకపోవటంతో గత్యంతరం లేక.. గతేడాది చదువుకున్న పుస్తకాలను తీసుకుని కొందరు విద్యార్ధులు కాలం వెళ్లదీస్తున్నారు. మరికొందరు బుక్స్ లేకపోవడంతో పాఠశాలలకు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసి చదువులు మందుకు సాగేలా చూడాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories