ప్రభుత్వ సొమ్ము..ప్రయివేట్ వెంచర్లు!

New ventures in the Bellampalli outscuts
x

representational image

Highlights

* డీఎంఎఫ్టీ సొమ్ముతో వెంచర్లకు రోడ్లు * వెంచర్ల లబ్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహం * ఎస్సీ వాడకు కొత్తగా రోడ్డు వేసే సాకుతో వెంచర్ కు రోడ్లు

అదో ప్రైవేటు వెంచర్ కానీ అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు మాత్రం ప్రభుత్వ నిధులతో. అదేంటీ ప్రైవేటు వెంచరుకు ప్రభుత్వ సామ్ము ఖర్చు చేయడమేంటీ, అనుకుంటున్నారా? ఐతే ఈ స్టోరీ చూడండి.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ శివారులో జాతీయ రహదారికి అనుకుని ఉన్న కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా అనేక వెంచర్లు వెలిశాయి. రియల్టర్లకు లబ్ధి చేకూరేలా స్థానిక ప్రజాప్రతినిధి ప్రభుత్వ సొమ్ముతో రోడ్డు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లుగా ఎస్సీ వాడకు వెళ్లాలంటే మట్టి రోడ్డే ఉండేది. అనూహ్యంగా కాలనీ పరిధిలోనే ఓ వెంచర్ ఏర్పడగానే కాలనీవాసులకు సీసీ రోడ్డు కల్పిస్తున్నామనే సాకుతో ప్రైవేటు వ్యక్తులకు అనుచిత లబ్ధిచేసేలా తతంగం జరుగుతోంది. ఇదే జాతీయ రహదారికి అనుకునే ఉన్న మరో వెంచర్ కు వెళ్లేందుకు 60 ఫీట్లకు పైగా ఉన్న మెయిన్ రోడ్డుతో పాటు కొత్తగా ఏర్పడబోయే కాలనీల్లో ప్లాట్ల మధ్య అంతర్గతంగా 33 ఫీట్ల సీసీ రోడ్డు పనులు మొదలయ్యాయి. ఈ రెండు వెంచర్ల లబ్ధి కోసం ఏకంగా డీఎంఎఫ్టీ నిధులు 52 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

ఇదే కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని గోండుగూడ ప్రజలు అనేక ఏళ్లుగా కనీస రోడ్డు సౌకర్యం లేకుండా అవస్థలు పడుతున్నారు. ఇటు కన్నాల మీదుగా గానీ, అటు బోయపల్లి నుంచి వెళ్లే దారుల్లో గానీ ఏ ఒక్క రోడ్డు సక్రమంగా లేదు. ఇప్పటికీ ఈ గిరిజనుల రాకపోకలకు మట్టి రోడ్లే గతి. ఇలాంటి మారుమూల గ్రామాలను కాకుండా కొత్తగా ఏర్పాటయ్యే లే అవుట్లలో సీసీ రోడ్లు వేసేందుకు అధికారులు సిద్ధపడడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే అధికారులు వెంచర్లకు లబ్ధి చేకూరేలా రోడ్లను వేస్తున్నారని విమర్శిస్తున్నారు.

మరోవైపు ప్రైవేట్ వెంచర్ల కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయడంపై స్థానిక నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు. వెంటనే వెంచర్లకు వేసే సీసీ రోడ్డు పనులు ఆపాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏఏ గ్రామాల కోసం 90 లక్షలు నిధులు మంజూరు చేసారో అవే గ్రామాలకు మళ్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

మొత్తం రోడ్డు పనులన్నీ 5 లక్షలు దాటకుండా చిన్నచిన్న బిట్లుగా విభజించి తమ వారికి ఇప్పించుకున్నారు. ఎందుకంటే 5 లక్షలు దాటి నిధులు ఖర్చు చేస్తే నిబంధనల ప్రకారం ఓపెన్ దారిలో పనులకు టెండర్ పిలవాల్సివస్తుంది. పనులకు టెండర్ పోటీ లేకుండా ఈ నిధుల పనులన్నీ ఇలా తక్కువ మొత్తానికి మార్చి పనులు చేపట్టారు.

ప్రజల రోడ్డు కష్టాలు తీర్చడం కంటే వెంచర్లకే లబ్ధి చేకూరేలా వ్యవహరించిన తీరుతో అధికారుల్లో కలవరం మొదలైంది. జిల్లా కలెక్టర్ భారతీ హొల్లికేరి డీఎంఎఫ్టీ నిధుల ఖర్చు, వెంచర్లలో జరుగుతున్న పనుల తీరుపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించడంతో ఎంపీడీవో విజయలక్ష్మీ క్షేత్రస్థాయిలో పనుల తీరును పరిశీలించి కలెక్టర్ కు ఓ నివేదికను పంపారు.

బహిరంగ మార్కెట్లో భూములకు రెక్కలు రావడంతో క్రయవిక్రయాలు ఆధికమయ్యాయి. ధరణి పేరుతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయి కొన్ని రోజుల విరామం తరువాత మళ్ళీ ఊపందుకోవడంతో రియల్టర్ల జోరు మొదలైంది. అందులో భాగంగా స్థానిక ప్రజాప్రతినిది అండదండలతో ఏకంగా సర్కారు సొమ్మునే ప్రైవేట్ వెంచర్లకు మళ్లించడం చర్చానీయాంశమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories