Telangana: శరవేగంగా జరుగుతున్న కొత్త సచివాలయం పనులు

New Secretariat Works in Telangana | Telugu News
x

Telangana: శరవేగంగా జరుగుతున్న కొత్త సచివాలయం పనులు

Highlights

Telangana: దసరా తరువాత అక్కడి నుంచి పరిపాలనకు సన్నాహాలు

Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెక్రెటరీయేట్ పనులు ఏమేరకు పూర్తయ్యాయి? తెలంగాణ నూతన సచివాలయం అనుకున్న సమయానికే అందుబాటులోకి వస్తుందా? వచ్చే దసరా నుంచి ప్రభుత్వ పాలన కొత్త సెక్రటేరియట్ నుంచే జరుగుతుందా? హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం.

తెలంగాణ నూతన సచివాలయం దాదాపుగా పూర్తయింది. వచ్చే దసరా నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తోంది. దేశంలోనే అత్యంత అధునాతన పరిజ్ఞానంతో వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నిర్మాణ బాధ్యతలను షాపూర్ జీ పల్లోమ్జీకి అప్పగించారు. ఇక ఖర్చు విషయానికొస్తే మొదట 400 కోట్లతో పూర్తవుతుందనుకున్నారు. కొద్ది రోజుల‌కే ఆ అంచ‌నాల‌ు 619 కోట్లకు పెరిగాయి. ఆరు ఫ్లోర్లు, ఆరు లక్షల చదరపు అడుగుల్లో సచివాలయ నిర్మాణానికి 400 కోట్ల రూపాయలు అవుతుందని తొలుత లెక్క‌లు క‌ట్టారు. అయితే ఆ తరువాత ఒక ఫ్లోర్ పెంచారు.. అంటే మరో లక్ష చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యం యాడ్ అయింది. దీంతో అంచనా వ్యయం ఏకంగా 219 కోట్ల రూపాయలు పెరిగింది. ఇక పనులు పూర్త‌య్యే నాటికి వెయ్యి కోట్లు దాటే అవకాశం ఉందంటున్నారు అధికారులు.

సచివాలయ నిర్మాణం ప్రారంభం నుంచి కరోనాతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాజిటివ్ కేసులు విపరీతంగా పెరగడంతో బిహార్, ఒడిశా , ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుండి రెండు వేల మందికి పైగా కార్మికులు సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో పనులు కొద్ది రోజులు మందకొడిగా జరిగాయి. ఇది కూడా వ్యయం పెరిగి ఆలస్యమవడానికి కారణమైంది అంటున్నారు అధికారులు. అయినప్పటికీ పనుల్లో వేగం తగ్గకూడదని కేసీఆర్ అధికారులను ఆదేశిస్తూ వస్తున్నారు. 2020 అక్టోబర్ 28న టెండర్లు ఖరారయ్యాయి. అప్పటి నుంచి కేసీఆర్ ఐదుసార్లు నిర్మాణ పనులు పరిశీలించారు. గత జనవరి 9న ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం బిల్డింగ్ ఫ్లోర్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పిల్లర్స్, కాంక్రీట్ వాల్స్, స్టెయిర్ కేస్, డోర్స్, విండోస్ డిజైన్లను ఇప్పటికే ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రస్తుతానికి మంత్రుల ఛాంబర్స్, కాన్ఫరెన్స్ హాల్స్, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలు దాదాపు పూర్తయినట్లే తెలుస్తోంది. రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ స్టోన్ తో ప్రత్యేక డిజైన్లు చేయిస్తున్నారు. పిల్లర్ల డిజైన్లలో కూడా ఇంజినీర్లు మార్పులు చేస్తారంటున్నారు. కాంపౌండ్ గ్రిల్ మోడల్స్, సెక్యూరిటీ స్టాఫ్, సర్వీస్ స్టాఫ్ అవసరాలకు అనుగుణంగా కొత్త సచివాలయం నిర్మిస్తున్నారు. సెక్రటేరియట్ పరిసరాల్లో ఓపెన్ గ్రౌండ్ ఫిల్లింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. లాన్, ఫౌంటెయిన్స్ పనులు కూడా వెంటనే పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. బిల్డింగ్ డిజైన్స్, కలర్స్, ఇంటీరియర్ సహా ప్రతీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

ఇరవై ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 9 లక్షల చదరపు అడుగుల్లో సమీకృత సచివాలయ నిర్మాణం జరుగుతోంది. దీంట్లో ఇప్పటివరకు అన్ని స్లాబులతో పాటు 8 లక్షల చదరపు అడుగుల మేర పనులు పూర్తయ్యాయి. 1 లక్ష క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు జరిగాయి. దాదాపు 60 వేల టన్నుల ఐరన్ ఇప్పటివరకు వినియోగించారు. నిర్మాణం పూర్తయ్యేసరికి మరో 10 నుంచి 20 వేల టన్నుల ఐరన్ అవసరమవుతుంది. 2 అంతస్తులు మినహా ఇటుక పని కూడా ఐపోయింది. సగం అంతస్తుల్లో గోడలకు లప్పం వర్క్ కంప్లీటైంది. ప్రస్తుతం డోంలు, ఫ్రంట్ ఎలివేషన్ పనులు జరుగుతున్నాయి. ఫ్రంట్ ఎలివేషన్ కోసం ధోల్పూర్ ఇసుకరాయిని వినియోగించనున్నారు. కార్పెంటర్, ప్లంబింగ్ లాంటి సైడ్ వర్క్స్ సైతం సమాంతరంగా జరుగుతున్నాయి.

ఇక మంచి గాలి, వెలుతురు ప్రసరించేలా భవనంలో మొత్తం 1008 దర్వాజాలు, 465 కిటికీలు ఉండేలా పక్కా వాస్తుతో ప్లాన్ చేశారు. ఉత్తరం వైపు రిసెప్షన్ ఉంటుంది. గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లు పూర్తిగా సాధారణ పరిపాలన శాఖకు కేటాయించే అవకాశం ఉంది. 2వ అంతస్తు పూర్తిగా ఆర్థికశాఖ అవసరాల కోసం వినియోగిస్తారు. ఇదే అంతస్తులో ముగ్గురు మంత్రుల ఛాంబర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే 3, 4, 5 అంతస్తుల్లో కూడా మంత్రులు వాళ్ల కార్యదర్శులు, సంబంధిత సెక్షన్ ఆఫీసర్లు కొలువు దీరే అవకాశం ఉంది. ఇక 6వ అంతస్తు పూర్తిగా ముఖ్యమంత్రి కోసం కేటాయిస్తారు. భవనం నైరుతి భాగంలో సీఎం ఛాంబర్ ఉంటుంది. ఇదే అంతస్తులో సీఎంఓ అధికారులు, ఇతర సిబ్బందిని అకామడేట్ చేస్తారు. ఇక్కడే విశాలమైన మీటింగు హాల్స్, మంత్రివర్గ సమావేశాల నిర్వహణ కోసం సౌండ్ ప్రూఫ్ తో మరో హాల్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

సచివాలయం నాలుగు వైపులా ప్రవేశ ద్వారాలు ఉంటాయి. తూర్పు వైపు నుంచి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. బిల్డింగు వెనుక భాగంలో సీఎం, మినిస్టర్ల వాహనాల పార్కింగ్ ఉంటుంది. దక్షిణ భాగంలో ఉన్న గేటు నుంచి అధికారులు, ఇతర ఉద్యోగులు ఎంటరవుతారు. అక్కడే వాళ్లకు పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. ఇక ఉత్తర ద్వారంలో సందర్శకులకు యాక్సెస్ ఇస్తారు. ఇక్కడే వాళ్ళ వాహనాల కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేస్తారు. ప్రాంగణంలోని పడమటి ద్వారంలో అంటే ప్రధాన భవనం వెలుపల వెనుకవైపు ఇతర సౌకర్యాల కోసం మరికొన్ని నిర్మాణాలకు ప్లాన్ చేశారు. ఇక్కడే మందిరం, మసీదు, చర్చి, బ్యాంకు, పోస్టాఫీస్, డిస్పెన్సరీ, ఇతరత్రా కార్యాలయాలు ఉంటాయి. ఇప్పటివరకు దాదాపు 60 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయి. షిఫ్టుకు 500 మంది చొప్పున మొత్తం 3 షిఫ్టుల్లో డే అండ్ నైట్ పనులు కొనసాగుతున్నాయి. పనులు శరవేగంగా పూర్తిచేసి ఈ దసరా కల్లా సమీకృత సచివాలయంలో కార్యకలాపాలు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే వెంటిలేషన్ దగ్గర నుంచి పార్కింగ్ వరకు, డిజైన్ల దగ్గర నుంచి నాణ్యత వరకు కేసీఆర్ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. అన్నింటినీ ఆరా తీస్తున్నారు. తాను సంతృప్తి చెందిన తరువాతే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. నూతన సచివాలయ రూపు రేఖలతో దేశ, విదేశాల్లో తెలంగాణ ఇమేజ్ వెలిగిపోయేలా సీఎం దగ్గరుండి పూర్తి చేయిస్తున్నారు. అయితే 80 శాతం పనులు పూర్తయి మరో 20 శాతం పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ వచ్చే దసరా నాటికి సచివాలయం అందుబాటులోకి వస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories