Sircilla: సిరిసిల్ల నేత కళాకారుడి అద్భుతప్రతిభ.. చీర బాడర్లో 108 సార్లు వచ్చిన వేములవాడ కమాన్

New Design Saree Woven Netannas In Sirisilla
x

Sircilla: సిరిసిల్ల నేత కళాకారుడి అద్భుతప్రతిభ.. చీర బాడర్లో 108 సార్లు వచ్చిన వేములవాడ కమాన్ 

Highlights

Sircilla: పట్టుపితాంబరంలో కొత్త డిజైన్ "రాజన్న సిరి పట్టు" ఆవిష్కృతం

Sircilla: అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బనంలో నుంచి దూరే చీరలనే కాకుండా, జీ 20 లోగోను మగ్గంపై నేసి సిరిసిల్ల నేతన్నల కళానైపుణ్యాన్ని ప్రపంచానికి చాటాడు సిరిసిల్లాకు చెందిన నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్‌. తెలంగాణ లోగో, కొండా లక్ష్మణ్ బాపూజీ ఫోటోలు, దేశ, రాష్ట్రనేతల ముఖచిత్రాలను ఇలా ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ఆవిష్కరిస్తూనే ఉంటాడు. తాజాగా పట్టు పితాంబరంలో కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రత్యేకతలకు గుర్తుగా చీరను నేసి మరో అద్భుతమైన ఆవిష్కరణకు తెరలేపాడు.

హరిప్రసాద్ చేనేత మగ్గంపై ఏదో ఒక నూతన ఆవిష్కరణను రూపొందిస్తూనే ఉంటాడు. గతంలో అగ్గిపెట్టలో ఇమిడే చీరను, దబ్బనంలో దూరే చీరలను చేనేత మగ్గంపై నేసి అందరి మన్ననలు పొందాడు. చేనేత మగ్గంపై జీ-20 లోగోను నేసి, ప్రపంచ, దేశాధినేతలనే అబ్బురపరిచాడు. ఏకంగా మన్‌కీబాత్‌లో ప్రధాని మోడీచే పొగడ్తల వర్షం కురిపించుకున్నాడు. ఇప్పటికే పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట్, సిద్దిపేట ఇలా ప్రతి ఊరుకో ప్రత్యేకమైన చీర ప్రసిద్ధిలో ఉంది. అవి ఆయా ఊర్లపేరుతో ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాయి. ఎందరో నేతన్నలకు నిలయమైన సిరిసిల్లకు ఇప్పటి వరకు ఎలాంటి బ్రాండ్ లేదనే లోటును పూడ్చాడు. పట్టు పితాంబరంలో కొత్త డిజైన్ రాజన్న సిరి పట్టును రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రత్యేకతలకు గుర్తుగా ఆవిష్కరించాడు. 18 రోజులు కష్టపడి చీర డిజైన్ రూపొందించుకుని, 23 రోజులు శ్రమించి చీర నేశాడు. ఈ చీరలో మొత్తం వెండి పోగులు, పట్టుదారాన్ని ఉపయోగించాడు. ఈ చీర రాజన్న సిరి పట్టు పేరుతో సిరిసిల్లకు శాశ్వతంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపునిస్తుందని ఆశిస్తున్నాడు.

సిరిసిల్లల ప్రత్యేకతలను తలపించే విధంగా ఈ చీరను నేశాడు. ఈ చీర రెండు పక్కల బాడర్‌లో వేములవాడ కమాన్ 108 సార్లు వచ్చే విధంగా నేసాడు. అంతేకాకుండా కమాన్ లో ఉన్న సింహము మరియు నెమలి బొమ్మలను 108 సార్లు వచ్చే విధంగా తన ప్రతిభను చాటాడు. చీర పల్లులో 56 కమాన్లు, 56 సింహాలు వచ్చే విధంగా మరియు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ ప్రత్యేకత అయిన కోడె మొక్కు విధానం ఎనిమిది సార్లు వచ్చే విధంగా నేశాడు. సిరిసిల్ల నేత పని ఉట్టిపడే విధంగా నూలు వడుకుతున్న విధానం బుట్టా రూపంలో 280 సార్లు వచ్చే విధంగా నేశాడు. ఇక ఈ చీర బరువు 723 గ్రాములు ఉండగా, ఈ చీరలో 226 గ్రాముల వెండి పోగులను, 497 గ్రాముల పట్టుదారంను ఉపయోగించాడు. బోలా శంకరుని రంగైన నీలపురంగు, ఈ చీర యొక్క మరో ప్రత్యేకత.

తనలాంటి చేనేత కళాకారులను రూపొందించాలనేదే, చిరకాల కోరిక కళాకారుడు ప్రసాద్‌ అంటున్నాడు. ప్రభుత్వం సహకారం అందిస్తే, నూతన ఆవిష్కరణలు రూపొందించడం కాదు, ఆవిష్కరణలు రూపొందించే కళాకారులను తయారుచేస్తానని హరిప్రసాద్ చెబుతున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories