హడలెత్తిస్తున్న నేపాలీ గ్యాంగ్ ... విలాసవంతమైన ఇళ్లే లక్ష్యం

Nepal Gang Doing Robberies in City
x

హడలెత్తిస్తున్న నేపాలీ గ్యాంగ్ ... విలాసవంతమైన ఇళ్లే లక్ష్యం

Highlights

Nepal Gang: నమ్మకంగా పని చేసి దోపిడీ, కూకట్‌పల్లి చోరీతో ఆందోళనలో ఇంటి యజమానులు

Nepal Gang: దేశంలోని ప్రముఖ నగరాల్లో పెద్ద పెద్ద ఇళ్ళలో పనిలో చేరుతారు. నమ్మకంగా పని చేస్తారు. ఇంట్లో ప్రతి ఇంచు గమనిస్తారు. అదును చూసి దోచుకెళతారు. ఇది నేపాల్ దొంగల నైజం. రెండేళ్ళ క్రితం వరుస దోపిడీలతో హడలెత్తించిన నేపాల్ ముఠాల్లోని కీలక నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో నేరాలు తగ్గాయి. తాజాగా కూకట్ పల్లి చోరీతో నగరంలో నేపాలీలను పనిలో పెట్టుకున్న యజమానులు ఆందోళనకు గురవుతున్నారు. కూకట్ పల్లిలోని వివేకానంద నగర్ లోని ఓ వ్యాపారి ఇంట్లో చోరీ కేసులో నిందితుల కోసం 5 బృందాలు గాలిస్తున్నాయి.

హైదరాబాద్ కూకట్‌పల్లి వివేకానంద నగర్ లో వడ్డేపల్లి దామోదర్ రావు వ్యాపారి ఇంట్లో ఎనిమిది నెలల క్రితం నేపాల్ కి చెందిన చక్రధర్, అతని భార్య సీత, మూడేళ్ళ కుమారుడితో కలిసి వాచ్‌మెన్‌గా చేరాడు. ఇంటి ఆవరణలోనే యజమాని వారికి ఓ గది ఇచ్చారు. నమ్మకంగా పని చేసిన చక్రధర్ అతని భార్య ఈ నెల 6వ తేదీన నాగ్ పూర్ లోని తమ బంధువుల వద్దకు వెళ్తున్నామని చెప్పారు. తిరిగి వచ్చే సమయంలో తమతో పాటు ఓ వ్యక్తిని తీసుకొని వచ్చారు. తమ బంధువని చెప్పి ఇంట్లో ఉంచుకున్నారు. ఈనెల 12న రాత్రి 8 గంటల సమయంలో దామోదర్ రావు కుటుంబ సభ్యులందరూ కొంపల్లిలో ఓ వేడుకకు వెళ్ళారు. ఇదే అదనుగా భావించిన చక్రధర్ తాను తీసుకువచ్చిన వ్యక్తి తో కలిసి ఇంటి తలుపు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. 30 లక్షల రూపాయల నగదు, 25 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ ప్రధాన రహదారికి వచ్చి ఆటోలో కుటుంబంతో సహా పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసుల నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు పాటు వారు నేపాల్ పారిపోకుండా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, కోల్‌కతా, కర్నాటక సరిహద్దులలో స్థానిక పోలీసుల సాయంతో నిఘా ఏర్పాటు చేశారు. చోరీ తర్వాత ఆటోలో వెళ్ళిన నిందితులు లక్డీకపూల్ లో దిగి నడుచుకుంటూ వెళ్తున్న సిసిటివి ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రెండేళ్ళ క్రితం సైనిక్ పురిలోని నర్సిహారెడ్డి అనే వ్యాపారి ఇంట్లో యజమానులు శుభకార్యానికి వెళ్లగా వాచ్‌మెన్ గా పనిచేసే నేపాలి కుటుంబం ఇల్లు గుల్ల చేసి పారిపోయారు. వారికోసం ఇప్పటికీ పోలీసుల గాలిస్తూనే ఉన్నారు. రాయదుర్గం ఠాణా పరిధిలోని బిఎన్ రెడ్డి హిల్స్ లో జరిగిన ఘటన సంచలనం రేపింది. మధుసూధన్ అనే వ్యాపారి ఇంట్లో పని చేసే నలుగురు వ్యక్తులు ఇంట్లో ఉన్న వారికి ఆహారంలో మత్తుమందు కలిపి 23లక్షల నగదు, 5తులాల బంగారం ఎత్తుకెళ్ళారు. నాచారంలో కూడా ఇలాంటి చోరీనే జరిగింది. నేపాల్ పనివాళ్ళను కావాలని పనిలో పెట్టుకున్న ప్రదీప్ కుమార్ బయటకు వెళ్ళిన సమయంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి ఇంట్లోని 18తులాల బంగారు ఆభరణాలు, పది లక్షల నగదు, 40తులాల వెండి కాజేసి ఉడాయించారు. మరో కేసులో నార్సింగి పోలీస్టేషన్ పరిధిలో వృద్దదంపతుల ఇంట్లో పని చేసిన నేపాల్ వ్యక్తులు అదును చూసి వారిని తాళ్ళతో కట్టేసి దోచుకుని వెళ్ళారు. ఈ కేసుల్లో కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసినా మరికొంత మంది నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు.

ఏళ్ళతరబడి భారత దేశంలో వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న నేపాలీలు దొంగతనాలు ఎలా చేస్తున్నారు ఎలాంటి వ్యూహం అమలు చేస్తారు అని గతంతో పలు కేసులు దర్యాప్తు కోసం పోలీసులు చేసిన ఆపరేషన్ నేపాల్ లో ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. చోరీ చేసి వీలైనంత త్వరగా నేపాల్ పారిపోతే ఇరు దేశాల మధ్య ఉన్న న్యాయపరమైన ఒప్పందాలే ఆసరాగా చేసుకుని నేపాలీలు దోపిడీ చేసి దేశం దాటేస్తున్నట్లు గుర్తించారు. ముఠా సభ్యులంతా ఒకేచోట ఉండరు. ఒక్కో నగరంలో ఒక్కొక్కరు ఇంటి పనికి చేరతారు. ఎక్కడ గిట్టుబాటు అవుతుందో తెలిశాకా అందరూ అక్కడికి చేరుకుని సొత్తుతో ఉడాయిస్తారు. ఒక్కసారి దొంగతనం చేసిన నగరంలో తిరిగి మరొకటి చేయరు. నేపాల్ లోని ఏడు ప్రావిన్స్ లో సుదూర పశ్చిమ్ ప్రదేశ్ ఒకటి. ఈ ప్రావిన్స్ లోని కైలాలీతో పాటు మరో మూడు, నాలుగు జిల్లాల్లో ఈ దొంగల ముఠాలుంటాయి. నలుగురైదుగురు కలిసి ఓ ముఠాగా ఏర్పడతారు. మెట్రో నగరాల్లోని విలాసవంతమైన ఇళ్లల్లో పనికి కుదురుతారు.

దొంగిలించిన సొత్తును నేపాల్‌లో తక్కువ ధరకే విక్రయిస్తారు. ఆ డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ దొంగలకు రెండు ఇళ్ళుంటాయి. ఊరిలో ఒకటి, గుట్టలపై ఒకటి. పోలీసులు వచ్చినట్లు సమాచారం రాగానే గుట్టలపై ఉన్న ఇళ్లకు చేరుకుంటారు. పై నుంచి పోలీసుల రాకపోకల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. ఇలా తెలంగాణ పోలీసులనే కాదు వివిధ రాష్ట్రాల పోలీసులకు ఈ నేపాల్ దొంగలు తలనొప్పిగా మారారు. తెలంగాణ పోలీసులు మాత్రం. చోరీ జరిగిన గంటల వ్యవధిలోనే బృందాలను ఏర్పాటు చేసి నేపాల్ కి వెళ్లే అన్ని దారుల్లో ముందుగానే వెళ్ళి జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే మూడు ముఠాలను కటకటాల్లోకి నెట్టారు.

నేపాల్ దేశస్తులను పనిలో పెట్టుకునేటపుడు తగు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. హాక్ ఐ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వారి వివరాలు నమోదు చేసి పంపిస్తే స్థానిక పోలీసులు ఉచితంగా తనిఖీ చేస్తారని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories