MLC Kavitha: హకీంపేట దారుణం కలచివేసింది

MLC Kavitha About Hakimpet Sports School Incident
x

MLC Kavitha: హకీంపేట దారుణం కలచివేసింది

Highlights

MLC Kavitha: హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌ ఘటనపై ట్విట్టర్‌లో స్పందించిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. స్కూల్‌లోని బాలికలపై ఓ అధికారి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. సాయంత్రం సమయంలో ఆట విడుపు పేరుతో వికృతి చేష్టలకు దిగుతున్నాడు. బాలికలను కారులో ఎక్కించుకొని అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో స్కూల్‌లోని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారిపై ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేదని వాపోయారు.

నిబంధనలకు విరుద్ధంగా అధికారి బాలికల హాస్టల్లోని గెస్ట్‌ రూంలోనే మకాం పెట్టినట్లు తెలుస్తోంది. తమ పట్ల సదరు అధికారి అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారంటూ హాస్టల్లోని విద్యార్థినులు ఆవేదన చెందుతున్నారు. ఆ అధికారి బలవంతపెట్టడంతో అతడితో కలిసి బయటకు వెళుతున్న విద్యార్థులు, హాస్టల్‌కు వచ్చాక, అతడు తమ పట్ల చేసిన దుశ్చేష్టలను మహిళా ఉద్యోగులకు చెప్పుకొని భోరుమంటున్నారు. కాగా స్పోర్ట్స్‌ స్కూల్‌లో తన గదికి ఎదురుగా ఉండే గదిలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో సదరు అధికారి రాసనీలలు నడుపుతున్నాడని, విద్యార్థినుల పట్ల పాల్పడుతున్న ఆగడాలకు ఆమె, మరో ఇద్దరు సీనియర్‌ కోచ్‌లు సహకరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తున్న ప్రభుత్వంలో...ఇలాంటి వాటికి తావు ఉండకూడదన్నారు. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న.. అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలన్నారు. బాధితురాళ్లకు న్యాయం చేయాలంటూ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కవిత కోరారు.

ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పందించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్‌ చేస్తామని చెప్పారు. హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో అధికారి లైంగిక వేధింపులపై... ఉన్నతాధికారులతో పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించామన్నారు. మహిళల పట్ల వేధింపులను ఏమాత్రం ఉపేక్షించబోమని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు.

హకీంపేట్ స్పోర్స్ స్కూల్స్‌లో వేధింపులపై అధికారి హరికృష్ణ స్పందించారు. ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. తప్పుడు వార్తలతో స్పోర్స్ స్కూల్ ప్రతిష్టకు భంగం కలుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో స్కూల్‌కు వచ్చే వారు ఆందోళన చెందవదన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories