జీహెచ్‌ఎంసీ విలీనంపై పెద్ద అంబర్‌పేట ప్రజల్లో మిశ్రమ స్పందన

జీహెచ్‌ఎంసీ విలీనంపై పెద్ద అంబర్‌పేట ప్రజల్లో మిశ్రమ స్పందన
x

జీహెచ్‌ఎంసీ విలీనంపై పెద్ద అంబర్‌పేట ప్రజల్లో మిశ్రమ స్పందన

Highlights

గ్రేటర్ విలీనంపై పెద్ద అంబర్ పేట్ లో మిశ్రమ స్పందన విజయవాడ హైవేను ఆనుకొని ఉన్న మున్సిపాల్టీ గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండే పెద్ద అంబర్ పేట్

పెద్ద అంబర్ పేట్ మున్సిపాల్టీ... నగర శివారుల్లో ఔటర్ రింగ్ రోడ్డు కి సమీపంలో విజయవాడ హైవేను ఆనుకుని ఉన్న మున్సిపాల్టీ. గ్రామపంచాయితీ నుండి మున్సిపాల్టీ వరకు సాగిన ప్రస్థానంలో కొంతమేర అభివృద్ధి చెందినా..ఇంకా చాలా సమస్యలు ఈ ప్రాంతాన్ని వేధిస్తున్నాయి. జీహెచ్ ఎం సీ లో ఈ మున్సిపాల్టీ ని విలీనం చేయడం పై స్థానికుల నుండి మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు పన్నుల భారం పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


హైదరాబాద్ సిటీ శివారుల్లోని మున్సిపాల్టీ ల్లో పెద్ద అంబర్ పేట్ కూడా అభివృద్ధికి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ఒకటి. ఔటర్ రింగ్ రోడ్డు తో విజయవాడ హైవే కి ఆనుకుని ఉన్న ప్రాంతం కావడం తో ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి అత్యధికులు ఆసక్తి చూపెడుతున్నారు. దీంతో ఇక్కడి భూములు..హాట్ కేకుల్లా అమ్ముడవుతూ ధరలు అమాంతం పెరిగిపోయాయి. నగరవాసులు కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చేవారికి.. అలాగే ఆంధ్రప్రాంతం నుంచి వచ్చేవారికి ఈ ప్రాంతం ఎంతో అనువైంది.. అందువల్ల ఈ ప్రాంతం ఇప్పుడు డెస్టినీ ప్లేస్ గా మారింది.


పెద్ద అంబర్ పేట్ ను 2013 మార్చి 22 న నగర పంచాయితీగా అనంతరం 2018 మార్చి 23 న మున్సిపాల్టీ గా అప్ గ్రేడ్ చేశారు. పెద్దఅంబ‌ర్‌పేట మున్సిపాలిటీలో పెద్దఅంబ‌ర్‌పేట‌, ప‌సుమాముల‌, కుంట్లూరు, త‌ట్టిఅన్నారం, మ‌ర్రిప‌ల్లి క‌లిపి 24 వార్డులు ఉండేవి. 50 వేల వ‌ర‌కు ఓటర్లు ఉన్నారు.


శివారు ప్రాంతమైన పెద్ద అంబర్ పేట్ మున్సిపాల్టీ లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతం ఉంటుంది. ఇప్పటికీ చాలా సమస్యలు ఈ మున్సిపాల్టీ లో పరిష్కారానికి నోచుకోలేదు.

మున్సిపాలిటీ మొత్తాన్ని మురుగు నీటి స‌మ‌స్య వేధిస్తున్న‌ది. ట్రంక్ లైన్‌ల ఏర్పాటు క‌ల‌గానే మిగిలిపోయి ఉన్న‌ది. ఇక త‌ట్టిఅన్నారం నుంచి మ‌ర్రిప‌ల్లిలోని మూసీ వ‌ర‌కు ట్రంక్ లైన్ పనులు క‌నీసం ప‌ట్టాలెక్క‌లేదు. దీంతో త‌ట్టిఅన్నారంలోని 11 కాల‌నీల‌తోపాటు ఆర్కేన‌గ‌ర్‌లోని రోడ్ల‌న్నీ నిత్యం మురుగుతో ప్ర‌వ‌హిస్తున్నాయి.. ఇప్ప‌టివ‌ర‌కు వీటిని గురించి ప‌ట్టించుకునే వారే లేరని స్థానికులు వాపోతున్నారు. నాయకుల హామీలు పేపర్ల కే ప‌రిమితం కావడం తో ఈ సమస్య పరిష్కారం అయ్యేదెప్పుడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇక కుంట్లూరు, ప‌సుమాముల‌తోపాటు త‌ట్టిఅన్నారంలోని అనేక కాల‌నీల‌కు క‌నీస రహ‌దారి వ‌స‌తి లేదు. చాలా చోట్ల రోడ్లుదెబ్బతిని ఆ మార్గంలో ప్రయాణించాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా వ‌ర్షాలు ప‌డితే రోడ్లు బుర‌ద‌లమయ‌మై ఎక్కడ గుంత‌ ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడటం సర్వసాధారణం అయ్యింది.

ఆర్కేన‌గ‌ర్ నుంచి మ‌ర్రిప‌ల్లి వ‌ర‌కు రోడ్డు అయితే మరీ అధ్వానంగా ఉంది .. అట‌వీ భూమి కార‌ణంతో రోడ్డు వేయ‌లేదు. నిత్యం వంద‌ల వాహ‌నాలు గుంత‌ల రోడ్డుపై న‌ర‌క‌యాత‌న‌తో ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాంతం లో రోడ్డుకి సంబంధించిన హమీ హమీ గానే మిగిలిపోయిందని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రాంత వాసులకు ప్రధాన ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే ప్రధానమని అలాంటి మార్గం పై నిర్లక్ష్యం తగదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇక చాలా ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలే..ఇప్పటికే వీటిని మున్సిపాల్టీ లో విలీనం చేయగా ఇప్పుడు జీ హెచ్ ఎం సీ లో విలీనం చేయడం పై మిశ్రమ స్పందన వస్తోంది.

ఈ మధ్యే సాయిన‌గ‌ర్‌తోపాటు మూసీ పరివాహ‌క గ్రామాలు కుత్బుల్లాపూర్‌, గౌరెల్లి, బాచారంను మున్సిపాలిటీలో విలీనం చేశారు. ఓఆర్ ఆర్‌కు ఆనుకుని ఉన్న తారామ‌తిపేట‌ను సైతం మున్సిపాలిటీలో క‌లిపారు.. ఆయా గ్రామాల్లో ప్ర‌గ‌తి అంతంత మాత్ర‌మే. వీటిని నేరుగా మున్సిపాలిటీల్లో క‌ల‌ప‌డం ఇక ఇప్పుడు జీ హెచ్ ఎం సీ లో విలీనం చేయడం తో ప్ర‌గ‌తి ప‌నులు అటుంచితే ప‌న్నుల భారం భారీగానే ప‌డ‌నుందనే ఆందోళన స్థానికుల నుండి వ్యక్తం అవుతోంది. . ప్ర‌స్తుతం మున్సిపాలిటీ ప‌రిధి త‌క్కువ‌గా ఉంటే క‌నీసం విన్న‌వించుకునే అవ‌కాశాలు ఎక్కువ‌. కానీ, జీహెచ్ ఎంసీలో విలీనంతో మా విన్న‌పాలు విన్న‌వించుకునేదెలా.. విన్న‌వారు.. వాటిని తీర్చేది క‌లే అవుతుంద‌ని స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.


ఇక కొందరు మాత్రం జీ హెచ్ ఎం సీ లో విలీనం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీ హెచ్ ఎం సీ లో విలీనం తో సరిపడా నిధులు వచ్చి తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో విలీనం కావడం.. తమకి గర్వకారణం గా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు మెరుగవుతాయని.. మంచి నీటి సరఫరా బాగా జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ ఎల్ బి నగర్ జోన్ పరిధిలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా పెద్ద అంబర్ పేట్ కార్యాలయం లో పలు రికార్డులను జిహెచ్ఎంసి హయత్ నగర్ సర్కిల్ 3 అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ కార్యాలయం బోర్డులు తొలగించి పెద్ద అంబర్ పేట్ సర్కిల్ కార్యాలయంగా మార్చడం జరిగింది. పెద్ద అంబర్ పేట్ సర్కిల్ డీసీ గా ఎస్. రవీందర్ రెడ్డి విధులను నిర్వహించనున్నారు.


పెద్ద అంబర్ పేటలో ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ప్రగతి దూరంగా ఉన్నామని.. నగరంలో భాగమైతే.. తమకు అభివృద్ధి అందుతుందని కొంతమంది సంతోష పడుతుంటే.. నగరంలో భాగమైతే.. భారం పెరుగుతుందని.. పన్నుపోట్లు ఎక్కువవుతాయని.. తమ సాధారణ జీవితం చిన్నాభిన్నమవుతుందని మరికొందరు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories