ప్రభుత్వ ఆస్పత్రులను క్రమక్రమంగా బలోపేతం చేస్తున్నాం : ఈటల రాజేందర్

తెలంగాణ అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు ఆరవరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ శాసనమండలి సమావేశాలు...
తెలంగాణ అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు ఆరవరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సమావేశంలో రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రులను క్రమక్రమంగా బలోపేతం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. కేసీఆర్ కిట్ పథకంపై సభ్యులు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అవసరమైన చోట అదనపు డాక్టర్లు, సిబ్బందని నియమిస్తున్నామని తెలిపారు. కేసీఆర్ కిట్ పథకం ద్వారా ఇప్పటి వరకు 11,91,275 మంది కుటుంబాలు లబ్ధి పొందినట్లు ఆయన పేర్కొన్నారు.
గర్భిణిల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఆశా వర్కర్లు పరిశీలిస్తున్నారని చెప్పారు. శిశు మరణాల సంఖ్య కూడా తగ్గిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల అవసరాలను తీర్చడానికి పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో పాటు మౌలిక వసతులు కల్పించామన్నారు. కేసీఆర్ కిట్ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత 50 శాతానికి పెరిగాయన్నారు. గర్భిణి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆయా ఆస్పత్రులకు పంపి డెలివరీలు చేస్తున్నారని పేర్కొన్నారు. సీజేరియన్లు కూడా తగ్గాయని మంత్రి వివరించారు. కేసీఆర్ కిట్ పథకాన్ని కేంద్రం కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం మాత్రమే డెలివరీలు అయ్యేవి. ఆరోగ్య తెలంగాణను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.