గులాబీ, కమలం మధ్య కొత్త పోటాపోటీ ఏంటి?

గులాబీ, కమలం మధ్య కొత్త పోటాపోటీ ఏంటి?
x
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో తిట్టుకున్నాయి. పార్లమెంట్‌ పోల్స్‌లో కొట్టుకున్నాయి. ఇప్పుడు మాటల తూటాలతో హీటెక్కిస్తున్నాయి. నువ్వానేనా అంటూ పోటాపోటీగా కత్తులు...

అసెంబ్లీ ఎన్నికల్లో తిట్టుకున్నాయి. పార్లమెంట్‌ పోల్స్‌లో కొట్టుకున్నాయి. ఇప్పుడు మాటల తూటాలతో హీటెక్కిస్తున్నాయి. నువ్వానేనా అంటూ పోటాపోటీగా కత్తులు నూరుతున్నాయి. నేడు తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య కొత్త ఫైట్ మొదలైంది. రెండు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, బస్తీమే సవాల్‌ అంటున్నాయి. ఇంతకీ కొత్త పోటీ ఏంటి?

పార్లమెంట్ ఎన్నిక‌ల ముగిసినప్పటి నుంచి, టీఆర్ఎస్, బీజేపీల మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేస్తే భగ్గుమంటోంది. గ‌తంలో స్నేహ పూర్వకంగా మెలిగిన రెండు పార్టీల నేత‌లు.. ఇప్పుడు క‌స్సుబుస్సు మనుకుంటున్నారు. రాష్ట్రంలో తమకు ఎదురులేద‌ని గులాబీ పార్టీ నేత‌లు చెబుతుంటేరెండేళ్ళు ఆగండి మేమేంటో చూపిస్తాం అంటూ బీజేపీ నేత‌లు హెచ్చరిక‌లు జారీ చేస్తున్నారు. నేత‌ల మాట‌ల‌తో హీటెక్కిన పాలిటిక్స్‌లోకి ఇప్పుడు స‌భ్యత్వాల లొల్లి ఎంటరై లొల్లిలొల్లి చేస్తోంది.

కొన్ని రోజుల క్రితం స‌భ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించింది టీఆర్ఎస్. ప్రతి ఎమ్మెల్యే త‌న నియోజ‌క‌వ‌ర్గంలో 50 వేల స‌భ్వత్వాలు చేయించాల‌ని గులాబీ బాస్ కేసీఆర్, టార్గెట్ విధించారు. ఈ లెక్కన టీఆర్ఎస్ స‌భ్యత్వ టార్గెట్ 59 ల‌క్షలు. గ‌తేడాది 70 ల‌క్షల స‌భ్యత్వం టార్గెట్‌తో రంగంలోకి దిగిన గులాబీ నేత‌లు, 50 ల‌క్షల మందిని టీఆర్ఎస్‌లో చేర్పించారు. ఈ యేడాది కోటి మందికి టీఆర్ఎస్ తీర్థం ఇవ్వాల‌ని ముందు భావించినా, మొదటి విడ‌త‌ను 59 ల‌క్షల టార్గెట్‌నే పెట్టుకున్నారు. గ‌తేడాది స‌భ్యత్వం చేయించేందుకు, వేరే పార్టీలు ఫీల్డ్‌లో లేక‌పోవడంతో 50 ల‌క్షల మందికి ఈజీగా మెంబర్‌షిప్‌ ఇచ్చారు.

ఈసారి కాషాయ పార్టీ కూడా మేమున్నామంటూ, టీఆర్ఎస్‌కు పోటీగా మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షానే రంగంలోకి దిగి, డిఫరెంట్‌గా రంగారెడ్డి జిల్లాలోని ఒక తండాలో గిరిజ‌న మ‌హిళ కుటుంబానికి స‌భ్యత్వం ఇచ్చి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ‌తేడాది బీజేపికి 18 ల‌క్షల‌ స‌భ్యత్వం ఉంది. ఇప్పుడు కొత్తగా మ‌రో 18 ల‌క్షలు క‌లిపి మొత్తం 36 ల‌క్షల‌కు కాషాయ కలరింగ్ ఇవ్వాల‌ని ల‌క్ష్యం పెట్టుకున్నారు. స‌భ్యత్వ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయ‌క‌పోతే, తానే ఇంటింటికి తిరిగి పార్టీ స‌భ్యత్వం చేయిస్తాన‌ని అమిత్ షా చెప్పటంతో, రాష్ట్ర బిజెపి నేత‌లు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెల‌వటం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో విలీనం కావ‌టంతో ఇదే త‌మ‌కు అనువైన స‌మ‌యంగా కాషాయ పార్టీ నేత‌లు భావిస్తున్నారు.

రెండు పార్టీల నేత‌లు, పోటాపోటీగా స‌భ్యత్వాలను చేయిస్తుండ‌టంతో గ్రామాల్లో మ‌ళ్ళీ రాజకీయ హడావుడి క‌నిపిస్తోంది. రెండు పార్టీల నేత‌లు ఇంటింటికి తిరిగి త‌మ స‌భ్యత్వం తీసుకోవాలంటే లేదు త‌మ పార్టీ స‌భ్యత్వమే తీసుకోవాల‌ని ప్రజ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కొన్నిసార్లు ఒకే ఇంటికి రెండు పార్టీల నేత‌లూ వెళ్ళి, స‌భ్యత్వ రుసుము ఇవ్వకున్నా స‌రే, ముందు ఆధార్డ్ కార్డ్, ఫోటోలు తీసుకొని రిసిప్ట్ ఇచ్చి వెళుతున్నార‌ని తెలుస్తోంది. గ‌తంలో టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న వారిని త‌మవైపు తిప్పుకునేందుకు, బీజేపీ నేత‌లు ప్రయ‌త్నాలు చేస్తుంటే, ఇత‌ర పార్టీల కార్యకర్తల‌కు గులాబీ పార్టీ స‌భ్యత్వం ఇచ్చేందుకు టీఆర్ఎస్ నేత‌లు శ్రమిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య స‌భ్యత్వం ఇచ్చేందుకు తీవ్ర పోటీ నెల‌కొన‌డంతో, ఎమ్మెల్యేలు, నేత‌లు ఎవ‌రూ మంత్రులను, సీఎంను క‌లిసేందుకు హైద‌రాబాద్ రావొద్దని, వ‌చ్చినా ఎవ‌రికీ అపాయింట్‌మెంట్‌లు లేవ‌ని టీఆర్ఎస్ ముఖ్యనేత‌లు ఆర్డర్ వేశారు. రాబోయే మున్సిప‌ల్ ఎన్నిక‌లే టార్గెట్‌గా రెండు పార్టీలు స‌భ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అర్బన్ ఏరియాల్లో ఎక్కువ స‌భ్యత్వం ఇచ్చి, పట్టు నిరూపించుకునేందుకు రెండు పార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories