Medaram Jatara: ఈనెల 21 నుంచి మేడారం జాతర ప్రారంభం

Medaram Jatara will To Start  From February 21
x

Medaram Jatara: ఈనెల 21 నుంచి మేడారం జాతర ప్రారంభం

Highlights

Medaram Jatara:తెలంగాణ కుంభమేళాకు మొదలైన భక్తుల రాక

Medaram Jatara: తెలంగాణ కుంభమేళాకు వేళయింది. మేడారం మహా జాతరకు భక్తుల రాక మొదలైంది. మహా జాతర సమీపిస్తున్న వేళ.. జాతీయ పండుగగా గుర్తింపు అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. ఆసియా ఖండంలో అతి పెద్ద గిరిజన జాతర పట్ల పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో అమ్మల సాక్షిగా చెప్పిన మాటలే అటకెక్కించే పరిస్థితి తలెత్తింది. ఈనెల 21 నుంచి ఆదివాసీ గిరిజనుల ఇలవేల్పు సమ్మక్క - సారలమ్మ జాతర మొదలు కానున్న నేపథ్యంలో జాతరకు జాతీయ హోదాపై హెచ్‌ఎం టీవీ స్పెషల్ రిపోర్ట్...

రెండేళ్లకోసారి వచ్చే పండుగ మేడారం మహా జాతర. ఈనెల 21 నుంచి నాలుగు రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం గ్రామంలో ఈ జాతర ఘనంగా జరగనుంది. మేడారం వనమంతా జనంతో నిండిపోనుంది. పండుగ రాకముందే అన్ని దారులూ మేడారం వైపు సాగుతున్నాయి. కుటుంబమంతా కలిసి ఎటయినా వెళుతోందంటే.. అది మేడారం జాతరకే అయి ఉంటుందన్న పరిస్థితి కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు ఈ జాతరకు వస్తున్నారు. జంపన్నవాగులో స్నానం, సమ్మక్క, సారక్క దర్శనం, బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడంతో కోరిన కోరికలు తప్పక తీరుతుందని భక్తులకు నమ్మకం...

జాతర ముగిసిన తర్వాత కూడా నెలరోజుల పాటు మేడారానికి భక్తులు బారులు తీరుతుంటారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి... జాతరకు తరలివచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ఎన్ని చేస్తున్నా... మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు అంశం ఎప్పటికప్పుడు రగులుతూనే ఉంది. జాతరలు వస్తున్నాయ్... పోతున్నాయ్.. తప్ప.. జాతీయ పండుగ గుర్తింపు మాత్రం దక్కట్లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జాతరకు జాతీయ హోదా విషయంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఎప్పటి నుంచో మాటల యుద్ధం కొనసాగుతోంది.

ఆదివాసీల సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మేడారం జాతరకు 1996 లో రాష్ట్ర పండుగగా గుర్తింపు లభించింది. అప్పటి నుంచి ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పాటు జాతర నిర్వహణను చేపట్టింది. తెలంగాణ ఏర్పడిన తరువాత జాతర ప్రాముఖ్యత మరింత పెరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని... కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేస్తోంది. ఈ సంవత్సరం 110 కోట్లు వెచ్చించి జాతర పనులు చేపట్టింది. అయితే బీజేపీ హయాంలో మేడారం జాతరకు జాతీయ హోదా దక్కుతుందన్న ఆశ ఉండేది.

ఇందుకు ఊతమిచ్చినట్లుగా గత జాతరలో అమ్మ వార్ల దర్శనానికి వచ్చిన కేంద్రమంత్రి బిర్సా ముండా జాతీయ హోదా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పడంతో పాటు ఎన్నికల సమయంలో ములుగుకు వచ్చిన కేంద్రమంత్రి అమిత్ షా నోట మేడారం జాతీయ హోదా మాట వినిపించడం... ఆ తర్వాత తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించిన ప్రతీసారి సమ్మక్క సారలమ్మల పేర్లు తలుచుకోవడంతో ఆశలు మరింత చిగురించాయి. మరోవైపు ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదిముర్మును మంత్రి సీతక్క కలిసి జాతీయ హోదా అంశాన్ని ప్రస్తావించినప్పుడు ఆమె కూడా సానుకూలంగా స్పందించారు. కానీ ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేర్చడం లేదు సరికదా.. రాష్ట్రానికి చెందిన నేతలు ఎంతగా డిమాండ్ చేస్తున్నా.. బీజేపీ ప్రభుత్వం ఎలాంటి స్పందన కనబర్చడం లేదు.

ఆదివాసీ ఆరాధ్యదేవతలైన సమ్మక్క, సారలమ్మల మహా జాతరకు ముహుర్తం సమీపిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు తల్లుల చెంతకు వచ్చి... ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు వారధిగా ఉన్న ఈ జాతర దేశంలోని అన్ని గిరిజన జాతులను ఏకం చేసే ఒక మహా కుంభమేళాగా జరుగుతుంది. మధ్య భారతదేశంలోని గిరిజన తెగల ప్రజలు ఖచ్చితంగా మేడారం సమ్మక్క - సారలమ్మలను ప్రతి రెండేళ్లకోసారి దర్శించుకుంటారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాలకు చెందిన భక్తులు సుమారు కోటి మందికి పైగా మేడారానికి తరలివస్తారు.

గత యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష బీజేపీ నాయకులు తాము అధికారంలోకి వస్తే మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని హామీలు ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ దిశగా అడుగులు పడలేదు. 10 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పరంగా 332 కోట్లు ఖర్చు చేశారు. ఈసారి మరో వంద కోట్లు కేటాయించి పనులను చేపట్టింది. మేడారం జాతర మీద... రోడ్లకు గానీ, హరిత హోటళ్లకు గానీ.. అక్కడ భక్తులకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది తప్ప.. కేంద్రం తరఫున ఒక్క రూపాయి కూడా రాలేదు.

ములుగులో ప్రారంభించనున్న గిరిజన విశ్వవిద్యాలయానికి సమ్మక్క సారలమ్మల పేరు ప్రకటించినా.. జాతరకు మాత్రం జాతీయ హోదా రావడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తున్నదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మేడారం జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తిస్తే దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. ఆదివాసీ సంస్కృతీ సాంప్రదాయాల గురించి అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా సెలవుదినంగా ప్రకటిస్తారు. అన్ని రాష్ట్రాల్లో జాతర గురించి ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తుంది. ఫలితంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ జాతరకు ఆదాయ మార్గం ఎక్కువవుతుంది. దేశ వ్యాప్తంగా ప్రాధాన్యం ఉన్న ఉత్సవంపై విదేశాల్లోనూ ప్రచారం జరిగి... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. ఇలాంటి పరిణామాలతో విదేశీ యాత్రికులూ జాతరను సందర్శిస్తుంటారు.

జాతర అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధుల కంటే కేంద్ర పర్యటక శాఖ నుంచి రెట్టింపు నిధులు కేటాయిస్తారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాలను అనుసంధానం చేసేందుకు జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుంది. జాతర ప్రాంతంలో అంతర్గత రోడ్లన్నీ వెడల్పయిన సీసీ రోడ్లుగా మారుతాయి. జాతరకు వచ్చే ప్రజల సౌకర్యాలు మెరుగుపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే నిధులకు కేంద్ర నిధులు తోడై జాతర ప్రాంతం మరింత అభివృద్ధి చెందే ఆస్కారముంటుంది. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతారు. దీనివల్ల భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉంటుంది.

జాతర చరిత్రకు అన్ని రాష్ట్రాల్లో, అన్ని భాషల్లో ప్రచారం కల్పించడమే కాకుండా.. పాఠ్యపుస్తకాల్లోనూ పొందుపరుస్తారు. జాతర సమయంలోనే గాక రోజూ ప్రజలు ఇక్కడికి వచ్చే విధంగా పూర్తిస్థాయి పర్యటక కేంద్రంగా మారుతుంది. పర్యాటకులను ఆకర్శించే పలు అభివృద్ధి పనులు జరుగుతాయి. దేవతను దర్శనం చేసుకోగానే వెనుదిరగకుండా అక్కడ పలుచోట్ల చూడదిగిన ప్రాంతాలుగా తీర్దిదుద్దుతారు. పార్కు, మ్యూజియం, చరిత్రకు సంబంధించిన విగ్రహాలతో కూడిన ప్రత్యేక గదులు నిర్మించే ఆస్కారముంటుంది. మేడారానికి వచ్చే వారికి సౌకర్యాలు కల్పించేందుకు సత్రాలు, శాశ్వత మూత్రశాలలు, నిరంతరం తాగునీటి సరఫరా లాంటివి ఏర్పాటు చేస్తారు. ఏ ప్రాంతం ఎటు ఉందనే సూచికల బోర్డులు, బస్టాండ్‌, హోటళ్లు పెడతారు.

జంపన్న వాగులో జాతర సమయంలోనే కొద్దిపాటి నీటిని మాత్రమే విడుదల చేస్తుంటారు. ఈ నీటిని లక్నవరం చెరువు నుంచి విడుదల చేస్తున్నారు. ఆయకట్టు రైతులు జాతర సమయంలో నీటి విడుదలకు తరచూ అడ్డు చెబుతున్నారు. అయినప్పటికీ కొంత మేరకు నీటిని విడుదల చేస్తుండడంతో ఆ నీటిలో లక్షలాది మంది భక్తులు ఒకేసారి స్నానాలు చేస్తున్నారు. ఆ నీరంతా కలుషితమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి అధిగమించవచ్చు. జంపన్నవాగుపై అక్కడక్కడ ఆయకట్టలు నిర్మిస్తారు.

మేడారం సమీపంలోని గోదావరి నుంచి శాశ్వతంగా నీటిని తీసుకొచ్చుకొనే పరిస్థితులు మెరుగుపడతాయి. భక్తులు స్నానాలాడే జంపన్నవాగును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతారు. వాగు ఒడ్డుకు ఇరువైపులా నీడనిచ్చే చెట్లు, పచ్చటి గడ్డితో అందంగా మారుస్తారు. పిల్లలు ఆడుకొనే వస్తువులు ఏర్పాటు చేస్తూ భక్తులు కూర్చొనేందుకు బల్లలు ఏర్పాటు చేస్తారు. వాగు పొడవంతా స్నాన ఘట్టాలు నిర్మించి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూస్తారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కల్గకుండా రాష్ట్ర బలగాలతో పాటు కేంద్ర బలగాలు విధులు నిర్వర్తిస్తాయి. జాతీయ ఉత్సవ హోదా పొందితే దేశ ప్రధాని హాజరయ్యే అవకాశం ఉంటుంది. దీంతో జాతర ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా అడుగులేస్తుంది..

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తే మేడారం మరింత అభివృద్ధి జరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి జాతీయ హోదా కల్పించాలని మంత్రి సీతక్క కోరారు.

మేడారం జాతర పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాలతో జరుగుతునప్పటికీ గిరిజనేతర భక్తులు, ఇతర మతాల భక్తులు పెద్దమొత్తంలో వస్తుంటారు. దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జాతరను జాతీయ ఉత్సవంగా గుర్తించి అభివృద్ధి చేయాలి. భక్తులకు ఇక్కడ నేటికీ పూర్తిస్థాయి సౌకర్యాలు అందడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు జాతీయ ఉత్సవంగా గుర్తింపు కోసం కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తీసుకురావాలి. సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయగ జాతీయ హోదా దక్కితే.. మేడారం ఖ్యాతి దేశవ్యాప్తమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories