మేడారం జాతర : ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జాతర మహోత్సవం

మేడారం జాతర : ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జాతర మహోత్సవం
x
Highlights

ప్రపంచంలోనే అతిపెద్ద జాతర. లక్షల మంది ఒకేచోటికి చేరుకునే పర్వదినం.. మూడు రోజుల పండగ.. గిరిజన కుంభమేళా.. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ...

ప్రపంచంలోనే అతిపెద్ద జాతర. లక్షల మంది ఒకేచోటికి చేరుకునే పర్వదినం.. మూడు రోజుల పండగ.. గిరిజన కుంభమేళా.. మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జాతరకు ఎలా వెళ్లాలి..? అంతపెద్ద ఉత్సవంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమ్మక్క, సారక్కలను ఎలా దర్శించుకోవాలి..? జాతరకు వెళ్లేందుకు ఉన్న దారులెన్ని..? మేడారం రూట్‌మ్యాప్‌ను ఇప్పుడు చూద్దాం..

రెండేళ్లకు ఒకసారి వచ్చే వనదేవతల సంబరం.. మేడారం జాతరకు వేళైంది. ఫిబ్రవరి 5 నుంచి 8 వ తేదీ వరకు నిర్వహించతలపెట్టిన జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌ నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. మూడు రోజుల వేడుకల్లో పాల్గొని.. సమ్మక్క సారక్కలను దర్శించుకుంటారు. అయితే దేశంలో ఎక్కడి నుంచైనా చేరుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ట్రాఫిక్‌ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌ నుంచి రావాలనుకునే భక్తులు.. భువనగిరి, ఆలేరు, జనగామ, వరంగల్, ములుగు, పసర, తాడ్వాయి మీదుగా లేదా పసర నుంచి నార్లపూర్ మీదుగా సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు చేరుకోవచ్చు. జాతరకు ఇదే ప్రధాన రహదారిగా చెబుతున్నారు. అలాగే కరీంనగర్‌ జిల్లా నుంచి వచ్చే భక్తులు హుజూరాబాద్‌, పరకాల, ములుగు, పసర, నార్లపూర్‌ మీదుగా సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకు చేరుకోవచ్చు. అలాగే కరీంనగర్‌ నుంచి మరో దారిలో కూడా మేడారం చేరుకోవచ్చు.. అది పెద్దపల్లి, మంథని, కాటారం, భూపాలపల్లి, బయ్యక్కపేట మీదుగా జంపన్నవాగుకు చేరుకోవచ్చు.

ఇక విజయవాడ నుంచి వచ్చే భక్తులు నందిగామ, ఖమ్మం, ఇల్లందు, పసర, నార్లపూర్‌ మీదుగా జాతర ప్రాంగణానికి చేరుకోవచ్చు. మరోవైపు ఖమ్మం దగ్గర నుంచి మరో దారి గుండా జాతరకు చేరుకోవచ్చు. భద్రాచలం మంగపేట లేదా వాజేడు వెంకటాపురం మీదుగా ఏటూరు నాగారం, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకోవచ్చు.

అలాగే ఛత్తీస్‌గడ్‌ నుంచి కూడా గిరిజన భక్తులు సమ్మక్క సారక్కలను దర్శించుకునెందుకు భారీగా వస్తారు. అలా వచ్చే వారు.. వాజేడు గోదావరి బ్రిడ్జీ మీదుగా.. ఏటూరునాగారం, చిన్న బోయినపల్లి, తాడ్వాయి మీదుగా మేడారం జాతరకు రావాల్సి ఉంటుంది. ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులు.. కాళేశ్వరం బ్రిడ్జీ మీదుగా మహాదేవపూర్, గారెపల్లి, నార్లపూర్‌ మీదుగా గద్దెల దగ్గరకు చేరుకోవచ్చు.

ఇక రైలు ప్రయాణీకులు మాత్రం.. వరంగల్‌ లేదా కాజీపేట స్టేషన్‌లో దిగి.. అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేటు వాహనాల ద్వారా మేడారం చేరుకోవచ్చు. అయితే ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులకు మాత్రం అధికారులు రాజమార్గం వేశారు. మేడారం చేరుకునేందుకు.. వేలాది బస్సులు నడుపుతున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌ నుంచి వచ్చే వారికి మాత్రం.. గద్దెలకు చేరువలో బస్‌స్టాప్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారు.. గద్దెలతో పాటు.. జంపన్నవాగుకు త్వరగా చేరుకోవచ్చు.

ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా.. ములుగు నుంచి నార్లాపూర్ మధ్య పలుచోట్ల ట్రాఫిక్ మళ్లిస్తారు. జంపన్న వాగు చుట్టుపక్కల సుమారు 10 ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాల పార్కింగ్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి గద్దెల వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే హన్మకొండ, ములుగు, పసర, తాడ్వాయి మీదుగా మేడారం వెళ్లేందుకు మంత్రులు, వీఐపీలు, వీవీఐపీలు, ఆర్టీసీ బస్సుల కోసం వన్ వే ఏర్పాటు చేశారు. తిరిగి వెళ్లేప్పుడు కూడా నార్లాపూర్, బయ్యక్కపేట, ఘనపురం మీదుగా పరకాల, గుడెప్పహాడ్ వరకు వన్ వే ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories