మేడ్చల్‌ జిల్లా రావల్‌కోల్‌లో దారుణం

మేడ్చల్‌ జిల్లా రావల్‌కోల్‌లో దారుణం
x
Highlights

* అప్పు తీర్చేందుకు డబ్బులివ్వలేదని తల్లి, చెల్లి హత్య * క్రికెట్‌ బెట్టింగ్‌లో భారీగా నష్టపోయిన సాయినాథ్‌రెడ్డి * ఇన్సూరెన్స్‌ డబ్బులివ్వాలని తరచూ వాగ్వాదం * డబ్బులిచ్చేందుకు నిరాకరించిన తల్లి * కక్షతో అన్నంలో విషం పెట్టి తల్లి, చెల్లిని చంపిన సాయినాథ్‌ * పోలీసుల అదుపులో నిందితుడు సాయినాథ్‌రెడ్డి

రోజు రోజుకు మనుషుల్లో రాక్షసత్వం పెరిగిపోతోంది. చెడు అలవాట్లకు బానిసలై కన్నవారు, తోడబుట్టినవారని కూడా చూడకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. అవసరమైతే.. ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటంలేదు. హైదరాబాద్‌ మేడ్చల్‌ జిల్లాలో అలాంటి ఘటనే వెలుగుచూసింది. రావల్‌కోల్‌లో తల్లి, చెల్లిని పొట్టనబెట్టుకున్నాడు ఓ దుర్మార్గుడు.

రావల్‌కోల్‌కు చెందిన ప్రభాకర్‌రెడ్డి, సునీతరెడ్డి దంపతులకు ఇద్దరు సంతానం. కొడుకు సాయినాథ్‌రెడ్డి చెడు అలవాట్లకు బానిసై చదువు మధ్యలోనే మానేయగా.. కూతురు అనూష బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతోంది. రెండేళ్ల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో భర్త ప్రభాకర్‌రెడ్డి చనిపోవడంతో.. ఆ కుటుంబానికి అండ దండా అన్నీ తానై కుటుంబపోషణ తన భుజాలపై వేసుకుంది తల్లి సునీతరెడ్డి. ఇక.. ప్రభాకర్‌రెడ్డి చనిపోవడంతో సునీతరెడ్డికి 20 లక్షలు ఇన్సూరెన్స్ క్లయిమ్ అయింది. ఆ డబ్బుపై కన్నేసిన కొడుకు సాయినాథ్‌రెడ్డి.. తనకు ఆ డబ్బును ఇవ్వాలంటూ తరచూ గొడవకు దిగేవాడు.

సాయినాథ్‌రెడ్డి క్రికెట్ బెట్టింగ్‌కు బానిసయ్యాడు. ఐపీఎల్‌లో బెట్టింగ్‌లు పెట్టి భారీ మొత్తంలో అప్పులపాలయ్యాడు. ఇక..ఆ అప్పులు తీర్చేందుకు ఇన్సూరెన్స్‌ ద్వారా వచ్చిన సొమ్మును ఇవ్వాలని తల్లి, చెల్లితో వాగ్వాదానికి దిగేవాడు. అయితే కొడుకు గురించి తెలిసిన తల్లి. ఆ డబ్బును ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న సాయినాథ్‌‌.. తల్లిని, చెల్లిని అంతమొందించాలనుకున్నాడు. పక్కా ప్లాన్‌ ప్రకారం తినే భోజనంలో విషాన్ని కలిపాడు. అది తెలియక భోజనం తిన్న తల్లి, చెల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. తల్లీకూతుళ్లను మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా. చికిత్స పొందుతూ ఈ నెల 26న చెల్లి అనూష, 27న తల్లి సునీత మృతిచెందారు.

ఇద్దరి మృతికి కొడుకు సాయినాథ్‌రెడ్డే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు. దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సాయినాథ్‌‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories