
ఒక్కటైన మహేష్ కుమార్, ధర్మపురి సంజయ్
ఒక్కటైన మహేష్ కుమార్, ధర్మపురి సంజయ్ మహేష్, డీఎస్ తనయుడి కలయికతో అంతా ఆశ్చర్యం మహేష్‌కు డీఎస్ రాజకీయ గురువు అయినప్పటికీ వైరం 2023లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన సంజయ్
ఆ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది అధికార కాంగ్రెస్. బీసీ గణనతోపాటు బీసీ రిజర్వేషన్ బిల్లుపై చివరి వరకు ప్రయత్నించిన కాంగ్రెస్.. బలమైన బీసీ నేతలను యాక్టివ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూనే.. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలను మరింత ప్రోత్సహిస్తోంది. ఫలితంగా ఆ వర్గం నేతలు పాలిటిక్స్‌లో మళ్లీ యాక్టివ్ కాబోతున్నారు. ఆ జిల్లాలో ఒకప్పుడు ఉప్పూనిప్పులా ఉన్న ఆ ఇద్దరు నేతలు చేతిలోచెయ్యేసి.. ఆలింగనం చేసుకున్నారు. ఇదంతా బీసీవాదం కోసం కృషి చేసిన ఆ నేతను ప్రోత్సహించడమేనన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ కొంతకాలం సైలెన్స్‌గా ఉన్నామళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చిన ఆ బీసీ నాయకుడెవరు..? ఆ ఉమ్మడి జిల్లా పాలిటిక్స్‌లో ఏం జరుగుతోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అందరూ ముద్దుగా డీఎస్ అని పిలుచుకునే ధర్మపురి శ్రీనివాస్.. అలనాడు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు. నిజామాబాద్ జిల్లా రాజకీయాలు ఒంటి చేత్తో శాసించిన నేత డిఎస్‌కు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో రాజకీయ వైరుధ్యం ఉండేది. డీఎస్ హస్తం పార్టీ వీడి కారులో షికారు చేశాక.. మహేష్ కుమార్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. డీఎస్ కుటుంబంతో మహేష్‌కు చాలా గ్యాప్ ఉండేది. ఇక ఆ నేతల కలయిక అసంభవం అనుకన్నారంతా. అలాంటిది అనూహ్యంగా డీఎస్ తనయుడు సంజయ్, మహేష్ కుమార్.. ఇద్దరూ చేతిలో చెయ్యేసి.. మా మధ్య ఎటువంటి గ్యాప్ లేదని, కలిసే ఉన్నామన్న సంకేతం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. ఉప్పూనిప్పనుకున్న ఈ ఇద్దరు నాయకుల కలయిక.. నిజామాబాద్ జిల్లాతోపాటు తెలంగాణ వ్యాప్తంగా హాట్‌టాపిక్ అయ్యింది.
అప్పట్లో డీఎస్.. మహేష్ కుమార్ మద్య రాజకీయంగా పోసగేది కాదు. మహేష్‌కు డీఎస్ రాజకీయ గురువు అయినప్పటికీ వీరిద్దరి మధ్య పొలిటికల్ వైరం ఉండేది. ఏడాది క్రితం డీఎస్ మరణం తర్వాత ఆయన పెద్ద కొడుకు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు. కానీ టీపీసీసీ చీఫ్‌గా ఉన్న మహేష్ కుమార్ అడ్డుకున్నారన్న ప్రచారం పార్టీలో నడిచింది. డీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిజామాబాద్ తొలి మేయర్‌గా సంజయ్ సేవలందించారు. డీఎస్ చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ బీజేపీలో చేరి నిజామాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ధర్మపురి సంజయ్ తండ్రితో కలిసి కొంతకాలం కారులో షికారు చేశారు. ఆ తర్వాత సొంత గూడు కాంగ్రెస్‌కు వచ్చారు. అయినా కొంతకాలంగా సంజయ్ కాస్త సైలెంట్‌గానే ఉంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం సంజయ్ పని చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టింగ్ పాత్ర పోషిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా మున్నూరు కాపు సామాజిక వర్గం మద్దతు ఉండేది. అయితే డీఎస్ అనారోగ్యం, మరణం తర్వాత మున్నూరు కాపు సామాజిక వర్గం ఆ పార్టీకి దూరం అయ్యారన్న టాక్ లేకపోలేదు. ఈ క్రమంలో మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు కావడంతో బీసీ వాదం మళ్లీ తెరపైకి వచ్చింది. అయినా మహేష్ గౌడ్ ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ బోలపేతానికి సమయం కేటాయిస్తుండటంతో, జిల్లాలో బీసీ నేత కొరత స్పష్టంగా కన్పిస్తోందట. ఈ పరిణామాల మధ్య ఇటీవలే నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ధర్మపురి సంజయ్ ఏకగ్రీవం అయ్యారు. దీంతో బలమైన మున్నూరు కావు సామాజిక వర్గం నేతగా ఉన్న సంజయ్‌ను కాంగ్రెస్ అధిష్టానం మళ్లీ తెరపైకి తెచ్చిందట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతోపాటు కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యతలు సంజయ్‌కు అప్పగించినట్టు తెలుస్తోంది. మాస్ అండ్ యూత్, మైనారిటీ ఫాలోయింగ్ ఉన్న బీసీ నేత సంజయ్‌కి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం ఇస్తోందన్న వాదన లేకపోలేదు. పాత రాజకీయ కక్షలు పక్కన పెట్టి.. మహేష్ కుమార్ గౌడ్, ధర్మపురి సంజయ్.. ఇద్దరూ భాయీ..భాయీ అంటూ ఒక్కటయ్యారట. ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి.. ఈ ఇద్దరి మధ్య రాజీ కుదర్చటంలో కీలక పాత్ర పోషించారన్న చర్చ నడుస్తోంది.
నిజామాబాదు జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా సంజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీ హైలైట్‌గా నిలిచింది. మహేష్ కుమార్‌ను సంజయ్.. గజమాల, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఒకే వేదికను పంచుకోవడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. డీఎస్ తనకు రాజకీయ గురువని, ఎన్.ఎస్.యు.ఐ జిల్లా అధ్యక్ష పదవిని ఇప్పించి రాజకీయ బిక్ష పెట్టారని మహేష్ కుమార్ ప్రకటించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. భారీ కటౌట్లు, ప్లెక్సీలు, హోర్డింగ్‌లతో సంజయ్.. కాంగ్రెస్ రీఎంట్రీ అదిరిందనే చర్చ పార్టీలో రీసౌండ్ చేస్తోంది. మరోవైపు సంజయ్ ప్రమాణస్వీకారోత్సవం నిజామాబాద్ నగరంలోని అన్ని వర్గాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిందనే టాక్ కొనసాగుతుంది.
రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం సంజయ్‌ను పొలిటికల్‌గా మరింత యాక్టివ్ చేయాలని అధిష్టానం భావిస్తోందట. బలమైన మున్నూరు కాపు సామాజిక వర్గం నేత, బీసీ లీడర్ కావటంతో పార్టీకి కలిసివస్తుందని హైకమాండ్ సైతం భావిస్తోందట. సంజయ్‌ను జిల్లాలో యాక్టివ్ చేస్తే బీసీలు, మున్నూరు కాపు సామాజిక వర్గం దగ్గరవుతారని పార్టీ భావిస్తోందట. మహేష్ కుమార్, ధర్మపురి సంజయ్ ఏకమవటం కాంగ్రెస్ పార్టీకి శుభ పరిణామంగా భావిస్తున్నారంతా. పార్టీలో మాజీ మేయర్ సంజయ్ యాక్టివ్ పాత్రతో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో జరిగే కార్పొరేషన్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




