Keesaragutta: అద్భుతమైన చరిత్ర .. కీసరగుట్టలో మొదలైన మహాశివరాత్రి శోభ..

Maha Shivaratri Celebrations 2024 in Keesaragutta
x

Keesaragutta: అద్భుతమైన చరిత్ర .. కీసరగుట్టలో మొదలైన మహాశివరాత్రి శోభ..

Highlights

Keesaragutta: శ్రీరాముడి చేత లింగాకారంలో పరమశివుడి ప్రతిష్ఠాపన

Keesaragutta: సాక్షాత్తు శ్రీరామచంద్రుడు నడయాడిన మహిమాన్విత క్షేత్రమది. శ్రీరాముడే స్వయంగా ఇక్కడి లింగాన్ని ప్రతిష్టించడంతో శ్రీరామ లింగేశ్వరుడిగా ఖ్యాతినొందాడు. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగి భక్తుల కొంగు బంగారంగా నిలుస్తోంది కీసర క్షేత్రం. మహాశివరాత్రి సందర్బంగా భక్తుల కోసం కీసర ఆలయంపై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం

కీసర శ్రీ రామలింగేశ్వర ఆలయం ఎంతో ప్రఖ్యాతి గాంచింది. నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరం ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తుంటారు. ముఖ్యంగా శివరాత్రి, కార్తీక మాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. స్థల పురాణం ప్రకారం రావణుడిని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో శివలింగాన్ని ఏర్పాటు చేశాడని పురాణ కథలు చెపుతున్నాయి.

కొండలు, పచ్చదనం చుట్టూ ఉన్న అందమైన లోయను ఎంచుకొని, వారణాసి నుండి శివలింగాన్నితీసుకురావాలని హనుమంతుడికి చెప్పాడు శ్రీరామచంద్రుడు. హనుమంతుడు రావడానికి ఆలస్యమవడంతో శివుడు స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షమై శివలింగం ఇచ్చాడు. అందువల్ల ఆలయంలోని లింగాన్ని స్వయంభులింగం అంటారు. శ్రీ రాముడు ప్రతిష్ఠించినందు వల్ల ఈ దేవుడిని రామలింగేశ్వరస్వామి అని కూడా పిలుస్తారు.

అయితే కొంత సమయం తరువాత, వారణాసి నుండి 101 లింగాలతో హనుమంతుడు వచ్చాడు. తాను తెచ్చిన లింగాలు ప్రతిష్ఠించలేకపోయినందుకు బాధపడుతూ లింగాలను ఆ ప్రాంతమంతా విసిరేశాడు. ఇప్పటికీ కూడా అనేక లింగాలు ఆలయం వెలుపల అన్నిచోట్ల చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. హనుమంతుడిని బాధను చూసిన శ్రీరాముడు, ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చాడు. లింగం ప్రతిష్ఠించిన కొండను కేసరి గిరి అని అన్నాడు. కాలక్రమేణా, ఈ పదం రూపాంతరం చెందుతూ కీసరగుట్టగా మారింది.

ఈ అతి పురాతనమైన ఆలయం మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఉంది. బ్రహ్మోత్సవాలు ఈనెల 11 వరకు ఇక్కడ జరగనున్నాయి.ఎనిమిదో తేదీన మహాశివరాత్రి ఉన్న సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారుగా 3 లక్షల నుండి 5 లక్షల వరకు భక్తులు జాతరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ కోసం ప్రత్యేకంగా పోలీసు టీమ్‌లను సిద్ధం చేశారు.

శివరాత్రినాడు స్వామివారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. రెండు ధర్మదర్శనం క్యూలైన్ల తో పాటు విఐపి క్యూ లైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భక్తులకు క్యూలైన్లలో మంచినీటి ప్యాకెట్లను, మజ్జిగ పంపిణీ చేస్తున్నామని ఆలయ చైర్మన్ తటాకం నాగలింగ శర్మ తెలిపారు. మహాశివరాత్రి నాడు ఆ శివయ్య దర్శన భాగ్యం పొందడమే కాకుండా ఆలయ పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని ఆలయ కమిటీ భక్తులను కోరుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories