42 ఏళ్ల తర్వాత కాళేశ్వరంలో కుంభాభిషేకం.. భారీ ఏర్పాట్లు

42 ఏళ్ల తర్వాత కాళేశ్వరంలో కుంభాభిషేకం.. భారీ ఏర్పాట్లు
x
Highlights

Maha Kumbhabhishekam: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో అరుదైన కార్యక్రమం జరగబోతోంది.

Maha Kumbhabhishekam: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో అరుదైన కార్యక్రమం జరగబోతోంది. 42 ఏళ్ల తర్వాత ఇక్కడ రుత్వికులు కుంభాభిషేకం నిర్వహించబోతున్నారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. 1982 తర్వాత ఈ అరుదైన కార్యక్రమాన్ని కాళేశ్వరంలో నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు సన్నాహాలు చేశారు. తుని తపోవన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చిదానంత సరస్వతి స్వామి పర్యవేక్షణలో శతచండీ మహారుద్ర సహిత, సహస్ర ఘటాభిషేకం, కుంబాభిషేకం నిర్వహిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో ఉన్న ఈ ఆలయానికి గోదావరి అవతల మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా విస్తరించి ఉండగా.. మరోవైపున మంచిర్యాల జిల్లా చెన్నూరు ఉంది. దీంతో ఈ కుంభాభిషేకానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది.

దట్టమైన అడవిలో ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించేందుకు కాలి బాటన, ఎడ్ల బండ్లపై వెళ్లేవారు. 1970లో కాళేశ్వరంలోని కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి ఆలయ రూపురేఖలు మారిపోయాయి. శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని వెలుగులోకి తీసుకురావాలని శృంగేరి పిఠాధిపతి సంకల్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కరీంనగర్ ఎమ్మెల్యే జువ్వాడి చొక్కారావును శృంగేరి పీఠాధిపతి పిలిపించుకుని.. క్షేత్ర ప్రాధాన్యతను వివరించి.. ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అప్పగించారు.

రోడ్లు కూడా లేని కాళేశ్వరానికి రోడ్డు సౌకర్యం కల్పించారు. స్థానికంగా ఉన్న పండితులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న వేద పండితులను కాళేశ్వరానికి తీసుకొచ్చి ఆలయ రూపురేఖలు మార్చేశారు. ఆ తర్వాత 1982లో శృంగేరీ పీఠాధిపతి కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆలయంలో కుంభాభిషేకం కార్యక్రమం జరపలేదని కాళేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు పనకంటి నగేష్ శర్మ తెలిపారు. 42 ఏళ్ల తర్వాత ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన దేవాదాయ శాఖ అధికారులు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.

మే నెలలో ప్రాణహిత పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ముందుగా కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ ఆలయ సమీపంలోనే మహారాష్ట్ర మీదుగా వస్తున్న ప్రాణహిత నది గోదావరి నదిలో కలుస్తోంది. ఇక్కడే అంతర్వాహినిగా సరస్వతి నది కలుస్తోందని చరిత్ర చెబుతోంది. మూడు నదుల సంగమంగా భాసిల్లుతున్న ఈ క్షేత్రంలో మూడు నదులకు పుష్కరాలు జరిపించే ఆనవాయితీ కొనసాగుతోంది. అయితే 7వ తేదీన ప్రారంభం కానున్న ఈ ప్రత్యేక కుంభాభిషేకం కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులతో పాటు, కాళేశ్వరం క్షేత్రంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories