KCR: ఉదయం గజ్వేల్‌.. మధ్యాహ్నం కామారెడ్డిలో కేసీఆర్‌ నామినేషన్‌

KCR Nomination In Gajwel And Kamareddy Today
x

KCR: ఉదయం గజ్వేల్‌.. మధ్యాహ్నం కామారెడ్డిలో కేసీఆర్‌ నామినేషన్‌

Highlights

KCR: సాయంత్రం కామారెడ్డిలో ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించనున్న కేసీఆర్‌

KCR: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు తమ నియోజకవర్గాల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా.. ఇవాళ సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ వేయనున్నారు. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో నామినేషన్‌ పత్రాలకు పూజలు చేయించి, వాటిపై సంతకాలు చేశారు గులాబీ బాస్. ఇవాళ గజ్వేల్‌, కామారెడ్డిలో ఆ నామినేషన్‌ పత్రాలను సమర్పించనున్నారు. ఉదయం గజ్వేల్‌లో నామినేషన్‌ వేసి.. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డికి హెలికాప్టర్‌లో చేరుకుంటారు. అక్కడి ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు నామినేషన్‌ పత్రాలను సీఎం కేసీఆర్‌ అందజేస్తారు. అనంతరం.. డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో గులాబీ దళపతి ప్రసంగిస్తారు.

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ నుంచి హెలికాప్టర్‌లో గజ్వేల్‌ టౌన్‌కు చేరుకుంటారు గులాబీ బాస్. అక్కడి నుంచి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య.. గజ్వేల్‌లో రెండు సెట్ల నామినేషన్ పత్రాలు ఆర్వోకు అందజేస్తారు. అనంతరం తిరిగి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకుంటారు. ఆ తరువాత మధ్యాహ్నం ఒంటిగంటా 40 నిమిషాలకు కామారెడ్డికి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య కామారెడ్డిలో రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు సీఎం కేసీఆర్. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్య కామారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్ని సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.

కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి స్వయంగా సీఎం కేసీఆరే బరిలోకి దిగుతుండటంతో.. గులాబీ బాస్‌ రాకపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారిగా కేసీఆర్‌.. అక్కడ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజా ఆశీర్వాద సభకు భారీగా జనసమీకరణ చేపడుతున్నారు. ఇదిలా ఉంటే.. నేటి కామారెడ్డి ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్‌ తొలిదశ ప్రచారం పూర్తవుతుంది. మూడు రోజులు గ్యాప్‌ తీసుకొని, మలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు సీఎం కేసీఆర్. ఈ నెల 13 నుంచి 28 వరకు 54 ప్రజా ఆశీర్వాద సభల్లో గులాబీ బాస్‌ పాల్గొంటారు. గ్రేటర్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు కలిపి హైదరాబాద్‌లో ఈ నెల 25న భారీ బహిరంగ సభ జరగనుంది. ఇక.. ఈ నెల 28న గజ్వేల్‌ సభతో మలి విడత ప్రచారం కూడా ముగిస్తారు గులాబీ దళపతి. మరోవైపు.. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories